జగన్ కు ఉండవల్లి వార్నింగ్… దేనికి సంకేతం …?

చాలా నెలల తరువాత మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ బయటకు వచ్చారు. కరోనా ప్రభావంతో తన రాజకీయ విశ్లేషణలకు కొంత బ్రేక్ ఇచ్చిన ఉండవల్లి కేసులు [more]

Update: 2021-07-08 08:00 GMT

చాలా నెలల తరువాత మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ బయటకు వచ్చారు. కరోనా ప్రభావంతో తన రాజకీయ విశ్లేషణలకు కొంత బ్రేక్ ఇచ్చిన ఉండవల్లి కేసులు తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్ అయ్యారు. అయితే వచ్చి రావడంతోనే ఆయన తనకు అత్యంత ఇష్టమైన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు.

పోలవరంలో చేస్తున్నదేంటి ?

జగన్ సర్కార్ పోలవరంలో చేస్తున్నదేమిటంటూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ముందుగా వైఎస్ న్యాయం చేసేందుకు ప్రాజెక్ట్ వ్యయంలోనే ఆ ఖర్చును చేసి పోలవరానికి శ్రీకారం చుట్టారని చెప్పుకొచ్చారు. వైఎస్ పునరావాస ప్యాకేజీ తెలుసుకున్న నర్మదా బచావో ఆందోళనకు నేతృత్వం వహించిన మేధాపాట్కర్ ఆశ్చర్యపోయారని ఆమెకు నాటి ఇరిగేషన్ మంత్రి పొన్నాల ఈ వివరాలు తెలిపారని వెల్లడించారు. విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్న నేత వైఎస్ అని ఆయన తనయుడు ఆ బాటలో నడిచి ఎవరికి తమ బాధ చెప్పుకోవాలో తెలియని గిరిజనులకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకోవాలని సూచించారు ఉండవల్లి. పోలవరంలో గిరిజనులకు అన్యాయం చేసి నీటి ని నిల్వ చేస్తే జగన్ చరిత్ర హీనుడు అవుతాడని హెచ్చరించారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్.

మీ ఇద్దరు మిత్రులే కదా తగువెందుకొచ్చింది ?

వైఎస్ జగన్, కేసీఆర్ మంచి మిత్రులుగా ఉంటూ వచ్చి ఇప్పుడు ఈ జలవివాదాలు దేనికొచ్చాయని ఉండవల్లి అరుణ కుమార్ ప్రశ్నలు సంధించారు. మూడు గంటలపాటు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరిపినప్పుడు ఏ అంశాలు మాట్లాడుకొన్నారని ఇప్పుడెందుకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులకు యుద్ధానికి దిగుతున్నారో ప్రజలకు తెలియాలన్నారు. తెలంగాణ సెంటిమెంట్ కోసం ఆంధ్రా వారికి వ్యతిరేక నిర్ణయాలనే తీసుకుంటారని కెసిఆర్ తీరును ఉండవల్లి అరుణ కుమార్ తప్పుపట్టారు. సీమాంధ్రులకు ఎలాంటి హానీ జరగదని జగన్ ధైర్యంగా రంగంలోకి దిగి సమస్య సర్దుబాటు చేసుకోవాలన్నారు. వైఎస్ ను ఇప్పుడు దుర్మార్గుడు అంటున్న వారికి 2009 లో ఓట్లు ఎందుకు తెలంగాణ లో వేయలేదని నాడు ఆయన చేతిలో ఓడిన విషయం మరిచిపోవొద్దని దెప్పి పొడిచారు కెసిఆర్ ను ఉండవల్లి అరుణ కుమార్ . వైఎస్ మొదలు పెట్టిన దుమ్ముగూడెం టైల్ పాండ్ పూర్తి చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండేవని కానీ కెసిఆర్ ఆ ప్రాజెక్ట్ ను ఎందుకు పక్కన పెట్టారో ప్రజలకు చెప్పాలన్నారు.

షర్మిల పార్టీ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు …

తెలంగాణ లో వైఎస్ షర్మిల పార్టీ పై సంచలన వ్యాఖ్యలే చేశారు ఉండవల్లి అరుణ కుమార్ . తమకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వాయిస్ ఆఫ్ జగన్ గా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణ రెడ్డి గతంలోనే ప్రకటించారని గుర్తుచేశారు ఉండవల్లి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భిక్షం కోసం వచ్చిన వటువులా ఉన్న విష్ణుమూర్తి లా వైఎస్ ఉంటె ఆయన చనిపోయేనాటికి బలిచక్రవర్తిపై పాదం మోపిన వామనావతారం లా అనంత ఖ్యాతిని ఆర్జించారని కనుక ఖచ్చితంగా ఆయన ఇమేజ్ తెలంగాణ గడ్డపై తప్పకుండా ఉంటుందన్నారు ఉండవల్లి. వైఎస్ కుమార్తెగా షర్మిల కు ఆదరణ గ్యారంటీ అన్నారు ఆయన. ఆమె పార్టీ ని కెసిఆర్, జగన్ పెట్టించారని, కాదు షర్మిలా – జగన్ డ్రామాలని వార్తలు వస్తున్నాయని కానీ రాజకీయాల్లో డ్రామాలకు చోటు లేదని నిజం బయటకు వచ్చి తీరుతుందని విశ్లేషించారు ఉండవల్లి అరుణ కుమార్ .

మరింత అల్లరి చేసుకోకండి … ఇగో పక్కన పెట్టండి …

రఘురామ కృష్ణం రాజు ఎపిసోడ్ లో జగన్ తగ్గి వ్యవహరిస్తే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు ఉండవల్లి అరుణ కుమార్ . సిబిఐ జెడి కి వ్యతిరేకంగా జగన్ కోసం గతంలో పోరాటం చేసిన రఘురామ తో వివాదం విచిత్రంగా కనిపిస్తుందన్నారు. దీనిపై మహాభారతంలో గర్వంతో దుర్యోధనుడు చావు కొని తెచ్చుకున్న తీరును పాండవులు తప్ప అందరు భీముడి గర్వం వల్ల చనిపోయిన పురాణం ఒకపాఠం గా గుర్తుపెట్టుకోవాలన్నారు ఉండవల్లి అరుణ కుమార్ . గతంలో వైఎస్ ఢిల్లీ లో ఆంధ్రాభవన్ ముందు టిడిపి కి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న సమయంలో వెనుక దారిలో అక్కడి సిబ్బంది కొందరిని బయటకు పంపారని తెలుసుకుని ఒక వ్యక్తిని కొట్టారని అయితే తెలుగుదేశం వారు వారిని ధర్నా చేయమని చెప్పడం అసలు సమస్య పక్కకు పోయి ఆ అంశం ప్రధానం కావడంతో ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి కౌగలించుకుని వైఎస్ క్షమించమనడం ఆయనకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టిందని గుర్తు చేశారు. పెద్దవారిగా ఉండేవారు చిన్నవారిపట్ల తగ్గి వ్యవహరిస్తే విజేతలుగా నిలుస్తారనడానికి వైఎస్ ఆర్ నే ఉదాహరణ అన్నారు ఆయన. ఇలా తండ్రి చరిత్ర తెలుసుకుంటే జగన్ ఇలాంటి తప్పులు చేయరని ఇప్పటికి రఘురామ కృష్ణం రాజు విషయంలో పంతాలకు పోకుండా అహంకారం వీడి సమస్యకు తెరదించేందుకు చొరవ చూపాలని సూచించారు ఉండవల్లి అరుణ కుమార్ . లేనిపక్షంలో పార్లమెంట్ లో జరిగే పెద్ద అల్లరి జగన్ తెచ్చుకున్న పేరుకు మచ్చ తెచ్చేదే అవుతుందన్నారు అరుణ కుమార్.

Tags:    

Similar News