తోట ఫ్యామిలీ పాలిటిక్స్ కు ఎండ్ కార్డ్ ప‌డిందా..?

తోట ఫ్యామిలీ రాజ‌కీయాలు ముగిశాయా? ఇక‌, ఆ ఫ్యామిలీ దాదాపు ప్రత్యక్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నట్టేనా? ఇప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లాలో ఇదే మాట వినిపిస్తోంది. ఈ [more]

Update: 2020-08-28 02:00 GMT

తోట ఫ్యామిలీ రాజ‌కీయాలు ముగిశాయా? ఇక‌, ఆ ఫ్యామిలీ దాదాపు ప్రత్యక్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నట్టేనా? ఇప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లాలో ఇదే మాట వినిపిస్తోంది. ఈ జిల్లాలో తోట కుటుంబానికి చాలా ప్రత్యేక‌త ఉంది. తోట ఫ్యామిలీ మొత్తంగా జిల్లాలో చ‌క్రం తిప్పాల‌ని ప్రయ‌త్నించింది. అదే స‌మ‌యంలో కొన్నాళ్లు జిల్లా రాజ‌కీయాల‌ను కూడా శాసించింది. అయితే, మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మార్పు చేసుకోక‌పోవ‌డంతో తోట ఫ్యామిలీ పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరం అవుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. స‌రే.. ఈ ఫ్యామిలీ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. సుదీర్ఘ ప్రస్థానం క‌నిపిస్తుంది.

పట్టున్న ఫ్యామిలీ కావడంతో…

దివంగ‌త మాజీ మంత్రి… అమ‌లాపురం మాజీ ఎమ్మెల్యే మెట్ల స‌త్యనారాయ‌ణ కుమార్తె తోట వాణి, ఆమె భ‌ర్త తోట న‌ర‌సింహం. తోట న‌రసింహం మాత్రం కాంగ్రెస్‌లోనే జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపుల ప్రభావం ఎక్కువ‌గా ఉన్న జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004, 2009 నుంచి వ‌రుస విజ‌యాలు సాధించారు. ఈ రెండు సార్లు కూడా ఆయ‌న జ్యోతుల నెహ్రూను ఓడించి చ‌క్రం తిప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ స‌ర్కారులో ఆయ‌న మంత్రి ప‌దవిని చేప‌ట్టారు. స్టాప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ మంత్రిగా వ్యవ‌హ‌రించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. రాష్ట్ర విభ‌జ‌న అంశం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు తోట వాణి.. 2014లో స‌మైక్యాంధ్ర కోసం జిల్లాలో భ‌జ‌న‌లు, కీర్తన‌ల ద్వారా ప్రచారం చేశారు. ఓ మంత్రి భార్యగా ఉండి ఆమె ఇలా చేయ‌డం అప్పట్లో సంచ‌ల‌న‌మైంది కూడా.

రాష్ట్ర విభజనతో…..

రాష్ట్ర విభ‌జ‌న‌తో … కాంగ్రెస్‌ను వీడి 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో పిఠాపురం నుంచి పోటీచేయాల‌ని తోట న‌ర‌సింహం భావించారు. అయితే అప్పటి స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో చంద్రబాబు తోట న‌ర‌సింహంను కాకినాడ ఎంపీగా పంపారు. ఆయ‌న అక్కడ విజ‌యం సాధించారు. అంతేకాదు… టీడీపీ పార్లమెంట‌రీ పార్టీ నాయ‌కుడిగా ప‌ద‌విని సైతం అప్పగించారు. ఇంత‌గా ఆద‌రించినా.. ఎక్కడో అసంతృప్తి మాత్రం ఈ కుటుంబాన్ని వెంటాడింది. తాము అసెంబ్లీకి వెళ్తామ‌ని పిఠాపురం లేదా జ‌గ్గంపేట అసెంబ్లీ సీట్లలో ఏదో ఒక‌టి ఇవ్వాల‌ని మ‌ళ్లీ గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మయంలో చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. అయితే, ఆయ‌న దీనికి స‌సేమిరా అన్నారు.

టీడీపీ నుంచి వైసీపీకి….

ఈ క్ర‌మంలోనే వైసీసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాము ఆసుప‌త్రిలో ఉన్నా.. చంద్రబాబు ప‌ట్టించుకోలేద‌ని, అందుకే పార్టీ మారుతున్నామ‌ని దంప‌తులు ఆరోపించారు. ఇక‌, వైసీపీలోనూ అనుకున్న పిఠాపురం టికెట్ ద‌క్కలేదు. ఎట్టకేల‌కు పెద్దాపురం టికెట్ ద‌క్కించుకుని తోట వాణి పోటీచేశారు. అనారోగ్య కార‌ణాల‌తో తోట న‌ర‌సింహం పోటీకి దూరంగా ఉన్నారు.. వాణి ఇక్కడ మాజీ హోం మంత్రి నిమ్మకాయ‌ల చిన‌రాజ‌ప్పపై ఓడిపోయారు. అయితే త‌మ‌కు రాజ్యస‌భ సీటు ఇవ్వాల‌ని పార్టీపై ఒత్తిడి పెంచారు. ధిక్కార స్వరాన్ని సైతం వినిపించారు.

ఏ పార్టీలోకి వెళ్లలేక…..

దీంతో పార్టీ వీరిని ప‌క్కన పెట్టింది. అంతేకాదు ఇప్పుడు పెద్దాపురం పార్టీ ఇంచార్జ్‌గా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇన్‌చార్జ్‌గా ఉన్న ద‌వులూరి దొర‌బాబుకు బాధ్యత‌లు అప్పగించారు. మ‌ధ్యలో బీజేపీలోకి వెళ్లేందుకు చ‌ర్చలు జ‌ర‌ప‌డంతో పాటు ఏదో ఒక ప‌ద‌వి కావాల‌న్న కండీష‌న్లు పెట్టడంతో బీజేపీ వాళ్లు ఎగాదిగా చూసి ఊరుకున్నార‌ట‌. దీంతో తోట నరసింహం వ‌ర్గం ఎటూ కాకుండా పోయంది. అటు టీడీపీ దారులు మూసుకుపోయాయి. వైసీపీ ప‌క్కన పెట్టేసింది. ఇక తోట‌ నరసింహంకు అనారోగ్యంగా ఉండ‌డంతో ఈ ఫ్యామిలీ రాజ‌కీయాల్లో కొన‌సాగే ఉద్దేశంలో కూడా లేదంటున్నారు. ఏదేమైనా తోట ఫ్యామిలీ రాజ‌కీయాలు తూర్పులో ముగిసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

Tags:    

Similar News