ఇక అవి గోవిందా గోవిందా …?

తిరుపతి వెళ్ళి వెంకన్న ను దర్శనం చేసుకోవాలి అంటే ఎవరి నియోజకవర్గాల్లో వారి ఎమ్యెల్యేలు మంత్రుల చుట్టూ ముందు ప్రదిక్షిణాలు చేయాలి. వారి కరుణ కటాక్షాలు ఉండేదాన్ని [more]

Update: 2019-07-14 09:30 GMT

తిరుపతి వెళ్ళి వెంకన్న ను దర్శనం చేసుకోవాలి అంటే ఎవరి నియోజకవర్గాల్లో వారి ఎమ్యెల్యేలు మంత్రుల చుట్టూ ముందు ప్రదిక్షిణాలు చేయాలి. వారి కరుణ కటాక్షాలు ఉండేదాన్ని బట్టి గోవిందుడి దర్శన భాగ్యం లభించే పరిస్థితి. ప్రజా ప్రతినిధులు ఇచ్చే లేఖలను బట్టి శ్రీవారి ని దగ్గర నుంచి చూసే అవకాశం లభిస్తుంది. స్వామి దర్శనం దగ్గర నుంచి చూసే విధానాన్ని బట్టి తిరుమలలో అనేక క్యూ లైన్ల పద్ధతిని ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, విఐపి బ్రేక్ లుగా విభజించారు.

విఐపి ల దర్శనాల్లో ప్రత్యేకతలు ఇవే ….

ఎల్ 1 దర్శనాన్ని అతి ముఖ్యమైన విఐపి లకు కేటాయిస్తున్నారు. వారికి కులశేఖర పడి నుంచి స్వామిని అతి సమీపంగా దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది. హారతి కూడా ఇస్తారు. ఇక ఎల్ 2 కు కులశేఖర పడి వరకు అనుమతి ఇస్తారు కానీ హారతి లభించదు. గత కొంతకాలంగా ఎల్ 2, ఎల్ 3 దర్శనాలకు పెద్దగా తేడా ఏమి ఉండటం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు, బడా వ్యాపారులు, అపర కుబేరులకు శ్రీవారి దర్శన భాగ్యం అత్యంత సులువుగా లభించడమే కాదు అన్ని సేవలు వారికే లభిస్తున్నాయి. ఇక విఐపి బ్రేక్ లకు అంతు పొంతూ ఉండటం లేదు. దాంతో సామాన్యులకు అందనంత దూరంలో శ్రీనివాసుడు నిలుస్తున్నాడు. దేవుడు ముందు అంతా సమానమే అన్న మాట గోవిందుడి విషయంలో పూర్తిగా సత్యదూరమైందే అయ్యింది.

ప్రక్షాళన దిశగా టిటిడి …

గత ప్రభుత్వాల హయాంలో అపఖ్యాతి పాలు అయిన తిరుమల ప్రతిష్టను కాపాడేందుకు చర్యలు చేపట్టేందుకు కొత్త ఛైర్మెన్ వైవి సుబ్భారెడ్డి నడుం కట్టారు. మరో వారం రోజుల్లో ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 , బ్రేక్ దర్శనాలు రద్దు చేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకునేందుకు వైవి సిద్ధం అయిపోయారు. సామాన్య భక్తులకు ఐదు గంటలలోపు దర్శనం జరిగేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని ఆయన చెబుతున్నారు. ఛైర్మెన్ గా తన నియామకం జరిగిన వెంటనే భక్తులతో నేరుగా మాట్లాడిన వైవికి సామాన్యుల కష్టాలు కళ్ళకు కట్టినట్లే కనిపించాయి. దాంతో ఆయన సమూల ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని గుర్తించారు. విఐపి బాబులు ఏడాదికోసారి మాత్రమే రండి అంటూ ఛైర్మన్ వేడుకోవడం చూస్తే ఏడుకొండలవాడికోసం వివిఐపి లు సామాన్యులను, టిటిడి అధికారులకు చుక్కలు చూపిస్తున్న వైనం చెప్పకుండానే తెలుస్తుంది.

సామాన్యులకోసం కోర్ట్ కెక్కిన భక్తుడు …

విఐపి ల సేవలో శ్రీవారు తరిస్తున్న తీరుపై ఎపి హై కోర్ట్ లో ఇప్పటికే ప్రజాహిత వాద్యం దాఖలైంది. ప్రస్తుతం టిటిడి అనుసరిస్తున్న ఎల్ 1 ఎల్ 2 విధానం తో సామాన్యులు గంటలు రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం నిరీక్షించడం దారుణమని తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని స్వామి భక్తుడు కోర్ట్ ను వేడుకున్నారు. ఈ పిటిషన్ ను విచారణ కు స్వీకరించిన కోర్ట్ దర్శన విధానం పై పూర్తి నివేదికను టిటిడి నుంచి కోరింది. దాంతో అటు పాలకమండలి ఇటు న్యాయస్థానం కూడా స్వామి దర్శనం సామాన్యులకు అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాయేమో అన్న ఆశతో భక్తులు ఆనందంగా ఎదురు చూస్తున్నారు. మరి అటు పాలకమండలి, న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.

Tags:    

Similar News