కంపు చేసిన ట్రంప్

బీజేపీ అంటేనే దేశభక్తికి మారు పేరు అంటారు. దేశంలో అందరికీ మాతృభూమి మీద అభిమానం ఉన్నా కూడా బీజేపీ తీరే వేరు. అందులో రాజకీయం కూడా మిళితమై [more]

Update: 2019-07-26 18:29 GMT

బీజేపీ అంటేనే దేశభక్తికి మారు పేరు అంటారు. దేశంలో అందరికీ మాతృభూమి మీద అభిమానం ఉన్నా కూడా బీజేపీ తీరే వేరు. అందులో రాజకీయం కూడా మిళితమై ఉంటుంది. కార్గిల్ పోరు అయినా , మొన్న పుల్వామా ఉగ్ర దాడులు అయినా దేశ భక్తిని కూడా ఓట్ల రూపంలో మార్చుకోవడం ఒక్క బీజేపీకే చెల్లు. అటువంటి బీజేపీ అవకాశాలను, ఆశలను అమెరికా పెద్దన్న ట్రంపు ఒక్క మాటతో చెల్లాచెదురు చేసేశారు. కాశ్మీర్ అంటేనే బీజేపీకి ఎక్కడలేని పూనకం వస్తుంది. జనసంఘ్ స్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానం చేసింది కూడా కాశ్మీర్ కోసమే. అటువంటి కఠిన సిధ్ధాంత బద్ధత కలిగిన అంశంపై ట్రంప్ చేసిన ఒక కామెంట్ బీజేపీ మీద, మోడీ మీద అనుమానాలు ఒక్కసారిగా పెరిగేలా చేసింది. కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించమని మోడీ ట్రంప్ ని కోరినట్లుగా అమెరికా ప్రెసిడెంట్ స్వయంగా చెప్పడంతో అగ్గి రాజుకుంది. బీజేపీ ప్రాతివత్యాన్ని శంకించేలా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏకంగా బీజేపీ కూసాలనే కదిలిస్తున్నాయి.

మౌన మునిలా మోడీ…..

ఈ విషయంలో మోడీ ఇరుకునపడ్డారు. దాంతో పాటే బీజేపీ పరిస్థితి కూడా కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. పార్లమెంట్ లో ఈ అంశంపై విపక్షాలు నిగ్గదీస్తున్నా ఇంతవరకూ మోడీ నోట ఒక్క మాట రాలేదు. ట్రంప్ తో భారత ప్రధాని అలా అనలేదని విదేశాంగ శాఖ ఖండించింది. బీజేపీ పెద్దలు పార్లమెంట్ లోపలా బయటా ఖండన మండనలు చేస్తున్నారు. కానీ అసలు మనిషి మాత్రం మౌనమే నా భాష అంటున్నారు. ఇది కూడా దేశ ప్రజలలో అనుమానాలు పెరిగిపోయేలా చేస్తోంది. కాశ్మీర్ అంటే బీజేపీకి ఎంతో ప్రేమ. భారత్ లో కాశ్మీర్ అంతర్భాగం, . నెహ్రూ తొలి ప్రధాని కాకపోతే కాశ్మీర్ రావణ కాష్టం ఈ రోజుకు ఇలా ఉండేది కాదు, ఇదీ ప్రతీ రోజూ బీజేపీ చెప్పే మాట. ఇపుడు ట్రంప్ గాలి తీసేశారు. ఓ దేశ ప్రధాని తనతో అలా అన్నారని ఆయన చెప్పడం వల్లనే నమ్మబుద్ది వేస్తోందంటున్నారు.

డ్యామేజ్ జరిగిపోయిందిగా……

బీజేపీ ఈ విషయంలో ఎంతలా ఖండించినా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి బీజేపీ సుముఖం అన్న ప్రచారం వేగంగా పాకిపోతోంది. కాశ్మీర్ కోసం వేయి యుధ్ధాలు చేస్తామన్న పాక్ ఇపుడు భారత్ ఇరుకున పడడం చూసి సంబరాలు చేసుకుంటోంది. ద్వైపాక్షిక చర్చలు అంటూ ఇన్నాళ్ళూ చెబుతూ వచ్చిన బీజేపీ రాజకీయ ఆలోచనల్లో మార్పు వచ్చిందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ట్రంప్ చేసిన కామెంట్స్ పక్కన పెడితే కాశ్మీర్ విషయంలో గత పాలకులకు భిన్నంగా మోడీ ఆలోచిస్తున్నారన్నది చాలా కాలంగా ప్రచారంలో ఉన్న మాట. కాశ్మీర్ సమస్యకు మోడీ వద్ద ఉన్న పరిష్కారం పైనా వార్తలు వచ్చాయి. అదేంటి అంటే ఆక్రమిత కాశ్మీర్ వరకూ పాకిస్తాన్ కి కి ఇచ్చేసి దాన్నే అంతర్జాతీయ సరిహద్దుగా చేసుకుని ప్రస్తుతం కాశ్మీర్ ఉన్న ప్రాంతాన్ని భారత్ లోనే ఉంచుతూ శాశ్వతమైన పరిష్కారం సాధించాలన్నది మోడీ రాజకీయ ఆలోచనలుగా కూడా చెబుతూంటారు. అందులో భాగంగానే మోడీ ట్రంప్ తో మధ్యవర్తిత్వం ప్రతిపాదనలు నిజంగానే చేసి ఉంటారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఏది ఏమైనా కాశ్మీర్ విషయంలో దేశ భక్తి కంటే రాజకీయాలే బీజేపీలోనూ ఎక్కువ అయ్యాయన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.

Tags:    

Similar News