ఉండవల్లి అక్షింతలకు రీజన్ ఏంటి ?
మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ సుమారు నాలుగు నెలల తరువాత మీడియా ముందుకు వచ్చారు. వైరస్ మహమ్మారి కారణంగా ఉండవల్లి గత మూడు మాసాలుగా [more]
మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ సుమారు నాలుగు నెలల తరువాత మీడియా ముందుకు వచ్చారు. వైరస్ మహమ్మారి కారణంగా ఉండవల్లి గత మూడు మాసాలుగా [more]
మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ సుమారు నాలుగు నెలల తరువాత మీడియా ముందుకు వచ్చారు. వైరస్ మహమ్మారి కారణంగా ఉండవల్లి గత మూడు మాసాలుగా ఇంటికే పరిమితం అయ్యారు. రాజకీయ విశ్లేషణల్లో ఉండవల్లి పంథానే వేరుగా ఉంటుంది. నాలుగు నెలల తరువాత మీడియా తెరముందుకు వచ్చిన ఉండవల్లి అరుణ కుమార్ జగన్ పాలనపై సునామీలా విరుచుకుపడటం టిడిపి శ్రేణుల్లో సంబరాన్ని వైసిపి శ్రేణుల్లో నీరసాన్ని నింపింది. గత ఏడాది గా జగన్ సర్కార్ ఎక్కడ ఎక్కడ వైఫల్యం చెందింది ఉండవల్లి అరుణ కుమార్ సుదీర్ఘంగా వివరించారు. పలు సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి గట్టిగానే చురకలు అంటించారు.
భగవద్గీత శ్లోకంతో మొదలు పెట్టి …
వైరస్ మహమ్మారి పై పలు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ కుమార్ నాయకుడు అందరికి ఆదర్శంగా ఉండాలని కానీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా మాస్క్ పెట్టుకోకుండా ప్రజలను పెట్టుకోవాలని కోరడం అదే విధంగా అధికారులు ధరించకపోవడం తప్పుడు సంకేతాలను పంపుతాయని హెచ్చరించారు. దీనిపై భగవద్గీత శ్లోకాలను వల్లెవేసి ఉత్తములు దేనినైతే ఆచరిస్తారో లోకం దానిని పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఇక ఎపి సర్కార్ ఇసుక అంశంలో ఘోరంగా వైఫల్యం చెందిందని దీనిని ఏడాది అయినా ప్రభుత్వం సరిచేసుకోలేకపోవడం దారుణమన్నారు. పబ్లిక్ గా దొరకని ఇసుక బ్లాక్ మార్కెట్ లో ఎలా సులువుగా దొరుకుతుందో ప్రభుత్వమే చెప్పాలంటూ ఉండవల్లి అరుణ కుమార్ కడిగేశారు.
మద్యం లో మరీ దారుణం …
ఎపి లో మద్యం విధానం ఘోరాతి ఘోరంగా ఉందని ఉండవల్లి అరుణ కుమార్ ఆరోపించారు. ప్రస్తుత మద్యం పాలసీ వల్ల పక్క రాష్ట్రాలనుంచి మద్యం వచ్చి పడి ఖజానాకు చిల్లుపడుతుందని హెచ్చరించారు. మరోపక్క సారా విచ్చలవిడిగా పెరిగిపోయిందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా చూడని బ్రాండ్లను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల్లో అనేక అనుమానాలకు సర్కార్ తెరతీసిందన్నారు. మద్యం వ్యవహారంలో ప్రభుత్వంపై అనేక ఆరోపణలు ఉన్నాయని దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా మరింత సమాచారంతో ప్రజల ముందు పెడతా అని ఉండవల్లి అరుణ కుమార్ చెప్పారు.
ఆవ భూముల్లో గోల్ మాల్ …
ఎందుకూ పనికిరాని భూములకు విపరీతమైన ధరలు చెల్లించి రైతులనుంచి కొనుగోలు చేయడం దేనికోసం ఎవరి కోసం అంటూ ఉండవల్లి అరుణ కుమార్ ప్రశ్నించారు. పది లక్షలు, 20 లక్షల రూపాయల విలువైన భూములను 45 లక్ష ల రూపాయలు చెల్లించారని ఏ ప్రాతిపదికన ఇదంతా చేసారాన్నది విచారణ జరపాలని గతంలోనే ముఖ్యమంత్రిని కోరామన్నారు. హడావిడిగా ప్రజలకు స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం వల్ల వైసిపి కి లాభం కన్నా నష్టమే అధికమని వివరించారు.
వ్యవస్థలతో గొడవలు దేనికి … ?
న్యాయవ్యవస్థ తో ప్రభుత్వం వ్యవహరించాలిసిన తీరును ఉండవల్లి అరుణ కుమార్ తప్పుపట్టారు. వ్యవస్థలతో ఎలా నడుచుకోవాలో గతంలో వంగవీటి మోహన రంగా వంటి వారి కేసులను ఉదహరించారు. నిమ్మగడ్డ, ఎబి వెంకటేశ్వర రావు వంటివారు ఎల్వి సుబ్రహ్మణ్యం లా తలవంచుకు వెళ్లే వారు కాదని అయినా తనను గతంలో ఇబ్బంది పెట్టిన వారిపై ప్రతీకార చర్యలకు ప్రజలు అధికారం కట్టబెట్టలేదని జగన్ గుర్తించుకుని ముఖ్యమంత్రి పీఠం ఇచ్చిన బడుగులకు న్యాయం చేయాలని సూచించారు.
నెల్సన్ మండేలా ఆదర్శం అయితే …
నల్లజాతి యోధుడు నెల్సన్ మండేలా ప్రతీ రాజకీయ వాదికి ఆదర్శమని ఆయన ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బుగ్గన రాజేంద్రనాధ్ బడ్జెట్ ప్రసంగంలో నెల్సన్ మండేలాను ఆదర్శంగా తీసుకుని కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు చెప్పారని అయితే మండేలా ఏ రోజు తనను 27 ఏళ్లపాటు జైల్లో వేధింపులకు గురిచేసిన వారిపై ప్రతీకార చర్యలకు దిగలేదని కొన్ని ఉదాహరణలు వివరించారు. ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలు ప్రధానం కాదని ఏ లక్ష్యం తో రాజకీయ జీవితం ఆరంభించామో అది నెరవేర్చుకునేందుకు నిత్యం పరితపించాలని ఉండవల్లి అరుణ కుమార్ సూచించారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం అడుగులు పడటం లేదని పైకి మాత్రం మండేలా ఆదర్శం అంటే ఎలా కుదురుతుందని ఎద్దేవా చేశారు అరుణ కుమార్. అలాగే బడ్జెట్ చూశాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అయోమయం అని తేలిపోయిందని ఇంతకన్నా కేంద్ర ఆర్ధిక స్థితి దివాళా తీసిందని కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లక పోతే నిన్నటివరకు జేజేలు పలికిన వారే డౌన్ డౌన్ అంటారని గుర్తుపెట్టుకోవాలి హెచ్చరించారు ఉండవల్లి అరుణ కుమార్.
అందుకేనా… ?
ముఖ్యమంత్రి జగన్ మొండి జగమొండి గా పేరుంది. ఆయనకు పార్టీలో చెప్పే స్థాయిలో ఏ నేత లేరు. ఇక ప్రత్యర్థి పార్టీలు విమర్శించినా, ఆరోపించినా అవి రాజకీయ విమర్శల కిందనే ఫ్యాన్ పార్టీ జమ చేస్తుంది. తప్పులు ఎత్తి చూపేవారు లేకపోగా గత ప్రభుత్వంలో చంద్రబాబు భజన బృందాలు ఆయన కళ్ళు కప్పినట్లే జగన్ కోటరీ అంతకు మించి భజంత్రీలు వాయిస్తుంది. దీనికి జతగా అధికారపార్టీకి అండగా ఉన్న సాక్షి మీడియా ఆకాశానికి ఎత్తి వేస్తూ నిత్యం పొగడ్తలతో కాలక్షేపం చేస్తూ పరనింద ఆత్మస్తుతి సాగిస్తుంది. ఈ నేపధ్యం లో స్వర్గీయ వైఎస్ ఆర్ కి అత్యంత సన్నిహితుడు రాజకీయ చాణుక్యుడు ఉండవల్లి అరుణ కుమార్ రంగంలోకి దిగారు. ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో లేకపోయినా జగన్ సర్కార్ చేస్తున్న తప్పులను ఒప్పులను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారు. దీనివల్ల రాజకీయంగా ఉండవల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఆశించడం లేదు. కనుక ప్రస్తుత ఎపి ప్రభుత్వం ఉండవల్లి అరుణ కుమార్ హెచ్చరికలను తలకెక్కించుకుంటే గాడిలో పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.