గెలిచినా….ఓడినా….??

తమిళనాడులో టీటీవీ దినకరన్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆయన గతంలో నెగ్గిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రెషర్ గుర్తు వచ్చింది. అది ఆయనకు అచ్చొచ్చింది. [more]

Update: 2019-03-30 18:29 GMT

తమిళనాడులో టీటీవీ దినకరన్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆయన గతంలో నెగ్గిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రెషర్ గుర్తు వచ్చింది. అది ఆయనకు అచ్చొచ్చింది. అదే గుర్తును తమ పార్టీకి ఇవ్వాలని దినకరన్ తెగ ప్రయత్నించారు. కానీ ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించలేదు. ఆయనకు చివరకు గిఫ్ట్ ప్యాక్ గుర్తుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అభ్యర్థులందరికీ కామన్ సింబల్ కేటాయించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు కొంత కలసి వచ్చేట్లు ఉన్నా సుప్రీంకోర్టు ఉత్తర్వులు భవిష్యత్తులో ఆయనను ఇబ్బంది పెట్టేవిధంగానే ఉన్నాయి.

కామన్ గుర్తు వచ్చినా…..

తమిళనాడులో లోక్ సభ ఎన్నికలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతోనే ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వీరందరి గెలుపు బాధ్యతను దినకరన్ తన భుజాల మీద వేసుకోవాల్సి ఉంది. గుర్తు రాకపోవడంతోనే కొంత సమస్యను దినకరన్ పార్టీ ఎదుర్కొంటోంది. దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తర్వాత మేనత్త శశికళ సూచన మేరకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ ని స్థాపించారు.

ఆర్థిక సాయంపై…..

పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో దినకరన్ కొంత ఇబ్బందులు పడుతున్నారు. ప్రచార వ్యూహాలను రూపొందించడంలో విఫలమవుతున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. శశికళ జైలులో నుంచి ఇచ్చే సూచనలను అమలు చేయడం తప్ప మరేదీ చేయడం లేదంటున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆర్థిక సహకారం విషయంలో కూడా దినకరన్ తటపటాయిస్తున్నట్లు చెబుతున్నారు. మేనత్త గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆర్థిక సహకారం పార్టీ నుంచి అందకపోతే తాము ఎలా గెలుస్తామని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సూటిగానే ప్రశ్నించినట్లు సమాచారం.

గెలిచినా స్వతంత్రులేనా….?

ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తీర్పు కూడా భవిష్యత్తులో దినకరన్ కు ఇబ్బందులు తెచ్చే విధంగా ఉన్నాయి. దినకరన్ పార్టీ తరుపున అభ్యర్థులు గెలిచినా వారిని స్వతంత్ర అభ్యర్థులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష‌్టం చేయడం దినకరన్ కు ఇరకాటమేనని చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా గెలిచినా వారు దినకరన్ పార్టీ ఎమ్మెల్యేలుగా పరిగణించరు కాబట్టి వారు ఎవరికి? ఏ పార్టీకి మద్దతిచ్చినా అనర్హత వేట పడదు. ఎన్నికల ఫలితాలను బట్టి దినకరన్ పార్టీ నుంచి గెలిచిన వారు ఎవరికి మద్దతిచ్చినా ఏం కాదు. ఇలా దినకరన్ కష్టపడి తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నప్పటికీ ఆయనకు దినదినగండంగానే ఉండక తప్పందంటున్నారు.

Tags:    

Similar News