వారసుడి కోసం…?

భారతీయ జనతా పార్టీలో వారసత్వం లేదు. పార్టీకి పనిచేసిన వారు పదవులు అనుభవిస్తారు. అద్వానీ తర్వాత వారి వారసులు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. అయితే దాని మిత్ర [more]

Update: 2019-07-22 17:30 GMT

భారతీయ జనతా పార్టీలో వారసత్వం లేదు. పార్టీకి పనిచేసిన వారు పదవులు అనుభవిస్తారు. అద్వానీ తర్వాత వారి వారసులు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. అయితే దాని మిత్ర పక్షమైన శివసేన మాత్రం పూర్తిగా వారసత్వంపైనే ఆధారపడి ఉండటం విశేషం. బాల్ థాకరే మరణం తర్వాత ఆయన స్థానంలో కుమారుడు ఉద్దవ్ థాక్రే వచ్చారు. ఇక తాజాగా ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య ధాక్రే రాజకీయ రంగంలో కాలుమోపనున్నారు.

ఇప్పటి వరకూ యూత్ వింగ్ కు….

ఆదిత్య థాక్రే గత కొంతకాలంగా శివసేన పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. యూత్ వింగ్ ను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఆదిత్య ఠాక్రేను ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి తీసుకురావాలని బలంగా కోరుకుంటున్నారు తండ్రి ఉద్దవ్ ఠాక్రే. ఇందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కూడా సంప్రదించారు. ఈ ఏడాది అక్టోబర్ లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి.

ముఖ్యమంత్రి పదవి….

శివసేన, బీజేపీ కలసి పోటీ చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని కూడా ఒప్పందం కుదిరిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని శివసేన బహిరంగంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే తన వారసుడు ఆదిత్య థాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నారు. అందుకోసమే ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించి తమకు వ్యూహకర్తగా ఉండాలని, ఆదిత్యను సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దాలని కూడా ఉద్దవ్ థాక్రే కోరినట్లు సమాచారం.

పాదయాత్రతో….

ఈ నేపథ్యంలోనే ఆదిత్య థాక్రే సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రలోనూ ప్రశాంత్ కిషోర్ సేమ్ ఫార్ములాను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆదిత్య థాక్రే జన ఆశీర్వాద యాత్రను చేపట్టారు. ఆదిత్య థాక్రే సుమారు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. జలగావ్ నుంచి ఈ యాత్ర ప్రారంభమయింది. మొత్తం మీద పాదయాత్రతో తన వారసుడిని రాజకీయంగా ఉన్నత పదవుల్లో చూడాలన్న ఉద్దవ్ థాక్రే కోరిక నెరవేరుతుందో? లేదో? చూడాలి.

Tags:    

Similar News