ఓదార్పు మాత్రమే మిగిలిందా?

ఏదైనా స్థానబలం స్థానబలమే. అలివిగాని చోట అధికులమనరాదు అన్నది సామెత. ఇది ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సరిపోతుంది. స్థాన బలం లేకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి [more]

Update: 2020-08-22 14:30 GMT

ఏదైనా స్థానబలం స్థానబలమే. అలివిగాని చోట అధికులమనరాదు అన్నది సామెత. ఇది ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సరిపోతుంది. స్థాన బలం లేకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆమెకు సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నియోజకవర్గంలో తనకు తెలియకుండా జరిగిన వ్యవహారాన్ని కూడా తనకు అంటగట్టడంపై ఉండవల్లి శ్రీదేవి మండి పడుతున్నారు.

ఎమ్మెల్యేగా గెలిచినా…..

ఉండవల్లి శ్రీదేవి స్వతహాగా డాక్టర్. ఆమె ఎందరో రోగులకు స్వస్థత చేకూర్చారు. వైద్య వృత్తిలో రాణించిన ఉండవల్లి శ్రీదేవి రాజకీయంగా రాణించలేకపోతున్నారు. భారతీరెడ్డితో ఉన్న పరిచయంతో ఉండవల్లి శ్రీదేవి గత ఎన్నికల్లో తాడికొండ టిక్కెట్ ను దక్కించుకున్నారు. జగన్ హవా ఉండటంతో సులువుగానే నెగ్గారు. కానీ గెలిచానన్న ఆనందం ఉండవల్లి శ్రీదేవిలో ఎక్కువ కాలం నిలవలేదు. ఇందుకు కారణం అదే నియోజకవర్గానికి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్.

ఎంపీతో తొలి నుంచి….

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ దీ ఇదే నియోజకవర్గం. దీంతో ఆయన ఎంపీగా ఉన్న తాడికొండ నియోజకవర్గంలో జోక్యం చేసుకునే వారు. అందుకు ఉండవల్లి శ్రీదేవి వ్యతిరేకించారు. ఇసుక తవ్వకాలపై ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో అధిష్టానం వద్దకు పంచాయతీ వెళ్లింది. కానీ నందిగం సురేష్ కు హైకమాండ్ వద్ద గ్రిప్ ఉండటంతో ఉండవల్లి శ్రీదేవి వేదన అరణ్య రోదనే అయింది. ఇటీవల పేకాట పంచాయతీలో తన పేరు రావడానికి కూడా నందిగం సురేష్ వర్గీయులే కారణమని ఉండవల్లి శ్రీదేవి ఆరోపిస్తున్నారు.

హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా…

దీంతోపాటు తాడికొండ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నందిగం సురేష్ ఫ్లెక్సీలే కన్పిస్తాయి. నందిగం యువసేనను కూడా స్థాపించి సురేష్ అక్కడ తన పట్టుకోల్పోకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇటీవల పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆమెకు ఓదార్పు మినహా ఎలాంటి హామీ లభించకపోవడంతో నిరాశగా హైదరాబాద్ వెళ్లారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. మొత్తం మీద తాడికొండ నియోజకవర్గంలో వైసీపీలోని గ్రూపులు త్వరలోనే రోడ్డుకెక్కే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News