తాడికొండ అంటేనే విసుగెత్తిందా.. ఒక దండం పెట్టేస్తారా?

ఏదైనా నియోజకవర్గంలో గ్రిప్ పెంచుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తారు. తమకున్న ఐదేళ్ల కాలంలో అందరినీ కలుపుకుని పోతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపునకు ప్రయత్నించాలి. అయితే ఇక్కడ మాత్రం [more]

Update: 2021-01-05 13:30 GMT

ఏదైనా నియోజకవర్గంలో గ్రిప్ పెంచుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తారు. తమకున్న ఐదేళ్ల కాలంలో అందరినీ కలుపుకుని పోతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుపునకు ప్రయత్నించాలి. అయితే ఇక్కడ మాత్రం ఆ ఎమ్మెల్యే చేతులెత్తిసినట్లే కన్పిస్తుంది. ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఆమె తాడికొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. వరస వివాదాల్లో చిక్కుకుంటున్న ఉండవల్లి శ్రీదేవి చివరకు ఆ నియోజకవర్గం అంటేనే విసుగెత్తి పోతున్నారు.

నందిగం జోక్యంతో….

తాడికొండ నియోజకవర్గంలో గెలిచిన నాటి నుంచి ఉండవల్లి శ్రీదేవికి మనశ్శాంతి లేకుండా పోయింది. నాన్ లోకల్ కావడంతో ఆమె పై పెత్తనం చేసేందుకు లోకల్ నేతలు అనేకమంది ప్రయత్నించడమే ఇందుకు కారణంగా చెప్పాలి. తాను ప్రాతినిధ్యం వహించే బాపట్ల నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా ఎంపీ నందిగం సురేష్ ఈ నియోజకవర్గంపై పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తన వర్గాన్ని ఇక్కడ బలోపేతం చేసుకునే పనిలోనే నందిగం సురేష్ ఉన్నారు.

డొక్కా తన వర్గంతో…..

ఇక మరో సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సయితం వైసీపీ కండువా కప్పుకున్న నాటి నుంచి ఈ నియోజకవర్గంపైనే కన్నేశారు. ఉండవల్లి శ్రీదేవి ఎంత రాజీ ప్రయత్నాలు చేసినా వివాదాలు ఆగడం లేదు. ఆ నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక ఘటన జరిగి ఆమె కార్నర్ అవుతున్నారు. ఇసుక వివాదం, పేకాట క్లబ్బుల నిర్వహణ, ఆడియో టేపుల బయటకు రావడం వంటి వాటితో ఉండవల్లి శ్రీదేవి సతమతమవుతున్నారు.

తన ప్రమేయం లేకుండానే…..

ఇటీవల వెలగపూడిలో ఎస్సీ వర్గంలోని రెండు సామాజికవర్గాల మధ్య జరిగిన ఘర్షణ సయితం ఉండవల్లి శ్రీదేవికి చికాకు తెప్పించింది. ఈ వివాదంలోనూ ఆమె ప్రమేయం లేకపోయినా బాధితుల ఎమ్మెల్యే ఫెయిల్యూర్ గానే చూస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నానని ఉండవల్లి శ్రీదేవి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయాలపై ఉండవల్లి శ్రీదేవికి వెగటు పుట్టినట్లే కన్పిస్తుంది. తన ప్రమేయం లేకుండా జరుగుతున్న సంఘటనలను తనకు అంటగట్టడంపై ఆమె మనస్తాపానికి గురవుతున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో ఆమె ఈ నియోజకవర్గానికి గుడ్ బై చెప్పేస్తారన్న టాక్ పార్టీలోనే బలంగా వినపడుతుంది.

Tags:    

Similar News