దేన్నీ వదలరా? అన్నింటినీ వాడేస్తారా?

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. అంతా సజావుగా జరిగితే ఈఏడాది చివర్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజకీయాలకు ఏదీ అతీతం కాదన్నట్లు ఉంది. ఇప్పుడు కరోనా [more]

Update: 2020-08-21 17:30 GMT

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. అంతా సజావుగా జరిగితే ఈఏడాది చివర్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాజకీయాలకు ఏదీ అతీతం కాదన్నట్లు ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం, వరదలతో ప్రజల్లోకి వెళ్లడం నేతలకు కుదరడం లేదు. దీంతో అన్ని పార్టీలూ సోషల్ మీడియా ద్వారానే ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసే పార్టీలు చివరకు బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని కూడా సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

సుశాంత్ ఆత్మహత్యతో……

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బీహార్ కు చెందిన వాడు కావడం. బాలీవుడ్ స్థిరపడేందుకు ముంబయి వెళ్లి అక్కడ ఆత్మహత్యకు పాల్పడటం రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. నిజానికి సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనక బాలీవుడ్ మాఫియా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుశాంత్ రాజ్ పుత్ తండ్రి బీహార్ లో ఫిర్యాదు చేయడంతో ముంబయి వచ్చిన బీహార్ పోలీసు ఉన్నతాధికారిని క్వారంటైన్ చేయడం వివాదాస్పదంగా మారింది.

సీబీఐకి కేసు అప్పగించడంతో…..

దీంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సుశాంత్ కేసును సీబీఐ కి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కొందరు కీలక వ్యక్తులను మహారాష్ట్ర ప్రభుత్వం రక్షిస్తుందన్నది బీహార్ బీజేపీ నేతల ఆరోపణ. మహారాష్ట్ర లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన అధికారంలో ఉండటంతో సుశాంత్ ఆత్మ హత్య కేసును బీహార్ లో బీజేపీ రాజకీయంగా వాడుకుంటోంది. బీహార్ లో సుశాంత్ కుటుంబ సభ్యులకు రాజకీయ నాయకుల నుంచి ఇప్పుడు ఓదార్పు ఎక్కువయింది.

మహారాష్ట్ర బీజేపీ నేతల ప్రచారం……

త్వరలోనే మహారాష్ట్ర బీజేపీ నేతలు సయితం బీహార్ లో పర్యటించి ప్రచారం చేస్తారంటున్నారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మహారాష్ట్ర బీజేపీ నేతల నుంచే చెప్పించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించనున్నారు. బీహార్ లో జేడీయూ, బీజేపీ కూటమి ఇప్పటికే అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి రావాలని అన్ని దారులూ వెతుకుతోంది. సుశాంత్ ఆత్మహత్యను కూడా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను టార్గెట్ చేసే విధంగా ప్రచారం నిర్వహించనుంది.

Tags:    

Similar News