ఈసారి టిక్కెట్ కష్టమేనట

వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత లేదు. జగన్ సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నాయి. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలే [more]

Update: 2021-07-15 02:00 GMT

వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత లేదు. జగన్ సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నాయి. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలే రాచమార్గం వేస్తున్నాయి. అయితే ఇంత మంచి వాతావరణం ఉన్నా వైసీపీలో ఒక ఎమ్మెల్యే మాత్రం రాజీకీయంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఇంతవరకూ పట్టు దొరకలేదు. ఆ ఎమ్మెల్యేనే ఉండవల్లి శ్రీదేవి.

రాజకీయంగా ఫెయిల్యూర్….

ఉండవల్లి శ్రీదేవి డాక్టర్. వైద్యురాలిగా మంచి పేరుంది. కానీ పొలిటికల్ లీడర్ గా ఫెయిలయ్యారనే చెప్పాలి. రెండేళ్లలో కనీసం నియోజకవర్గంలో పట్టు పెంచుకోకపోగా వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఈ ఎమ్మెల్యేకే చెల్లింది. లోకల్ గా అందుబాటులో ఉండకపోవడం, ఎమ్మెల్యే నియమించిన మనుషులు చెలరేగిపోతుండటంతో ఉండవల్లి శ్రీదేవి అనేక వివాదాలలో చిక్కుకున్నారు. సొంత సామాజికవర్గం ప్రజలు కూడా ఆమెకు అండగా నిలబడటం లేదు.

పార్టీ నేతలతోనే…?

ప్రజల సంగతి పక్కన పెడితే సొంత పార్టీలోనే నేతలతో ఉండవల్లి శ్రీదేవికి పొసగడం లేదు. ఎంపీ నందిగం సురేష్ తో విభేదాలు తలెత్తాయి. ఇద్దరూ కూర్చుని పరిష్కరించుకున్నామని చెప్పినా ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. క్రషర్ల విషయంలో ఇప్పటికీ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తరచూ తలెత్తుతున్నాయి. ఉండవల్లి శ్రేదేవి మాట చెల్లుబాటు కాకపోతుండటంతో ఆమె అనుచరులు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకుంటున్నారు.

ఈ ఇద్దరూ….

ఇక టీడీపీ నుంచి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్నారు. ఆయన తన వర్గ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేలను కాదని పనులు చేయించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నందిగం సురేష్, డొక్కా మాణిక్యవరప్రసాద్ లు ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి పనితీరు కూడా అధినాయకత్వానికి పెద్దగా నచ్చకపోవడంతో ఆమెకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కడం కూడా కష్టమేనన్న టాక్ తాడేపల్లి ప్రాంతంలో బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News