ఇద్దరు నానీలతో వారిద్దరికీ …?

వైసీపీలో నానిలు ఎక్కువే మరి. గోదావరి జిల్లాలో ఆళ్ల నాని ఉంటే కృష్ణా జిల్లాలో ఇద్దరు నానీలు ఉన్నారు. ఒకరు కొడాలి నాని, మరొకరు పేర్ని నాని. [more]

Update: 2021-05-11 02:00 GMT

వైసీపీలో నానిలు ఎక్కువే మరి. గోదావరి జిల్లాలో ఆళ్ల నాని ఉంటే కృష్ణా జిల్లాలో ఇద్దరు నానీలు ఉన్నారు. ఒకరు కొడాలి నాని, మరొకరు పేర్ని నాని. ఈ ముగ్గురూ జగన్ కి తెగ నచ్చి ఆయన మంత్రివర్గంలో కీలకంగా మారిపోయారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. గోదావరి జిల్లాల నానికి అంతగా మాటల మనిషి కాదు. కానీ కృష్ణా నీళ్ళు తాగిన ఈ ఇద్దరు నానీలు నోరు విప్పితే చాలు విపక్ష నేతలకు మూడిందనే లెక్క వేసుకోవాలి.

బాబుకు జవాబు….

జగన్ మీద చంద్రబాబు ఏ చిన్న మాట అన్నా కూడా కొడాలి నాని అసలు సహించరు. దానికి పదింతలుగా నోరు చేస్తారు. ఇక చంద్రబాబు ఎందుకు అన్నానురా బాబూ అని చెవులు రెండూ మూసుకునేలా కొడాలి నాని విమర్శల పర్వం కొనసాగుతుంది. ఒక విధంగా చంద్రబాబు జగన్ ని అనడానికి కొంత తగ్గాలి అనుకుంటే మాత్రం అది కొడాలి నానిని చూసే అని అంటారంతా. తనకు జగన్ అంటే ఇష్టం. ఆయన మీద బాబు ఒక్క మాట అన్నా నేను అసలు ఊరుకోను అంతే అంటూ ఎపుడో కుండబద్ధలు కొట్టేశారు కొడాలి నాని. ఇక బాబు సామాజికవర్గం కూడా కావడంతో నాని వేసే పంచ్ లకు అటు నుంచి కూడా పెద్దగా రియాక్షన్ రావడంలేదు. ఇది జగన్ కి కూడా బాగానే ఉంది మరి.

పవర్ ఫుల్ స్టార్ ….

సినీ రంగాన పవర్ పవర్ స్టార్ అయితే రాజకీయ రంగాన పేర్ని నాని పవర్ ఫుల్ స్టార్ గా ఉన్నారు. ఆయన అంటే కూడా జగన్ కి విపరీతమైన అభిమానం. అందుకే ఆయనను ఏరి కోరి మంత్రిని చేసుకున్నాడు. ఇక ఈ నాని పవర్ స్టార్ మీద బాణాలు వేస్తారు. పవన్ కళ్యాణ్ జగన్ ని ఒక్క మాట అంటే దానికి బదులు తీర్చే పనిలో పేర్ని నాని యమ బిజీగా ఉంటారు. నిజానికి పవన్ని పేర్ని నాని అన్న మాటలు మరే నేత అనలేదు. పవన్ కూడా అది వినలేదు అనుకోవాలి. పవన్ నాయుడూ అంటూ సెటైర్లు వేసినా ప్యాకేజి స్టార్ అంటూ కౌంటర్లేసినా పేర్ని నానికే చెల్లు. ఈయన కూడా పవన్ సామాజికవర్గం కావడంతో ఆ వైపు నుంచి గట్టిగా ఎవరూ నోరు చేయలేకపోతున్నారు.

బాబు మార్క్ పాలిటిక్స్ ….

నిజానికి ఇదంతా జగన్ కి తెలిసి జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఏ సామాజికవర్గం నేతలు ఆ వర్గం నేతను పెట్టించి తిట్టించడం బాబు మార్క్ పాలిటిక్స్. దాని వల్ల ఆ సామాజికవర్గంలో చెడ్డ పేరు రాదు. పార్టీకి రాజకీయ ఇబ్బందులు కూడా ఉండవు. అందుకే బాబు అలా చేసేవారు. ఇపుడు జగన్ కూడా ఇద్దరు నానిలను ముందు పెట్టి అటు బాబుని, ఇటు పవన్ని బాగానే కంట్రోల్ చేస్తున్న్నారు అన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా మంచి మాటకారులుగా ఈ ఇద్దరు నానీలు జగన్ సర్కార్ కి బాగానే కొమ్ము కాస్తున్నారు.

Tags:    

Similar News