ఉలుకూ…పలుకూ లేదే…?

సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మౌనానికి అర్థం ఏంటి? ఆయన ఎందుకు మాట్లాడటం లేదు…? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పలు కీలక [more]

Update: 2019-07-17 05:00 GMT

సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మౌనానికి అర్థం ఏంటి? ఆయన ఎందుకు మాట్లాడటం లేదు…? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా ఉండవల్లి అరుణ్ కుమార్ పెదవి విప్పరెందుకు? ఆయన రాజకీయాలకు దూరమని ఎప్పుడో ప్రకటించారు. ప్రత్యక్ష్య రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. అయితే సీనియర్ రాజకీయ వేత్తగా ప్రజాసమస్యలపై స్పందిస్తానని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి ఆ తర్వాత మాత్రం మాట్లాడటం లేదు.

పోలవరం ప్రాజెక్టుపైన…..

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి యాభై రోజులు దాటింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. రివర్స్ టెండర్లు అంటూ జగన్ అందుకున్న కొత్త నినాదంతో పోలవరం ప్రాజెక్టు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సయితం పోలవరం ప్రాజెక్టు అంశంపై పెద్ద యుద్ధమే జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదంటూ కేంద్ర మంత్రి స్వయంగా క్లీన్ చిట్ ఇచ్చారు.

టీడీపీ ప్రభుత్వంపై…..

పోలవరం ప్రాజెక్టుపై తొలి నుంచి అథ్యయనం చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఇన్ని పరిణామాలు జరుగుతున్నా మాట్లాడటం లేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ తొలి నుంచి పోలవరం ప్రాజెక్టుపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయలేరని కూడా ఉండవల్లి అంచనా వేశారు. అలాగే భూనిర్వాసితుల విషయంలోనూ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు.

గోదావరి నీటిని….

కాని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న కీలక పరిణామలపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందన కరవయింది. ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కె.చంద్రశేఖర్ రావులు గోదావరి నీటిని తరలించే కార్యక్రమానికి నడుంబిగించారు. నిజంగా ఈ సబ్జెక్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ కు కొట్టిన పిండి. మేధావులందరూ గోదావరి నీటిని తరలించడం ఏపీ ప్రయోజనాలకు నష్టమేనని చెబుతున్నప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ నిర్ణయాలపై అసలు స్పందిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News