మండపేట మంటపుట్టిస్తుందిగా..? పైచేయి ఎవరిదో?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఏనిముషానికి ఎలా మార‌తాయో కూడా చెప్పడం క‌ష్టం. ఇదే త‌ర‌హా మార్పు.. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌వ‌ర్గం మండ‌పేట‌లో చోటు [more]

Update: 2020-04-30 05:00 GMT

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఏనిముషానికి ఎలా మార‌తాయో కూడా చెప్పడం క‌ష్టం. ఇదే త‌ర‌హా మార్పు.. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌వ‌ర్గం మండ‌పేట‌లో చోటు చేసుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుడు వేగుళ్ల జోగేశ్వర‌రావు వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు. ఆయ‌న‌ను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రయ‌త్నాలు, నాయ‌కులు వేస్తున్న ఎత్తుగ‌డలు కూడా పార‌డం లేదు. 2009 , 2014 , 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈయనకు మండపేటలో తిరుగులేని బలం ఉంది. పైగా మంచి వ్యూహ‌క‌ర్తగా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. మండ‌పేట‌లో మున్సిప‌ల్ చైర్మన్ నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న ప్రస్థానం వ‌రుస‌గా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వ‌ర‌కు కొన‌సాగుతూ ఉంది.

తిరుగులేని నేతగా ఉన్నా…..

నిజానికి రాజ‌కీయ నేత‌ల‌కు ఎలాంటి వ్యూహాలు ఉండాలో అచ్చు అలాంటి వ్యూహాల‌నే వేగుళ్ల జోగేశ్వర‌రావు అమ‌లు చేస్తున్నారు. మండ‌పేట‌లో పార్టీ ఇమేజ్‌తో పాటు త‌న‌కు తిరుగులేని విధంగా వ్యక్తిగ‌త ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోవ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. పార్టీల‌కు అతీతంగా ఆయ‌న త‌న అనుచ‌ర గ‌ణాన్ని పెంచుకోగ‌లిగారు. వివాదాల‌కు తావులేకుండా ఉండ‌డం.. ఆర్థికంగా బ‌ల‌వంతుడు కావ‌డమే ఆయ‌న‌ను హ్యాట్రిక్ విజ‌యం సాదించే స్థాయికి చేర్చింది. అయితే, పైన చెప్పుకొన్నట్టు రాజ‌కీయాలు ఒకేలా ఉండ‌వ‌ని అంటారు క‌దా.. ఇప్పుడు మండ‌పేట‌లోనూ రాజ‌కీయాలు మారాయి. వ్యూహాల‌కు వ్యూహం వేసే నాయ‌కుడిగా పేరున్న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు తోట త్రిమూర్తులు ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు పెంచుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.

తోట ఎంటర్ కావడంతో….

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సీనియ‌ర్ నాయ‌కుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ లో కీల‌క నాయ‌కుడిగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి ప‌ద‌విని పొందారు. కానీ, మండ‌లి ర‌ద్దు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన నేప‌థ్యంలో బోస్‌ను సీఎం జ‌గ‌న్ రాజ్యస‌భ‌కు ప్రమోట్ చేశారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో రాజ్యస‌భ ఎన్నిక‌లు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌గానే బోస్ రాజ్యస‌భ‌కు వెళ్లిపోవ‌డం ఖాయం. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన తోట‌ త్రిమూర్తులకు జ‌గ‌న్ అమ‌లాపురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ను అప్పగించారు. ఈ ప‌రిధిలోనే మండ‌పేట కూడా ఉంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వేగుళ్లకు చెక్ పెట్టేదిశ‌గా తోట వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

బోస్ వర్గం సహకరిస్తుందా?

ఇప్పటికే మండ‌పేట‌లో స్థానిక ఎన్నిక‌ల బాధ్యత అంతా తోట త్రిమూర్తులు చూసుకుంటున్నారు. అయితే, తోట త్రిమూర్తుల వ్యూహాలు ఏమేర‌కు సక్సెస్ అవుతాయి? అనేది చూడాలి. ఎందుకంటే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క మైన మండ‌లాల్లో టీడీపీకి మంచి ప‌ట్టుంది. మండపేట మున్సిపాల్టీ టీడీపీకి కంచుకోట‌. అలాగే మండ‌పేట‌, రాయవరం, కపిలేశ్వరపురంలలో టీడీపీ ఓటు బ్యాంకు బ‌లంగా ఉంది. సామాజికవర్గాల పరంగా చూసుకున్న వేగుళ్ళ జోగేవ్వరరావుకు మంచి సపోర్ట్ ఉంది. కమ్మ, బీసీ లలో వేగుళ్ళకు మంచి ఫాలోయింగ్ ఉంది. మ‌రో సామాజిక వ‌ర్గం నిన్న మొన్నటి వ‌ర‌కు బోసుతో న‌డిచింది. అదే, శెట్టిబ‌లిజ వ‌ర్గం. అయితే, ఇప్పుడు బోసు రాజ్యస‌భ‌కు వెళ్లిపోతుండ‌డంతో ఈ వ‌ర్గం ఎటు మ‌ళ్లుతుంది? అనేది కీల‌కంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో….

ఇక‌, మ‌రో సామాజిక వ‌ర్గం కాపులు తోట వెంటే ఉంటార‌న‌డంలో సందేహం లేదు. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో ఆర్థికంగాను, అన్ని విధాలా బ‌లంగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని త‌న వైపు తిప్పుకోలేక పోయినా బీసీల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్రయ‌త్నం చేస్తే.. తోట‌కు తిరుగులేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, వేగుళ్ల కూడా వ్యూహాల‌కు పేరు ప‌డిన నాయ‌కుడే కాబ‌ట్టి ఇద్దరి మ‌ధ్య పోరు ఎలా ఉంటుందో చూడాలి. బీసీలు ముందు నుంచి ఇక్కడ టీడీపీకి కొమ్ము కాస్తుంటారు. అయితే, ఇక్కడ తోట‌కు క‌లిసి వ‌చ్చే ప‌రిణామం.. పార్టీ అధికారంలో ఉండ‌డం. ఈ నేప‌థ్యంలో మండ‌పేట రాజ‌కీయాలు రాబోయే రోజుల్లో ఎలా మార‌తాయో చూడాలి.

Tags:    

Similar News