ఉండవల్లి ఉన్నది ఉన్నట్లుగానే?

మంచి వారి మాట కరకుగా ఉన్నా తమ వారి హితం కోరే నాలుగు మాటలు చెబుతారు. ఆ కోవలోనే రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ [more]

Update: 2020-02-07 08:00 GMT

మంచి వారి మాట కరకుగా ఉన్నా తమ వారి హితం కోరే నాలుగు మాటలు చెబుతారు. ఆ కోవలోనే రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని చూడాలి. ఆయన వైఎస్సార్ కుటుంబానికి అభిమాని. నా స్నేహితుడి కొడుకు సీఎం అయింతే సంతోషించేవారిలో నేను మొదట ఉంటాను అంటూ జగన్ గురించి తన ప్రేమను అనేకసార్లు చాటుకున్నారు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ విషయం మీదనైనా నిర్మొహమాటంగా మాట్లాడుతారన్న పేరు ఉంది. ఆయన తాజాగా జగన్ సర్కార్ పాలన గురించి చేసిన కొన్ని కామెంట్స్ చూస్తూంటే వైసీపీ పాలన కొంచెం రాంగ్ ట్రాక్ లోకే వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. జగన్ ఇప్పటికైనా సర్దుకుని గాడిన పెట్టుకోవాలన్నదే ఉండవల్లి అరుణ్ కుమార్ హిత వచనాల వెనక ఉన్న సారాంశం.

మూడు వద్దు…

జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ ని ఇప్పటిదాకా ఏపీలోని అన్ని పార్టీలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. అయితే ఆ పార్టీలేవీ జగన్ తీసుకున్న మంచి నిర్ణయాలను కూడా ఎపుడూ సమర్దించలేదు కాబట్టి వాటి అభిప్రాయానికి పెద్దగా విలువ ఇవ్వడం జనం కూడా మానుకున్నారు. ఇక ఏపీలో వైసీపీ ఒక్క పార్టీనే మూడు రాజధానులు అంటోంది. ఈ నేపధ్యంలో మేధావులు కూడా కాస్తా అటు ఇటుగా భిన్నంగా స్పందిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి రాజకీయ మేధావి స్పందన మాత్రం ఈ సందర్భంగా పట్టించుకుని తీరాల్సిందే. రాగద్వేషాలకు అతీతంగానే ఆయన మూడు రాజధానులపైన తన భావాలను పంచుకున్నారనిపిస్తుంది. మూడు వద్దు, ఇది సరైన విధానం కానే కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ కుండబద్దలు కొట్టారు.

దేశంలో లేదు…..

దేశంలో ఎక్కడా కూడా అసెంబ్లీ, సచివాలయం వేరుగా లేవని ఉండవల్లి అరుణ్ కుమార్ మరో విలువైన మాట కూడా చెప్పారు. ఇంతవరకూ విపక్షాలు కూడా అదే మాట చెబుతూ వచ్చాయి. నిజమే చట్టాలు చేసే అసెంబ్లీ, దాన్ని అమలు పరచే సచివాలయం పక్కనే ఉండడం సబబు, పాలనాపరంగా కూడా మేలు అన్నది మేధావులు కూడా ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ జగన్ వీటిని విడదీస్తానని అంటున్నారు. ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు రావు అని ఉండవల్లి లాంటి వారు గట్టిగానే చెబుతున్నారు. దేశంలో హైకోర్టులను విడిగా పెట్టారు కానీ సచివాలయం, అసెంబ్లీలను వేరుగా పెట్టలేదని కూడా ఆయన చెబుతున్నారు.

కోతలతో దెబ్బే….?

మరో వైపు జగన్ అర్హులకే పించన్లు అంటూ భారీ ఎత్తున కోత పెడుతున్నారు. జగన్ ఏమి అనుకుంటున్నారో, అధికారులు ఏ విధంగా అర్ధం చేసుకున్నారో కానీ దిగువ స్థాయిలో మాత్రం అసంబద్ధంగా సంక్షేమ పధకాలను కట్ చేసుకుంటూ పోతున్నారు. దీని వల్ల పెద్ద ఎత్తున పేదల్లో నిరసన పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత బాగా ఉంది. దీన్నే ఉండవల్లి కూడా జాగ్రత్తగా బయట పెట్టారు. నాడు 1989లో అధికారంలోకి వచ్చిన చెన్నారెడ్ది సర్కార్ కూడా రేషన్ కార్డుల విషయంలో కోత పెడితే ఏడాదిన్నర వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లను మెజారిటీ కోల్పోయిందని కూడా ఉండవల్లి ఉదహరించారు. ఓ విధంగా మూడు రాజధానులు, పాలన, పోలవరం వంటి విషయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నది ఉన్నట్లుగా రాష్ట్రంలోని సన్నివేశాన్ని జగన్ ముందు పెట్టారు. మరి జగన్ దానిని పరిగణనలోకి తీసుకుని సర్దుకుంటారా, లేక దూకుడుగా ముందుకే వెళ్తారా అన్నది చూడాలి. రెండో మార్గమే అయితే జగన్ కి చిక్కులు తప్పవేమో.

Tags:    

Similar News