తోట ఎంట్రీతో సీన్ మొత్తం చిందరవందర అయిందా?

పార్టీలో కొత్త నేత‌లకు ప‌గ్గాలు అప్పగించ‌డం ద్వారా తామేదో సాధించాల‌ని ప్రతి పార్టీ అధినేత కూడా ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే సాహ‌సించి అనేక ఇబ్బందులు [more]

Update: 2020-08-19 05:00 GMT

పార్టీలో కొత్త నేత‌లకు ప‌గ్గాలు అప్పగించ‌డం ద్వారా తామేదో సాధించాల‌ని ప్రతి పార్టీ అధినేత కూడా ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే సాహ‌సించి అనేక ఇబ్బందులు వ‌చ్చినా.. వాటిని ప‌క్కన పెట్టి మ‌రీ ప‌గ్గాలు అప్పగిస్తారు. ఇలా వైసీపీలోనూ కీల‌క నేత‌గా ప‌గ్గాలు అందిపుచ్చుకున్నారు తోట త్రిమూర్తులు. రామ‌చంద్రాపురం నుంచి టీడీపీ త‌ర‌పున గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు కాపు సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపు సాధించారు. అయితే, త‌న వ్యక్తిగ‌త అవ‌స‌రాల కోస‌మో.. లేదా టీడీపీ ప‌ని అయిపోయింద‌ని అనుకున్నారో ఆయ‌న సైకిల్ దిగి ఫ్యాన్ కింద‌కు చేరిపోయారు. కృష్ణా జిల్లా జ‌గ్గయ్యపేట ఎమ్మెల్యే, విప్ సామినేని ఉద‌య‌భానుకు తోట త్రిమూర్తులు స్వయానా వియ్యంకుడు. తోట ఫ్యాన్ కింద‌కు వ‌చ్చే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా ఉద‌య‌భాను ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆయ‌న పార్టీ మార‌డంలో కీల‌కంగా వ్యవ‌హ‌రించారు.

తోటపై నమ్మకంతోనే…..

ఈ క్రమంలోనే ఆయ‌న‌కు అమ‌లాపురం పార్లమెంటు జిల్లా వైసీపీ అధ్యక్ష ప‌గ్గాల‌ను జ‌గ‌న్ అప్పగించారు. నిజానికి ఇక్కడ శెట్టి బ‌లిజ‌లు, ఎస్సీల ఆధిప‌త్యం ఎక్కువ. పైగా కోన‌సీమ‌లో అమ‌లాపురం ఎంపీ స్థానం స‌హా మూడు ఎమ్మెల్యే స్థానాలు రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిలోనే ఉన్నాయి. అయినా జ‌గ‌న్ కాపు వ‌ర్గానికి చెందిన మాత్రం తోట త్రిమూర్తులుకు ప‌గ్గాలు అప్పగించారు. ఈ బెల్ట్‌లో కాపుల‌కు బీసీల్లో బ‌లంగా ఉన్న శెట్టి బ‌లిజ‌ల‌కు, కాపుల‌కు ఎస్సీల‌కు తీవ్రమైన వైరుధ్యాలే ఎక్కువ క‌నిపిస్తాయి. స‌రే ఏదెలా ఉన్నా కోన‌సీమ‌లో వైసీపీ దూసుకుపోతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ తోట త్రిమూర్తులు పార్టీలోకి అలా ఎంట్రీ ఇచ్చి.. జిల్లా పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టారో లేదో ఈ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల మ‌ధ్య గ్రూపు రాజ‌కీయాలు పెరిగిపోయాయి.

కాపు వర్గం కూడా తోడవ్వడంతో…..

జ‌న‌సేన గెలిచిన‌ రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌న‌సేనకు చెందిన రాపాక అయిన‌ప్పటికీ.. ఇక్కడ ఆయ‌న అధికార పార్టీ త‌ర‌ఫునే చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో వైసీపీ మాజీ ఇన్‌చార్జ్ బొంతు రాజేశ్వర‌రావు, ప్రస్తుత నియోజ‌క‌వర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న పెడ‌పాటి అమ్మాజీల‌ను సొంత పార్టీలోనే కొంద‌రు ప‌క్కన పెట్టేస్తున్నారు. దీంతో ఈ ముగ్గురు నేత‌ల మ‌ధ్య నిత్యం కుంప‌టి ర‌గులుకుంటూనే ఉంది. ఇక్కడ ఏఎంసీ ప‌ద‌వుల విష‌యంలోనూ అమ్మాజీ, రాజేశ్వర‌రావు కొంద‌రికి స‌పోర్ట్ చేస్తుంటే తోట త్రిమూర్తులు మాత్రం త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ నేత‌కు ప‌రోక్షంగా స‌పోర్ట్ చేస్తున్నార‌ని వైసీపీలోనే కొంద‌రు నేత‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్క‌డ ముగ్గురు నేత‌ల‌తో పాటు ఇక్కడ రాజ‌కీయం శాసించాల‌ని చూస్తోన్న రాజుల వ‌ర్గానికి తోడు ఇప్పుడు తోట త్రిమూర్తులు ఎంట్రీతో కాపు వ‌ర్గం కూడా తోడ‌య్యింది.

సయోధ్య ప్రశ్నే లేదట….

అదేవిధంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రామ‌చంద్రపురంలోనూ వైఎసీపీలో గ్రూపులు న‌డుస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యస‌భ‌కు వెళ్లిన పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా తోట త్రిమూర్తులు, సిట్టింగ్ ఎమ్మెల్యే కం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గ్రూపులుగా మారి రాజ‌కీయాలు న‌డిపుతున్నారు. తోట‌కు మండ‌పేట ప‌గ్గాలు ఇచ్చినా ఆయ‌న మ‌న‌సంతా రామ‌చంద్రపురంలోనే ఉంది. ఇక్కడ కాపులు వ‌ర్సెస్ శెట్టిబలిజ‌ల రాజ‌కీయం ద‌శాబ్దాలుగా ఉంది. ఇక్కడ తోట‌కు, వేణుకు ఎప్పట‌కీ స‌యోధ్య ఉండే ప‌రిస్థితి లేదు. ఇక‌, పి.గ‌న్నవ‌రంలో కొండేటి చిట్టిబాబుపై శెట్టి బ‌లిజ వ‌ర్గానికి చెందిన కొంద‌రు నేత‌లు ఆగ్రహంతో ఉన్నారు. చిట్టిబాబు ఎమ్మెల్యేగా గెలిచిన యేడాదిలోనే తీవ్ర వ్యతిరేక‌త మూట‌క‌ట్టుకున్నారు.

ఆ రెండు చోట్లే కొంత బాగుందట…..

ఇక పార్లమెంటరీ జిల్లా కేంద్రమైన అమ‌లాపురంలో మంత్రి విశ్వరూప్ వ‌ర్సెస్ ఎంపీ చింతా అనూరాధ మ‌ధ్య వార్ న‌డుస్తోంది. ఇక ఇప్పుడు తోట త్రిమూర్తులు ఎంట్రీతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న కాపుల‌తో ఆయ‌న తన గ్రూప్ మెయింటైన్ చేయ‌డం విశ్వరూప్‌కు ఇబ్బందిగా మారిందంటున్నారు. ఇటీవ‌ల తోట త్రిమూర్తులు అమ‌లాపురం వ‌చ్చిన‌ప్పుడు అక్కడ కాపులంతా మంత్రి విశ్వరూప్‌ను ప‌క్కన పెట్టేసి నానా హ‌డావిడి చేశారు. ఇక్కడ కూడా తోట స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు. ఓవ‌రాల్‌గా కోన‌సీమ సెగ్మెంట్‌లో ముమ్మిడివ‌రం, కొత్తపేట నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే ప‌రిస్థితి బాగుంది.

మండపేటలోనూ….

ఇక మండ‌పేట‌లో పార్టీ ప‌రిస్థితి మాత్రం దారుణంగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వర‌రావు వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు. ఆయ‌న ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి బోసును రంగంలోకి దింపినా ప్రయోజ‌నం క‌నిపించలేదు. ఇప్పుడు తోట త్రిమూర్తులుకు మండ‌పేట ప‌గ్గాలు అప్పగించినా అక్కడ పార్టీని గాడిలో పెట్టడం త‌న వ‌ల్ల కాద‌న్న విష‌యం ఆయ‌న‌కు కూడా అర్థమైందంటున్నారు. అందుకే ఇప్పట‌కీ అక్కడ పార్టీ పుంజుకోవ‌ట్లేదు. ఏదేమైనా తోట ఇక్కడ ప‌గ్గాలు చేప‌ట్టినా ఆయ‌న‌కు ఇద్దరు మంత్రులు అయిన విశ్వరూప్‌, వేణుతో పొస‌గ‌డం లేదు. మ‌రోవైపు మంత్రి విశ్వరూప్‌కు ఎంపీ అనూరాధ‌కు గ్యాప్ ఉంది. ఇలా కోన‌సీమ‌లో వైసీపీ రాజ‌కీయం నేత‌ల మ‌ధ్య కుంప‌ట్లను రాజేస్తోంది.

Tags:    

Similar News