ఈసారైనా సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా..?

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరేమో. అనంతపురం జిల్లాలో వెనకబడిన ఉరవకొండ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని [more]

Update: 2019-02-07 09:00 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరేమో. అనంతపురం జిల్లాలో వెనకబడిన ఉరవకొండ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని గత రెండున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాలు చేస్తున్న పయ్యావులకు లక్‌ చిక్కడం లేదు. పయ్యావుల రెండున్నర దశాబ్దాల్లో ఉరవకొండలో మూడుసార్లు గెలిచినా ఆయన దురదృష్టవంతుడుగానే పేరొందారు. ఇందుకు కారణం ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన 1999లో ఆయన అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి వై.శివరామరెడ్డి చేతిలో ఓడిపోయారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 2004, 2009 ఎన్నికల్లో అక్కడ వరుస విజయాలు సాధించారు. తిరిగి రాష్ట్ర విభజన జరిగి 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే పయ్యావుల ఉరవకొండలో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి చేతిలో ఓడిపోయారు. దీనిని బట్టి గత నాలుగు ఎన్నికల్లోనూ ఆయన గెలిస్తే పార్టీ ప్రతిపక్షంలో ఉండడం… ఆయన ఓడితే పార్టీ అధికారంలోకి రావడం జరిగాయి. దీంతో రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదగాల్సిన ఆయన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది.

ఇక్కడ గెలిచిన పార్టీ అధికారంలోకి రాదు…

ఇక ప్రస్తుతం ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు గమనిస్తే దశాబ్దాలుగా ఇక్కడ రెండు కులాలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం శాసన మండలి చీఫ్ విప్‌గా ఉన్న పయ్యావుల కేశవ్‌ గత ఎన్నికల్లో 2,275 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. జిల్లా అంతటా టీడీపీ గాలి బలంగా వీచినా ఉరవకొండలో మాత్రం కేశవ్‌ ఓడిపోయారు. నియోజకవర్గంలో 1983 నుంచి 2014 వరకు వివిధ పార్టీల నుంచి చూస్తే కమ్మ, రెడ్డి, కురుబ సామాజికవర్గాలు వారు మాత్రమే రంగంలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,07,775 ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అగ్రవర్ణ సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు పోటీ పడుతున్నా బీసీ ఓటర్లే గెలుపు ఓటములను నిర్ణయిస్తారు. నియోజకవర్గంలో బోయ, కురుబ సామాజికవర్గాలకు చెందిన ఓటర్ల సంఖ్య అధికం. ఉరవకొండ అసలే వెనకబడిన నియోజకవర్గం కావడం, దీనికి తోడు గత రెండు దశాబ్దాల్లో ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడంతో స్థానికంగా ఉన్న రాజకీయ వైరుధ్యాల నేపథ్యంలో ఒకరికొకరు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు.

బలంగా ఉన్న రెండు పార్టీలు…

గత నాలుగేళ్లలో కేశవ్‌ ఓడినా ఎమ్మెల్సీ, విప్‌గా ఉండడం, పార్టీ అధికారంలోకి రావడంతో కొంత వరకు అభివృద్ధి చేశారు. వాస్తవంగా చెప్పాలంటే గత రెండు దశాబ్దాలతో పోలిస్తే ఉరవకొండలో గత నాలుగేళ్లలోనే కొంతైనా అభివృద్ధి జరిగిందన్నది వాస్తవం. ఇక టీడీపీ నుంచి కేశవ్‌ మరోసారి రంగంలోకి దిగనున్నారు. వైసీపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నా మరో మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో నేత పేర్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే జిల్లాలో పార్టీ తరపున ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి విషయంలో జగన్‌ కాస్త అసహనంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నా ఆయన్ను పక్కన పెడతారన్నది చెప్పలేం. ఏదేమైన నియోజకవర్గంలో టీడీపీతో పాటు వైసీపీ రెండూ బలంగా ఉండడంతో కాంగ్రెస్‌, జనసేన లాంటి పార్టీలు రేసులో ఉన్నా ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉండనుంది. బీజేపీ నుంచి అనంతపురం మాజీ ఎంపీ దివంగత నారాయణస్వామి మనవరాలు, హైకోర్ట్‌ న్యాయవాది, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవినేని హంస పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే జనసేన తరపున నియోజకవర్గానికి చెందిన జనసేన జిల్లా నాయ‌కుడు గౌతమ్‌ కుమార్‌తో పాటు నర్రా కేశన్న, లాయర్‌ తుకారాం తదితరులు టిక్కెట్‌ రేసులో ఉన్నారు. ఈసారైనా ఉరవకొండ రెండు దశాబ్దాల తర్వాత ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్న బ్యాడ్‌ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తుందా ? లేదా మరోసారి అదే సెంటిమెంట్‌ను రిపీట్‌ చేస్తుందా? ఈ సారి అయినా కేశ‌వ్‌కు రెండూ క‌లిసొస్తాయా? అన్నది చూడాల్సి ఉంది.

ReplyReply allForward

Tags:    

Similar News