రేవంత్ పై వ్యూహం రివర్స్ అవ్వక తప్పదా… ?

తెలంగాణా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని గట్టిగా తిట్టాలి అంటే కొన్ని మాటలు వాడాల్సిందే. అవేంటి అంటే చంద్రబాబుకు కట్టు బానిస. ఆయన బినామీ. ఓటుకు నోటుకు [more]

Update: 2021-08-29 06:30 GMT

తెలంగాణా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని గట్టిగా తిట్టాలి అంటే కొన్ని మాటలు వాడాల్సిందే. అవేంటి అంటే చంద్రబాబుకు కట్టు బానిస. ఆయన బినామీ. ఓటుకు నోటుకు కేసులో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయాడు. ఇలాంటివి అంటే చాలు రేవంత్ రెడ్డి రెచ్చిపోతారు. ఆయనకు అసలే నోటి దురుసు ఎక్కువ. దాంతో ఆయన మరిన్ని తిట్లతో విరుచుకుపడతారు. అపుడు సానుభూతిని తాము ఎన్ క్యాష్ చేసుకోవచ్చు అన్నదే టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడ. అంతే కాదు కొన్ని వైఫల్యాల నుంచి జనాల దృష్టిని ఏమార్చవచ్చు. సరిగ్గా ఇక్కడే టీఆర్ఎస్ ట్రాప్ లో రేవంత్ రెడ్డి పడి అడ్డంగా ఇరుక్కుంటున్నాడనే అంటారు.

కాని వారి ఎవరు..?

రేవంత్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటున్న వారికి అర్ధం కాని విషయం ఏంటి అంటే ప్రస్తుతం తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో ఎనభై శాతం మంది జనాభా ఎవరు అని. వారంతా శుద్ధ పూసలుగా అపుడే రాజకీయాల్లోకి వచ్చిన వారు కారు. వారంతా ఏళ్ళకు ఏళ్ళు టీడీపీలో ఉండి వచ్చిన వారే. వారిలో చాలా మందికి టీఆర్ఎస్ మంత్రి పదవులు కూడా ఇచ్చి దగ్గర పెట్టుకుంది. ఇక రీసెంట్ గా టీఆర్ఎస్ లాగిన మరో టీడీపీ నాయకుడు ఎల్ రమణ. ఆయన ఏడేళ్ళుగా తెలంగాణా టీడీపీకి ప్రెసిడెంట్. పైగా బాబుకు నమ్మిన బంటుగా పేరు. ఈ రోజుకూ ఆయన చంద్రబాబుని పల్లెత్తు మాట అనరు. మరి ఆయన టీడీపీ కోవర్ట్ అవుతారా లేదా అన్నదే ప్రత్యర్ధుల ప్రశ్న.

ఆ గోత్ర నామాలే ..?

అసలు టీఆర్ఎస్ గోత్ర నామాలు చెప్పుకుంటే అన్నీ తెలుగుదేశం నుంచే కదా అన్న వారూ ఉన్నారు. కేసీఆర్ 1983లో టీడీపీలో చేరి 2000 వరకూ పనిచేశారు. అంటే సుదీర్ఘంగా పదిహేడేళ్ల పాటు అన్న మాట. ఈ సమయంలో ఆయన పలు మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి మంత్రిగా చేశారు. డిప్యూటీ స్పీకర్ కూడా ఆయన హోదాను అనుభవించారు. చివరికి మంత్రి పదవి దక్కలేదు అన్న బాధతోనే కదా టీఆర్ఎస్ ని స్థాపించి బయటకు వచ్చినది అని ప్రత్యర్ధులు చెబుతున్నారు. మరో వైపు చూస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్, కామ్రెడ్స్, టీడీపీలతో పొత్తులు పెట్టుకుని పలు మార్లు ఎన్నికల బరిలోకి దిగింది. అందువల్ల ఈ రాజకీయ బంధువర్గం అంతా అటూ ఇటూ ఉందనే అనుకోవాలి.

మేలు చేసేదే….?

రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సన్నిహితుడు అంటూ ఈసారి టీఆర్ఎస్ ఎంత గట్టిగా విమర్శలు చేసినా కూడా ఆ పార్టీకి ఉపయోగపడకపోగా బూమరాంగ్ అవుతుంది అంటున్నారు. ఎలా అంటే తెలంగాణా నిండా టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. వారంతా ఇన్నాళ్ళూ సరైన నాయకుడు టీడీపీకి లేక టీఆర్ఎస్ కి ఓట్లుగా మారారు. ఇపుడు టీఆర్ఎస్ మీద కోపం వస్తే కచ్చితంగా వేరే పార్టీకే వేయాలి. కాంగ్రెస్ లో తమ మాజీ తమ్ముడే సీఎం అవుతాడు అనుకుంటే టీడీపీ ఓట్లు అన్నీ కూడా తెలంగాణావ్యాప్తంగా కన్సాలిడేట్ అవుతాయి. అవన్నీ మూకుమ్మడిగా కాంగ్రెస్ కి పడితే టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ని అతి పెద్ద చిల్లు పడిపోవడం ఖాయం. అందువల్ల పదే పదే టీడీపీ కోవర్ట్, బినామీ అని రేవంత్ రెడ్డి మీద బాణాలు వేస్తే అవి కచ్చితంగా రివర్స్ అవుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆ మీదట టీయారెస్ పెద్దల ఇష్టం.

Tags:    

Similar News