రెండు వార్తలు….. బోలెడు ప్రశ్నలు…?

వార్తలు మోసే వాడి వార్త…. వార్తే కాదు. వార్త బాధ్యత తప్ప వార్త ఉపాధి కాదు. వార్తలు మోసినందుకు జీతం అసలే ఆశించకూడని రోజులివి. కారణం వార్తలు [more]

Update: 2020-07-18 09:30 GMT

వార్తలు మోసే వాడి వార్త…. వార్తే కాదు. వార్త బాధ్యత తప్ప వార్త ఉపాధి కాదు. వార్తలు మోసినందుకు జీతం అసలే ఆశించకూడని రోజులివి. కారణం వార్తలు కొనే వాళ్ళు లేరు కాబట్టి ఉచితంగా వార్తలు మోయాలి. నిన్న, ఈ రోజు మూడు చావులు, రెండు వార్తలతో తలెత్తిన ప్రశ్నలు. కరోనాతో కడప జిల్లాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు మరణించారు. ఎన్టీవీ లో పని చేసే టౌన్ రిపోర్టర్ తో పాటు, మరో పత్రికలో పని చేసే విలేకరి మరణించడం సహజంగానే జర్నలిస్ట్ చావు., రోజు చదివే చావు వార్తల్లో భాగం కాదు కాబట్టి సోషల్ మీడియాలో తప్ప అది ఎక్కడ కనిపించదు. పైగా చనిపోయిన వాళ్ళు తమ ఉద్యోగులు అని చెబితే సాయం చేయాల్సిన బాధ్యత సంస్థకు ఉంటుంది. అసలు జీతాలు ఇవ్వని ఉద్యోగాలకు మళ్ళీ అనవసరపు తలనొప్పి, ఖర్చు ఎందుకని యాజమాన్యాలు మౌనంగా ఉండిపోతాయి. అతను మా ఉద్యోగి కాదు అని ఒక్కమాటలో సరిపెట్టేస్తాయి. అక్కడితో ఆ కథ ముగుస్తుంది.

కుటుంబం ఏమైపోతుందో?

ఇక మరణించిన వారి కుటుంబం ఏమైందనే సంగతి కూడా ఎవరికి పట్టదు. బతికినన్ని రోజులు జర్నలిస్ట్ అనే భ్రమలో కాలర్ ఎగరేసుకుని తిరిగిన ప్రాణం చచ్చాక కుటుంబాన్ని దిక్కుమొక్కు లేకుండా చేసి పోతుంది. పని చేసిన వాళ్ళకే లేని బాధ్యత తమకు ఎందుకు అని మిగతా వాళ్ళు ప్రెస్ క్లబ్ లో ఓ దండేసి జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తాయి. ప్రభుత్వం ఆదుకోవడం ఏమిటి, పని చేయించుకున్న వాళ్ళు ఆదుకోవాలి అని మాత్రం అడిగే సాహసం చేయరు. అలా అడిగిన మరుక్షణం రోడ్డున పడతారని వాళ్ళకి తెలుసు. కడపలో చనిపోయిన టీవీ రిపోర్టర్ కుటుంబానికి అండగా ఉంటామని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి అదే ఉద్యోగం ఇస్తామని , ఆ కుటుంబానికి అండగా ఉంటామని రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్టర్ తిరుగుతోంది. చనిపోయిన వ్యక్తి సంస్థ ఉద్యోగి అయితే పీఎఫ్ వగైరాలు అందుతాయి. కానీ పోస్టర్ లో స్ట్రింగర్ అని దిక్కుమాలిన, పదం వాడి చావులో కూడా గౌరవం దక్కనివ్వని కుసంస్కారం కనిపించింది.

బాధ్యత మోయాల్సి వస్తుందనే….

తమ జర్నలిస్ట్ అని ఒప్పుకుంటే ఎక్కడ బాధ్యత మోయాల్సి వస్తుందనే భయం ఎక్కువ అందులో కనిపించింది. బతికినన్నాళ్లు తమ కోసం పని చేశాడని పెద్ద మనసు వాళ్ళకి లేకపోయింది. అది వాళ్ళ చిన్న బుద్ది అని సరిపెట్టుకోవాలి. చనిపోయిన కుటుంబాన్ని ఆదుకుంటామనే ప్రకటనలో మళ్ళీ అదే బానిస కొలువుని కుటుంబంలో ఒకరికి ఇస్తామని ఉదారంగా ప్రకటించుకున్నారు. ఆ స్ట్రింగర్ పంపిన వార్తలకు మీరిచ్చే జీతం ఎంత…, అతనికి దక్కిన ప్రయోజనం ఏమిటి, చావు తర్వాత అతను మిగుల్చుకున్నది ఏమిటి అనే దానికి సమాధానాలు ఉండవు.

ఎర్ర పత్రికలే నయం….

జర్నలిస్టుల మరణం గురించి ప్రధాన పత్రికలో ఎటూ రావు…. ప్రజాశక్తిలో మాత్రం ఈ వార్త కనిపించింది. కడపలో ఇద్దరి మృతి మీద ఆ పత్రిక ఓ వార్త ఇచ్చింది. దానికిందే మరో వార్త సీపీఎం అభిమాని మృతి అని…… 70వ దశకంలో అంటే 50ఏళ్ల క్రితం తమ వద్ద స్వీపర్ గా పని చేసిన అన్నమ్మ అనే వృద్ధురాలి మరణాన్ని ఆ పత్రిక ప్రచురించింది. నిన్న మొన్నటి దాకా తమతో కలిసి పని చేసిన వారినే గుర్తు పెట్టుకోని రోజుల్లో 50ఏళ్ల క్రితం తమ వద్ద స్వీపర్ గా పని చేసిన వార్తను ప్రజాశక్తి అందించింది. సీపీఎం కి బలమైన పట్టు ఉన్న తాడేపల్లిలో చాలామంది ఆ పత్రికను చదువుతారు. ఇది వారి బంధాన్ని మరింత దృఢ పరుస్తుంది. అన్నమ్మ తర్వాత ఆమె కుమార్తెలు కూడా సీపీఎం, ప్రజాశక్తి కార్యాలయాల్లో స్వీపర్లుగా పని చేసినట్టు ఆ వార్తలో ఉంది. మూడో తరం క్లర్క్ గా కొనసాగుతోంది. అన్నమ్మ కుమార్తెలు స్వీపర్లుగా ఎందుకు మిగిలిపోయారనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేకున్నా ఉపాధి భరోసా, నమ్ముకున్న వారికి అండగా ఉండటంలో వారి నిబద్ధత అభినందనీయం. ఇతరత్రా విమర్శలు ఉన్నా అవి ఈ సందర్భంలో ప్రస్తావనర్హం కాదు

Tags:    

Similar News