తుమ్మల సడెన్‌గా గుర్తొచ్చారే… అసలు కథ ఇదే
తుమ్మల నాగేశ్వరరావు ఈ పేరుకు తెలుగు రాజకీయాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి సమైక్య రాష్ట్రంలో కావొచ్చు… ప్రత్యేక తెలంగాణ ఏర్పాడ్డాక కావొచ్చు.. ఉమ్మడి [more]
తుమ్మల నాగేశ్వరరావు ఈ పేరుకు తెలుగు రాజకీయాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి సమైక్య రాష్ట్రంలో కావొచ్చు… ప్రత్యేక తెలంగాణ ఏర్పాడ్డాక కావొచ్చు.. ఉమ్మడి [more]
తుమ్మల నాగేశ్వరరావు ఈ పేరుకు తెలుగు రాజకీయాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాటి సమైక్య రాష్ట్రంలో కావొచ్చు… ప్రత్యేక తెలంగాణ ఏర్పాడ్డాక కావొచ్చు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల మాటే వేదవాక్కుగా ఉండేది. దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా టీడీపీలో ఉన్నా… టీఆర్ఎస్‌లో ఉన్నా.. పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తుమ్మలకు తిరుగు ఉండేది కాదు. అలాంటి తుమ్మల హవా గత రెండేళ్లుగా కనుమరుగవుతూ వస్తోంది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి కందాళ ఉపేందర్‌రెడ్డి అనే ఓ అనామక నేత చేతుల్లో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో తుమ్మలను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీ నేతలు అందరూ ఏకం కావడంతో పాటు సామాజిక వర్గాల పరంగా ఉపేందర్‌రెడ్డిని గెలిపించేందుకు అందరూ కలవడం… ఇటు సొంత పార్టీ నేతలు కూడా ఓ చేయి వేయడంతో తుమ్మల పాలేరులో ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినా.. మంత్రిగా ఉన్నా కూడా ఓడిపోయారు.
అకస్మాత్తుగా ప్రేమ….
అప్పటి నుంచి రాజకీయంగా తుమ్మల నాగేశ్వరరావు వెనకబాటు ప్రారంభమైంది. ఆ తర్వాత మంత్రి అయిన పువ్వాడ అజయ్‌కు మంత్రి కేటీఆర్ సపోర్ట్ ఉండడంతో ఆయన చెలరేగిపోతూ వస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు కీలక పదవులను తన అనుచరగణానికి కట్టబెట్టుకున్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావును సైడ్ చేసేసిన అజయ్ చివరకు పాలేరులో పరోక్షంగా కందాళ ఉపేందర్‌రెడ్డికి సపోర్ట్ చేస్తూ నియోజకవర్గంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు ప్రాభవాన్ని నామమాత్రం చేయడంతో చివరకు తుమ్మల రాజకీయ వైరాగ్యంతో తన వ్యవసాయ క్షేత్రమైన దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఉంటూ వ్యవసాయ పనులు పర్యవేక్షించుకుంటున్నారు. అలాంటి తుమ్మలపైను ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేకమైన ప్రేమ కురిపిస్తుండడం టీఆర్ఎస్ వర్గాల్లో సంచలనమైంది.
బీజేపీ స్కెచ్ తో…..
కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పట్టించుకోని నేతలు చాలా మందే ఉన్నారు. ఈ లిస్టులో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఎప్పుడు అయితే కేటీఆర్ అండదండలతో పువ్వాడ దూకుడు పెంచారో అప్పుడే తుమ్మల హవా తగ్గిపోయింది. తుమ్మలకు ఎమ్మెల్సీ వస్తుందన్న ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. అలాంటి తుమ్మలపై ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేకమైన ప్రేమ కురిపించేస్తోందట. ఇందుకు అనేక కానేక సంఘటనలు ఉన్నాయని తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ఎస్‌లో పక్కన పెట్టినా ఆయనకు రాజకీయంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా… తెలంగాణలో కమ్మ సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉంది. ఇక ఏపీలో ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తుమ్మలపై కాషాయ దళం గురి పెట్టిందన్న వార్తలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తుమ్మలతో పాటు మరో కమ్మ నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇద్దరికి మంచి ఆఫర్ ఇచ్చి పార్టీలోకి లాక్కోవాలని బీజేపీ స్కెచ్ గీస్తోందట.
అందుకే ప్రయారిటీ…..
ఈ వార్తలతో అలెర్ట్ అయిన టీఆర్ఎస్ అధిష్టానం తుమ్మల నాగేశ్వరరావు ప్రాధాన్యాన్ని పెంచేసిందంటున్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలకు స్వయంగా మంత్రులు వెళ్లి మరీ తుమ్మలను ఆహ్వానిస్తున్నారు. త్వరలోనే గ్రేటర్ ఖమ్మం మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి తేడా జరిగి…. దుబ్బాక సీన్ రిపీట్ అయితే టీఆర్ఎస్ పనైపోయిందన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లిపోతాయి. ఆ భయంతోనే ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావును పక్కన పెట్టామన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకూడదనే ఇప్పుడు తుమ్మల ప్రాధాన్యం పెంచేసిందంటున్నారు.
అందుకే కొత్త జోష్…..
ఈ క్రమంలోనే తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ముఖ్య నేతల సమావేశం అనంతరం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌కు అక్షింతలు వేశారని టాక్. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావును కలుపుకుని వెళ్లాలని సూచనలు చేయడంతో పువ్వాడతో పాటు మరో మంత్రి నిరంజన్ రెడ్డి స్వయంగా హెలీకాఫ్టర్‌లో తుమ్మల ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను జిల్లాలో రైతువేదిక ప్రారంభోత్సవానికి తీసుకువచ్చారు. అంతకు ముందు కొద్ది రోజుల క్రితమే మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం తుమ్మల ఇంటికి వెళ్లారు. అటు ఎంపీ నామా సైతం తుమ్మల ఇంటికి వెళ్లి ఇద్దరు కలిసి పలు ఫంక్షన్లకు వెళుతున్నారు. ఈ పరిణామాలతో తుమ్మలకు మళ్లీ రాజకీయ పునర్వైభవం వచ్చిందన్న ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఇదే సమయంలో ఈ కార్యక్రమాలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సైతం ఆహ్వానం వచ్చినా ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. ఏదేమైనా అధిష్టానం తాజా చర్యలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా తుమ్మల వర్గంలో కొత్త జోష్ అయితే వచ్చింది.