బీహార్ ఇద్దరినీ భయపెడుతున్నట్లే ఉంది

బీహార్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో కూటమిల ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీ ల మధ్య సీట్ల ఒప్పందంపై [more]

Update: 2020-06-18 17:30 GMT

బీహార్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. దీంతో కూటమిల ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీ ల మధ్య సీట్ల ఒప్పందంపై చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈ కూటమి అత్యధిక స్థానాలను సాధించింది. అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై అసంతృప్తి పెరుగుతుందన్న వార్తలు ఈ కూటమికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

వలస కార్మికుల్లో …..

బీహార్ లో వలస కార్మికులు ఎక్కువ. అనేక రాష్ట్రాలకు వీరు వలస వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అయితే లాక్ డౌన్ సమయంలో వీరు ఉపాధిని కోల్పోయారు. వీరిని స్వంత రాష్ట్రానికి తీసుకు రావడంలోనూ నితీష్ కుమార్ విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. వలస కార్మికుల రాకతో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని భావించిన నితీష్ కుమార్ వారిని బీహార్ కు తీసుకు రావడంలో జాప్యం చేశారు. ఇది నితీష్ కుమార్ కు మైనస్ గా మారనుంది.

వర్గాలుగా విడిపోయి….

మరోవైపు ముస్లింలు కూడా నితీష్ కుమార్ వైపు మొగ్గు చూపడం లేదన్న వార్తలు వస్తున్నాయి. వీరంతా కాంగ్రెస్, ఆర్జేడీలకు సపోర్ట్ చేస్తారన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. మొత్తం 243 స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 125 స్థానాలు దక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో 40 స్థానాలకు గాను 39 స్థానాలను ఈ కూటమి కైవసం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయన్న నమ్మకం లేదు. ఈబీసీలు కూడా లాక్ డౌన్ కారణంగా ఆదాయం కోల్పోవడంతో అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.

సీట్ల పంచాయతీ…..

అలాగే ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలను కోరే అవకాశముందని తెలుస్తోంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు స్థానాల్లో అత్యధిక సీట్లు తమకే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీకి, జేడీయూకు మధ్య తేడా వచ్చే అవకాశముందంటున్నారు. మొత్తం మీద బీహార్ ఎన్నికలు ఈసారి బీజేపీ కూటమికి అంత అనుకూలంగా ఉండవన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అధికార పార్టీ పై ఉన్న అసంతృప్తిని విపక్ష పార్టీలు సొమ్ము చేసుకుంటాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News