శ్రీదేవి ఏం చేస్తుంది పాపం?

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కన్పించడం లేదంటూ ఆందోళనకు దిగారు రాజధాని అమరావతి ప్రాంత రైతులు. ఉండవల్లి శ్రీదేవి పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే [more]

Update: 2019-12-24 09:30 GMT

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కన్పించడం లేదంటూ ఆందోళనకు దిగారు రాజధాని అమరావతి ప్రాంత రైతులు. ఉండవల్లి శ్రీదేవి పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఉండవల్లి శ్రీదేవి మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. నిఘా వర్గాలతో పాటు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉండవల్లి శ్రీదేవిని నియోజకవర్గానికి దూరంగా ఉండటం మంచిదని సలహా ఇవ్వడంతో ఆమె హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

ఆమె వల్ల అవుతుందా?

నిజానికి ఉండవల్లి శ్రీదేవి చేతిలో ఏముంది? ఆమె మూడు రాజధానుల ప్రతిపాదను ఆపగలుగుతారా? జగన్ ను ఒప్పించగలుగుతారా? ఆమె ఆ సాహసం చేయగలరా? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. ఎందుకంటే ఇది తమ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం. దానికి తలాడించాలే తప్ప కాదనే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఎవరికి ఉండదు. ఈ సమయంలో రాజధాని ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే ఉండవల్లి శ్రీదేవి ఈ నెల 27వ తేదీ మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే నియోజకవర్గానికి రావాలని భావిస్తున్నారట.

అచ్చిరావడం లేదా?

నిజానికి ఉండవల్లి శ్రీదేవికి రాజకీయం అచ్చి వచ్చినట్లు కన్పించడం లేదు. ఆమె తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన నాటి నుంచి ఆమెకు అన్నీ కష్టాలే. డాక్టర్ గా ఉన్న శ్రీదేవి ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటుంటారు. అడపా దడపా నియోజకవర్గానికి వచ్చి పోతుంటారు. ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ కాదంటూ రాష్ట్రపతి వరకూ ఫిర్యాదులు వెళ్లాయి. ప్రస్తుతం ఉండవల్లి శ్రీదేవి ఆ విచారణను ఎదుర్కొంటున్నారు. తాడికొండ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ఉండవల్లి శ్రీదేవి ప్రయత్నిస్తున్న సమయంలోనే మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది.

మరోసారి కష్టమేనా?

నిజానికి తాడికొండ ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఈనియోజకవర్గం ఎస్సీలకు కేటాయించినా ఇక్కడ పెత్తనం అంతా అగ్రవర్ణాలదే. ఒక సామాజిక వర్గానిదే. ఇక్కడ రెండు మూడు మండలాల్లో రెడ్డి సామాజిక వర్గం కూడా అధికంగానే ఉంది. ఇప్పుడు రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తే ఉండవల్లి శ్రీదేవికి కష్టాలు తప్పవు. ఆమెను తాడికొండ ప్రజలు మరోసారి గెలిపిస్తారన్న నమ్మకం లేదు. ఇలా ఉండవల్లి శ్రీదేవి అనుకోకుండానే ఎమ్మెల్యే అయినా.. ఊహించని విధంగా తెరమరుగు కాక తప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పాపం… శ్రీదేవి పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి బలయిపోతున్నారన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి.

Tags:    

Similar News