థాక్రే కల నెరవేరనుందా…?

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాన్ని సంతృప్తి పర్చే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన, బీజేపీలు కలిస్తేనే విజయం [more]

Update: 2019-07-04 16:30 GMT

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాన్ని సంతృప్తి పర్చే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన, బీజేపీలు కలిస్తేనే విజయం సాధ్యమవుతుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి భంగపడ్డాయి. అందుకోసమే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఆ తప్పు చేయలేదు. శివసేనతో చర్చలు జరిపి మరీ కూటమిని ఏర్పాటు చేసుకుని మహారాష్ట్రలో అత్యధిక స్థానాలను గెలుచుకుంది.

కలసి పోటీ చేసి….

మహారాష్ట్రకు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు లోక్ సభ ఎన్నికలకు ముందే ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 288 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా చెరిసగం స్థానాలను పంచుకోవాలని భారతీయ జనతాపార్టీ, శివసేన లు నిర్ణయించాయని తెలుస్తోంది. అంటే దాదాపు 144 స్థానాలకు శివసేన పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది.

సీటు పంచుకోవాలని….

దీంతోపాటుగా ముఖ్యమంత్రి పదవిపైనా ఈసారి శివసేన కన్నేసింది. తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని కూడా సగ కాలం పంచుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అప్పట్లో లోక్ సభ ఎన్నికల సందర్భంగా జరిగిన చర్చల్లో ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమిత్ షా కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు చెబుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఎన్నికలు జరిగిన వెంటనే తొలి ప్రభుత్వంలో శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రి కానున్నారని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

గెలిచిన ఊపు మీద…

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కూటమి మంచి విజయమే సాధించింది. మొత్తం 48 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ 23, శివసేన 18 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడింది. ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. దీంతో మంచి ఊపు మీదున్న శివసేన, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాలని భావిస్తున్నాయి. అందుకే వచ్చే ఏడాది తమ పార్టీ సభ్యుడే ముఖ్యమంత్రి హోదాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని శివసేన పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది. ఈ విషయాన్ని అధికార పత్రిక సామ్నాలో కూడా ప్రకటించడం ఇందుకు అద్దంపడుతోంది.

Tags:    

Similar News