మూడింటి పై “మూడ్” మారిందా?

ఏ క్షణాన అయితే విశాఖపట్నం అధికార రాజధానిగా మారుతుందో ఆ రోజే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం పుడుతుందని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ [more]

Update: 2020-01-15 14:30 GMT

ఏ క్షణాన అయితే విశాఖపట్నం అధికార రాజధానిగా మారుతుందో ఆ రోజే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం పుడుతుందని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గట్టిగానే శపధం చేస్తున్నారు. మరో వైపు విశాఖను రాజధానిగా ప్రకటించకపోతే ఉత్కల్ కళింగ ఉద్యమానికి రంగం సిధ్ధమైనట్లేనని ఏకంగా శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం భారీ ప్రకటనలు చేస్తున్నారు. ఈ రెండూ ఒకేసారి సాధ్యం కాదు, ఒకటి జరిగితే మరోటి తలనొప్పిగానే ఉంటుంది. జగన్ మూడు రాజధానుల ప్రకటన అధికార వికేంద్రీకరణ కోసం అయితే ఇపుడు మారిన పరిస్థితుల్లో ఏకంగా రాష్ట్రాల కోసం ఉద్యమం స్థాయికి చేరుకుంటుందా అన్న సందేహలు వ్యక్తం అవుతున్నాయి.

పోర్ట్ సిటీ బెస్ట్…

దశాబ్దాలుగా వెనబడి ఉన్న ఉత్తరాంధ్రకు జగన్ ఊపిరిపోసే నిర్ణయం తీసుకున్నారని, ఈ ప్రాంతానికి రాజధాని ఇవ్వడం ద్వారా అభివృధ్ధికి బీజం నాటారని తమ్మినేని పొంగిపోతున్నారు. అదే సమయంలో విశాఖను రాజధాని కాకుండా ఏ శక్తులైనా అడ్డుకుంటే మాత్రం తిప్పికొడతామని, అపుడు తమ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని హెచ్చరిస్తున్నారు. ఇంతకు ముందు ఎవరూ కనీ వినీ ఎరగని విధంగా తమ ఉద్యమం ఉంటుందని, ఒడిషా నుంచి మొదలుకుని కళింగ సీమ అంతటా అది విస్తరిస్తుందని కూడా స్పీకర్ భయపెడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ముందు శ్రీకాకుళం దాటి ఉన్న బరంపురం సహా కొన్ని జిల్లాలు ప్రాంతాలు ఒడిశాలో ఇపుడు ఉన్నాయి. వాటిని కూడా సాధించుకునేలా పోరాటం అంటే అదేదో తేనేతుట్టె కదిపినట్లే మరి.

కడప రాజధాని అట…

ఇక రాయలసీమ రాష్ట్రం అయిపోయినట్లేనని జేసీ చెప్పేస్తున్నారు. అందుకోసం ఆయన కొత్త రాజధానిగా కడపను కూడా ఎంపిక చేసేశారు. అటు అనంతపురం, ఇటు కర్నూలు, చిత్తూరు, నెల్లూరు అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో కడప ఉంటుందట. అందువల్ల కడప మన కొత్త రాజధాని అని జేసీ చెప్పేస్తున్నారు. జగన్ అలా అమరావతిని విశాఖ వైపున‌కు కదపగానే తాను ఇలా రంగంలోకి వచ్చేస్తానని కూడా జేసీ బెదిరించేస్తున్నారు. ఉంచితే అమరావతిలో రాజధాని ఉంచాలి, లేకపోతే రాయలసీమకు తరలించాలి, విశాఖ అన్నారో మాకు రాజధానులు కాదు, రాష్ట్రమే కావాలి, ఇదీ జేసీ సహా పెద్దల మాట. తాను రాజకీయంగా రోడ్డు మీద నిలబడి మరీ సీమ కోసం పోరాడుతానని జేసీ అంటున్నారు.

మూడు ముక్కలేనా…?

మరో వైపు అమరావతి రాజధాని కొనసాగించకపోతే తాము ఊరుకోమని అక్కడి రైతులు అంటున్నారు. వారు ఇప్పటికే ఉద్యమాలు మొదలెట్టేశారు. వారిని దారికి తేవడమే సర్కార్ కి కష్టమైన పరిస్థితుల్లో ఇక రాయలసీమవాసులను ఎలా బుజ్జగిస్తారో తెలియదు. ఒకవేళ అనూహ్య పరిణామలు జరిగి అమరావతిలోనే రాజధాని ఉంటే ఇటు ఉత్తరాంధ్ర, అటు సీమ కూడా ఆశలు పెంచుకుని భగ్గుమనేలా ఉన్నాయి. మొత్తానికి జగన్ అనుకున్న వికేంద్రీకరణ వేరు. ఇపుడు జరుగుతున్న రాజకీయం వేరు అన్నట్లుగా సీన్ ఉంది. మూడు ముక్కలాట కాస్తా మూడు రాష్ట్రాల పోరుగా మారుతుందా అన్నది చూడాలి మరి.

Tags:    

Similar News