మూడు రాజధానుల ఎఫెక్ట్.. అక్కడ మూడ్ ఎలా ఉందంటే?
రాష్ట్రంలో పాతిక వంతు జనాభా ఉన్న రెండు కీలక జిల్లాలు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా ఈ రెండు జిల్లాలు [more]
రాష్ట్రంలో పాతిక వంతు జనాభా ఉన్న రెండు కీలక జిల్లాలు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా ఈ రెండు జిల్లాలు [more]
రాష్ట్రంలో పాతిక వంతు జనాభా ఉన్న రెండు కీలక జిల్లాలు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా ఈ రెండు జిల్లాలు అత్యంత కీలకం. భిన్నమైన అభిరుచులు, వ్యాపారాలు, వ్యవహారాలు ఉన్న ఈ జిల్లాలకు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ మంచి పేరుంది. సినీ ఇండస్ట్రీలోను, రాజకీయంగాను ఈ రెండు జిల్లాలకు చెందిన వందలు వేలాది మంది తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాంటి జిల్లాలు ఎప్పుడూ రాజకీయంగా యాక్టివ్‌గానే ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజధానుల విషయం తెరమీదికి వచ్చింది. ఇప్పటికే ఒకసారి శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అడ్డుకున్నా.. రెండోసారి మళ్లీ అసెంబ్లీలో దీనిని పాస్ చేసుకున్న జగన్ సర్కారు.. మండలిలోనూ నిబంధనల మేరకు ఆమోదం పొందినట్టయింది.
వారు మాత్రం…..
ప్రస్తుతం ఈ మూడు రాజధానుల బిల్లు.. గవర్నర్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ఆయన సంతకం చేయడం, కేంద్రానికి అంటే రాష్ట్రపతి వద్దకు పంపడం ఆయన కూడా ఓకే అంటే.. ఇక, జగన్ సర్కారు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రాజకీయంగా కీలకమైన ఈ రెండు ఉభయగోదావరి జిల్లాల వారు మూడు రాజధానులపై ఏమంటున్నారు ? వారి మనసులో ఏముంది ? అనే చర్చ జోరుగా సాగుతోంది. రెండు జిల్లాల విషయాన్ని పరిశీలిస్తే.. విడివిడిగానే వీటిని విశ్లేషించాల్సి ఉంటుంది. పశ్చిమగోదావరిలో కొన్ని ప్రాంతాల వారు అంటే.. మెట్ట-డెల్టా ప్రాంతానికి చెందిన ప్రజలు తమ తమ కోణంలో రాజధానిని కోరుకుంటున్నారు. మెట్ట ప్రాంతం వారికి కృష్ణా జిల్లాతో అనుబంధం ఎక్కువ.. సో.. వారు విజయవాడ-గుంటూరులతో కూడిన అమరావతినే రాజధానిగా కోరుతున్నారు.
పెట్టుబడులు కూడా పెట్టడంతో…
ఈ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువ మంది పార్టీలతో సంబంధం లేకుండా అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు కూడా పెట్టారు. ఇక, డెల్టా ప్రాంతానికి చెందిన చాలా మందిలో కొందరు విజయవాడ ను కోరుతుండగా.. మరికొందరు విశాఖను కోరుకుంటున్నారు. వీరిలో తటస్థ వాతావరణం కనిపిస్తోంది. ఇక రాజమండ్రికి ఆనుకుని ఉన్న కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల పెట్టుబడిదారులకు ఇప్పటికే వైజాగ్‌తో ఎక్కువ అనుబంధం ఉన్నందున వారు వైజాగ్‌ను రాజధానిగా కోరుకుంటున్నారు.
ఇక్కడ మాత్రం….
ఇక, తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే.. వీరంతా కూడా దాదాపు విశాఖను రాజధానిగా కోరుతున్నారు. తమకు అత్యంత చేరువలో ఉంటుందనే అభిప్రాయం తూర్పుప్రాంత ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడతో పాటు కాకినాడ లోక్‌సభ, కోనసీమ ప్రజలకు విజయవాడ కంటే వైజాగ్‌తోనే అనుబంధం ఎక్కువ. వైజాగ్ రియల్ ఎస్టేట్‌తో పాటు అక్కడ పలు ఇండస్ట్రీల్లో ఈ జిల్లా వాసులు భారీ పెట్టుబడులు పెట్టారు.
తటస్థ వైఖరితోనే….
ఈ క్రమంలోనే తమకు అన్ని విధాలా విశాఖ బాగుంటుందనే వారు తూర్పులో ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం. దీంతో ఈ రెండు కీలక జిల్లాల్లోనూ విశాఖపై తటస్థ వైఖరి కనిపిస్తుండడం గమనార్హం. మరో ట్విస్ట్ ఏంటంటే విజయవాడతో అనుబంధం ఉన్న పశ్చిమ వైసీపీ నేతలు కూడా అమరావతే రాజధానిగా ఉండాలని లోపల కోరుకుంటున్నారు. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాత పరిస్థితి ఎలా మారుతుంది? అనేది చూడాలని అంటున్నారు పరిశీలకులు.