తాలిబన్లకు చుక్కలు చూపుతున్నారే?

తాలిబన్లు… ఇప్పుడు ఈ పేరు వింటేనే యావత్ అంతర్జాతీయ సమాజం వెన్నులో వణుకు పుడుతోంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఆచితూచి మాట్లాడుతోంది. సంయమనం, నిగ్రహం పాటిస్తోంది. బ్రిటన్, [more]

Update: 2021-08-23 16:30 GMT

తాలిబన్లు… ఇప్పుడు ఈ పేరు వింటేనే యావత్ అంతర్జాతీయ సమాజం వెన్నులో వణుకు పుడుతోంది. అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఆచితూచి మాట్లాడుతోంది. సంయమనం, నిగ్రహం పాటిస్తోంది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పాశ్యాత్య దేశాలదీ దాదాపు అదే పరిస్థితి. ఇక చిన్న దేశాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. పరిస్థితిని గమనిస్తూ వేచి చూసే ధోరణిని అవి అవలంబిస్తున్నాయి. అఫ్గానీలు క్షణమొక యుగంగా భయం భయంగా గడుపుతున్నారు. వారిని చూస్తే బతికుంటే బలుసాకు తినవచ్చన్న పాత తెలుగు సామెత గుర్తుకు వస్తోంది. తమ పరిస్థితి గురించి కాకుండా బిడ్డల భవితవ్యం గురించి వారు ఆందోళన చెందుతున్నారు. వారిని ఏదో ఒక విధంగా దేశం దాటించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇదీ స్థూలంగా ఇప్పుడు అఫ్గాన్ పరిస్థితి.

ఆ రెండు ప్రావిన్స్ లు…

అఫ్గాన్ లోని మొత్తం 34 ప్రావిన్స్ లకు గాను 33 తాలిబన్లకు దాసోహమన్నాయి. కానీ ఒకే ఒక్క ప్రావిన్స్ ఎదురొడ్డి ధైర్యంగా నిలిచింది. దాని పేరు పంజ్ షేర్ ప్రావిన్స్. దీని వైపు కన్నెత్తి చూడటానికి కూడా తాలిబన్లు భయపెడుతున్నారు. ప్రపంచమంతా తాలిబన్లను చూసి భయపడుతుండగా వారు మాత్రం ‘పంజ్ షేర్’ పేరు తలచుకోవడానికే భయపడుతున్నారు. ఇంతకీ పంజ్ షేర్ ప్రావిన్స్ ఏమిటి? వారిని చూసి తాలిబన్లు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు వారి జోలిపోవడం లేదన్న ప్రశ్నలు ఆసక్తి కలిగిస్తాయి. అహఫ్గాన్ రాజధాని నగరం కాబూల్ కు ఈశాన్యాన సుమారు వంద కిలోమీటర్ల దూరంలో పంజ్ షేర్ ప్రావిన్స్ విస్తరించి ఉంది. పర్షియన్ భాషలో పంజ్ షేర్ అంటే అయుదు సింహాలు అని అర్థం. అందుకే దీనికి అయిదు సింహాల గడ్డ అన్న పేరు కూడా ఉంది. పర్వతాలు, కొండలు, గుట్టలు, లోయలు, అడవులతో ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది. ప్రకృతి పరమైన అందాలతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ పచ్చదనం సంతరించుకుంటుంది. ఇక్కడి ప్రజల్లో స్వతంత్ర భావాలు, ఆత్మ గౌరవం ఎక్కువ. పోరాట పటిమా ఎక్కువే. ఎవరూ తమ మీద పెత్తనం చెలాయించడాన్ని అంగీకరించరు.

గతంలోనూ….?

1970-80 ప్రాంతాల్లో నాటి సోవియట్ యూనియన్ (ప్రస్తుత రష్యా) దండయాత్రను సైతం ఇక్కడి ప్రజలు విజయవంతంగా తిప్పికొట్టారు. ఇప్పుడు తాలిబన్లనూ తమవైపు కన్నెత్తి చూడనీయడం లేదు. పంజ్ షేర్ వ్యవహారాల్లో తలదూర్చితే కొరివితో తల గోక్కోవడమేమన్న సంగతి తాలిబన్లకు బాగా తెలుసు. పంజ్ షేర్ జనాభా (1.73 లక్షలు) తక్కువైనప్పటికీ వారు పోరాటానికి ఎప్పుడూ ముందుంటారు. 1996- 2001 మధ్య కాలంలో తాలిబన్లు దేశాన్ని పాలించి నప్పటికీ ఈ ప్రాంతం జోలికి పోలేదు. వీరివద్ద సుశిక్షితులైన సైన్యం ఉండటమే ఇందుకు కారణం. వీరినే నార్తరన్ అలయన్స్ (ఉత్తర ప్రాంత కూటమి) అని వ్యవహరిస్తారు. దీనికి నాయకుడు అహ్మద్ షా మస్సౌద్. 2001లో అల్ ఖైదా ఆయనను హతమార్చింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అహ్మద్ షా
మస్సౌద్ జూనియర్ దీనికి నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ ఈ ప్రాంతవాసే. అందువల్లే అధ్యక్షుడు లేనప్పుడు ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆయన ధైర్యంగా ప్రకటన చేశారని అఫ్గాన్ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు.

తాలిబన్లు లెక్క కాదని…?

ప్రస్తుతం ఆయన పంజ్ షేర్ నుంచే వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. సాలేహ్ ప్రకటనను ఇప్పటివరకు తాలిబన్లు ఖండించకపోవడం గమనించదగ్గ విషయం. తాలిబన్లు పవిత్రమైన ఇస్లాంకు వక్ర భాష్యం చెబుతున్నారని ఇస్లాం వ్యక్తి స్వేచ్చను గౌరవిస్తోందని, మహిళల పట్ల వివక్ష చూపడం లేదని, విద్యను ప్రోత్సహిస్తోందని ఈ ప్రాంత నాయకుడు అహ్మద్ షా మస్సౌద్ జూనియర్ చెబుతున్నారు. ఒకప్పుడు సోవియట్, తరవాత అమెరికా సేనలనే ఎదిరించిన తమకు తాలిబన్లు లెక్క కాదని ఎంతటి త్యాగాలైనా చేసి తమ ప్రాంతాన్ని కాపాడుకుంటామని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యను తాలిబన్లు గమనించినట్లే ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News