జగన్ కు ఉండవల్లి చెప్పిన సీక్రెట్ ఇదే

పోలవరం ప్రాజెక్ట్ పై తొలి నుంచి పోరాడింది మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ మాత్రమే. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా ప్రాజెక్ట్ కి [more]

Update: 2020-10-31 08:00 GMT

పోలవరం ప్రాజెక్ట్ పై తొలి నుంచి పోరాడింది మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ మాత్రమే. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకా ప్రాజెక్ట్ కి కావలిసిన అనుమతులను సాధించడానికి ఉండవల్లికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు కూడా. అలా ఒక్కో అనుమతిని తన చాతుర్యం తో వైఎస్ వ్యూహాలకు అనుగుణంగా సాధించారు అరుణ కుమార్. వైఎస్ అర్ధాంతర మరణం తరువాత రాష్ట్ర విభజన సమయంలో కంటితుడుపు చర్యగా ఆంధ్రప్రదేశ్ కి పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి, స్పెషల్ స్టేటస్ హోదా కల్పిస్తున్నామంటూ నాటి మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వం చట్టం లో పోలవరాన్ని, పార్లమెంట్ లో ప్రత్యేక హోదాను ప్రకటించింది.

పోలవరం అంటే ఉండవల్లే గుర్తొచ్చేలా …

ఆ తరువాత పోలవరం అంశం పై ఏ చిన్న పరిణామం జరిగినా ఉండవల్లి అరుణ కుమార్ మీడియా స్క్రీన్ పై ప్రత్యక్షం అవుతుంటారు. ఇప్పటికి ఆయన కేవలం పోలవరం ప్రాజెక్ట్ అంశంపై 27 సార్లు ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి ఎపి జీవనాడి పూర్తి కోసం తన గొంతునే అస్త్రం గా మార్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతూ తన సలహాలు, సూచనలు ఇస్తూ స్టేట్స్ మెన్ గా నిలిచారు అనడం లో ఎలాంటి సందేహం అవసరం లేదు. పాలక విపక్షాల పాత్రను ఆయనే పోషిస్తూ వైఎస్ మానస పుత్రికను పూర్తి చేయించాలన్న సంకల్పమే ఉండవల్లి అరుణ కుమార్ మాటల యుద్ధం లో ప్రస్ఫుటిస్తు ఉంటుంది. అందుకోసం మరో క్లిష్ట సమయంలో ఉండవల్లి బయటకు వచ్చారు. ప్రాజెక్ట్ పునరావాసం ప్యాకేజీ మీరే చూసుకోవాలని కేంద్రం చెప్పడంపై ఉండవల్లి శివాలెత్తారు. వచ్చి రావడంతోనే చంద్రబాబు చేసిన తప్పులను, జగన్ సర్కార్ అనుభవరాహిత్యాన్ని అలసత్వాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ రాజకీయ ఎత్తుగడలను వివరిస్తూ నిప్పులే చెరిగారు.

మోడీ వచ్చాక …

యుపిఎ ప్రభుత్వం నాటి బిల్లు సమయంలో ఏపీ కి చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు విపక్షంలో వున్న బిజెపి నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ. పోలవరం పై వారు రాజ్యసభలో యుపిఎ ప్రభుత్వానికి చుక్కలు చూపించడంతో ప్రధాని మన్మోహన్ హాజరయ్యి అత్యవసర ప్రాజెక్ట్ గా పోలవరాన్ని పూర్తి చేస్తామని హామీనిచ్చారు. నాడు ఏపీకి అత్యవసరంగా 10 వేలకోట్లను లోటు బడ్జెట్ భర్తీకి ఇవ్వాలని వెంకయ్య పట్టుబడుతూ మీరు చేయండి మేము వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అంతకన్నా ఎక్కువే చేస్తాం అంటూ నిండు సభ సాక్షి గా ప్రకటించారు. కట్ చేస్తే ఆయన చెప్పినట్లే బిజెపి అధికారంలోకి వచ్చింది. టిడిపి కూడా ఎన్డీయే లో ఉండటంతో ప్రభుత్వం ఏర్పడటంతోనే పోలవరానికి భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా 7 ముంపు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా కలిపి ఎపి వాసులకు ఒక భరోసా ఇచ్చేసింది.

క్రెడిట్ కోసం టిడిపి .. బిజెపి …

ఈ క్రెడిట్ పై నాడు చంద్రబాబు క్లెయిమ్ చేసుకున్నా వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఈ కధంతా ఇప్పుడు ఉండవల్లి మరోసారి గుర్తు చేస్తున్నారు. నాడు పోలవరాన్ని తామే నిర్మించాలని కేంద్రం భావించిందని అయితే చంద్రబాబు మెలికతో కథ అడ్డం తిరిగిందన్నది ఉండవల్లి అరుణ కుమార్ విశ్లేషణ. ఏపీ లో ప్రత్యేక హోదా కోసం విపక్షాల నుంచి ముఖ్యంగా వైసిపి చేస్తున్న ఉద్యమం తో ఉక్కిరిబిక్కిరి అయిన కేంద్రంలోని మోడీ సర్కార్, రాష్ట్రం లోని టిడిపి సర్కార్ ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అరుణ్ జైట్లీ తో హడావిడిగా అర్ధరాత్రి ఒక ప్రకటన చేయించి కొంత పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై రక్తం మరిగి పోతుందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ తరువాత దానికి ఒప్పుకోవాలంటే పోలవరం ప్రాజెక్ట్ అప్పగించాలన్న డిమాండ్ తెరవెనుక చేసి ఉండొచ్చని ఉండవల్లి అరుణ కుమార్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అదే కారణం …

ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధం గా లేని బిజెపి తాము నిర్మించాలని అనుకున్న పోలవరాన్ని చంద్రబాబు వత్తిడికి తలవొంచి అప్పగించాల్సి వచ్చిందంటున్నారు ఆయన. పైకి నీతి ఆయోగ్ అప్పగించింది అని చంద్రబాబు కాదు వారే అడిగి తీసుకున్నారని ఒకరికొకరు మాట్లాడినా తెరవెనుక ఒప్పందాలే పోలవరాన్ని కేంద్రం చేతుల్లో నుంచి టిడిపి లాక్కోవడానికి రీజన్ గా కనిపిస్తుందని ఉండవల్లి అరుణ కుమార్ లెక్కవెస్తున్నారు. కమీషన్లు కోసం పట్టిసీమ నిర్మించి పోలవరం అంటే వైఎస్ పేరు వినిపిస్తుంది కనుక ఈ ప్రాజెక్ట్ తో సరిపెట్టారని అదే ఎత్తిపోతలకు ఖర్చు పెట్టిన సొమ్ముతో బ్యారేజ్ పూర్తి అయ్యి గ్రావిటీ పై నీరు వెళ్లేదని కానీ టిడిపి రాష్ట్రానికి ద్రోహం నాడే చేసిందని తేల్చేశారు ఆయన.

జగన్ తొడగొట్టాలిసిందే …

ఇక జగన్ కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ ను రాజకీయం చేసి నిధులు నిలిపి వేయడం పై ముఖ్యమంత్రి జగన్ పోరాటానికి దిగాలని సూచిస్తున్నారు ఉండవల్లి అరుణ కుమార్. కేసుల కోసం రాజీ పడే జగన్ మోడీ ని ఎదిరించలేకపోతున్నారనే ప్రచారం ప్రజలు నమ్మే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు అరుణ కుమార్. టిడిపి పై విమర్శలు మాని కేంద్రంపై యుద్ధానికి సై అనాలని అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు రక్షించబడతాయని ఉండవల్లి అంటున్నారు. జగన్ ను కేసుల్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అంత ఈజీ కాదని ఈడి కేసుల్లో జరిమానాలు తప్ప జైలు శిక్ష పడదని, ఒకవేళ పడినా జగన్ ఎవర్ని సీఎం చేస్తే వారే అవుతారని పోరాటంతోనే అద్భుత మెజారిటీ సాధించిన జగన్ నేడు వైఎస్ కుమారుడేనా ఇలా ఉన్నది అనే పరిస్థితి అధఃపాతాళానికి తోసేస్తుందని ఘాటుగానే హెచ్చరించారు ఉండవల్లి అరుణ కుమార్.

కేంద్రం నెత్తినే పెడితే సరి …

గత ఎన్నికల ప్రచారం లో కేంద్రం నిర్మించి ఇవ్వలిసిన ప్రాజెక్ట్ ను కమీషన్ల కోసమే టిడిపి తీసుకుందని తాము అధికారం చేపడితే తిరిగి వారికే ఇచ్చేస్తామని చెప్పి మీరు చేసిందేమిటని నిలదీశారు ఉండవల్లి అరుణ కుమార్. బిజెపి గేమ్ లో జగన్ బలి అయ్యి రాష్ట్రాన్ని ముంచకుండా చూడాలన్నారు. ఎపి లో బిజెపి బలపడాలని వేస్తున్న ఎత్తుగడలను గమనిస్తూ వెళ్లాలని వారి వ్యూహంలో పడొద్దన్నారు. జగన్ మోడీ కి ఎదురుతిరిగితే పోయేదేమీ లేదని రాష్ట్ర అభివృద్ధికి పోలవరమే జీవనాడి అని గుర్తించుకోవాలని లేకపోతే శిధిల పోలవరం గా వైఎస్ కల మిగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారుఉండవల్లి అరుణ కుమార్.

Tags:    

Similar News