వడ్డిస్తారా…? వదిలేస్తారా..?
కరోనా జబ్బుని నియంత్రించేందుకు టీకా వచ్చేసింది. కానీ పన్నులు, సెస్సుల రూపంలో సర్కారీ కరోనా, అధిక రేట్ల రూపంలో కార్పొరేట్ కరోనా ..ఇప్పుడు సామాన్యుడిపై ఉరుమురిమి చూస్తున్నాయి. [more]
కరోనా జబ్బుని నియంత్రించేందుకు టీకా వచ్చేసింది. కానీ పన్నులు, సెస్సుల రూపంలో సర్కారీ కరోనా, అధిక రేట్ల రూపంలో కార్పొరేట్ కరోనా ..ఇప్పుడు సామాన్యుడిపై ఉరుమురిమి చూస్తున్నాయి. [more]
కరోనా జబ్బుని నియంత్రించేందుకు టీకా వచ్చేసింది. కానీ పన్నులు, సెస్సుల రూపంలో సర్కారీ కరోనా, అధిక రేట్ల రూపంలో కార్పొరేట్ కరోనా ..ఇప్పుడు సామాన్యుడిపై ఉరుమురిమి చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లోపు కోవిడ్ సెస్ విధిస్తుందేమోనన్న ప్రచారం ప్రజల్లో భయాందోళనలు పుట్టిస్తోంది. ఏమాత్రం అవకాశం దొరికినా ప్రజల ముక్కుపిండి వసూలు చేసే అవకాశాలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వదులుకోవడం లేదు. కేంద్రమైతే మరీ బరి తెగిస్తోంది. పన్నులకు సంబంధించిన అసంతృప్తులు నేరుగా తమ రాజకీయ జాతకాలపై ప్రభావం చూపవని కేంద్రానికి గట్టి నమ్మకం. అందుకే పెట్రోలు, డీజిల్ వంటి వాటిపై అదనపు సెస్సులతో ప్రజలను ఇంతవరకూ బాదుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ తో పోల్చుకుంటే 50 రూపాయల లోపునకు దొరకాల్సిన లీటర్ పెట్రోల్, డీజెల్ ను 80 నుంచి 90 రూపాయల మధ్య విక్రయిస్తోంది. ఇది సరిపోదన్నట్లుగా కొత్తగా కోవిడ్ సెస్ అన్న ఆలోచన తలెత్తుతోందని ఉన్నతస్థాయి సమాచారం. ఇప్పటికే ప్రజలు కష్టాల్లో ఉన్నారు. మరింతగా వేధించడం ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. నెలల తరబడి ప్రకటించిన లాక్ డౌన్ భారతీయుల కొంప ముంచింది. మధ్యతరగతిలో ఉండే పొదుపు మనస్తత్వం కారణంగా ఎంతోకొంత నగదు నిల్వలు ఉండటంతో సర్దుబాటు చేసుకోగలిగారు. ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటనలే తప్ప నేరుగా పైసలు విదల్చలేదు. టీకాల సమయం వచ్చింది . ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోంది. సామాన్యుడు యథావిధిగా పనులు చేసుకుంటున్నాడు. ఇదే అదను కాబట్టి జేబులకు చిల్లు పెట్టేద్దామని చూస్తున్నాయి ప్రభుత్వాలు.
ప్రధాని మాటల ఆంతర్యం..?
కోవిడ్ పేరు చెప్పి మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వాలే దిగ్బంధం చేసేశాయి. ప్రాణాలే ముఖ్యం. బ్రతుకుదెరువు కంటే అని నచ్చచెప్పాయి. కానీ ప్రాణాలు కాపాడుకోవాలన్నా బ్రతుకుదెరువు ఉండాల్సిందే కదా. దీర్ఘకాలం పనులు లేకుండా పస్తులు ఉంటే ప్రాణాలు నిలిచేదెలా? అందుకే ప్రజల కడుపు కొట్టకుండా పనులు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ దిశలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేసిన సాయం అంతంతమాత్రమే. ఇప్పుడిప్పుడే సామాన్యుడు తనంతట తాను జవసత్తువలు కూడగట్టుకుంటున్నాడు. టీకాల విషయంలోనూ పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రభుత్వాలు చెప్పడం లేదు. తొలిదశలో టీకాలు అందచేసే మూడు కోట్ల మంది కోవిడ్ యోధులకు ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని ప్రధాని ప్రకటించారు. దేశ ప్రజల్లో అవసరమైన వారందరికీ టీకాలను ప్రభుత్వాలే ఉచితంగా ఇస్తాయనే భరోసాను ఈ సందర్భంలోనే ప్రకటించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత. పైపెచ్చు వీటిని ప్రయివేటు చేతిలో పెడితే ఎదురయ్యే దుష్పరిణామాలు, బ్లాక్ మార్కెటింగ్, కార్పొరేట్ ఆసుపత్రుల దందా తెలియనిది కాదు. వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు వంటి విభాగాలన్నీ దాదాపు ప్రభుత్వ అధీనంలోనివే. వీరికి ఉచితంగా టీకా పంపిణీ చేయడం పెద్ద ఔదార్యమేమీ కాదు. పైపెచ్చు ఆయా వర్గాలు వీటి వ్యయాన్ని భరించగల స్థితిలోనే ఉంటాయి. ఎటొచ్చీ రెక్కాడితేకానీ డొక్కాడని సగటు మనిషికి నిర్దిష్ట కాల ప్రణాళికలో మందు అందేలా చూడాలి.
సామాన్యుడి ఘోష…
వ్యాపారాలు మూతపడ్డాయి. ప్రయివేటు ఉద్యోగాలు ఊడిపోయాయి. కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలలో సైతం కోతలు వచ్చాయి. మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తమయ్యాయి. ఇళ్లల్లో ఉండే నగానట్రా తాకట్టు పాలయ్యాయి. సొంతంగా కాయకష్టాన్ని నమ్ముకుని ఉపాధి నిమిత్తం వృత్తులు చేసుకునేవారి పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. పనిముట్లకు సైతం చేతిలో పైసా లేదు. ఇంతవరకూ అప్పులిచ్చినవారు జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో వసూళ్లకోసం వెంటపడుతున్నారు. బ్యాంకులుఈవిషయంలో ప్రయివేటు వ్యాపారులతో పోటీలు పడుతున్నాయి. నిజమైన ఉద్దీపనతో ప్రభుత్వం తోడుండాల్సిన సమయం ఇది. టీకాలు ఇచ్చేస్తున్నామనే సాకుతో పన్నుల భారం మోపినా, అదనపు నిధుల సమీకరణకు అడ్గగోలు నిర్ణయాలు తీసుకున్నా తట్టుకునే స్తితిలో భారతావని లేదు. దీనిని పాలకులు గ్రహించాల్సి ఉంది.
కార్పొరేట్ కరోనా…
కార్పొరేటీకరణపై ప్రభుత్వానికి విపరీతమైన మోజు. పార్టీలకు విరాళాలు మొదలు , పన్నుల వసూళ్ల వరకూ సులభంగా సాగిపోతుందని సర్కారులోని పెద్దల విశ్వాసం. ఉత్పత్తి రంగం పూర్తిగా కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యంలోకి వస్తే ఏం జరుగుతుందో తాజా ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. సిమెంటు, ఉక్కు వంటి వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డిమాండ్ వచ్చి వీటి ధరలు పెరగలేదు. లాక్ డౌన్ లో వాటిల్లిన మాంద్యాన్ని ఒక్కసారిగా లాభాలరూపంలోకి మార్చేయాలని కంపెనీలన్నీ కుమ్మక్కు అయ్యాయి. ప్రభుత్వాలు నియంత్రించలేక చేతులెత్తేస్తున్నాయి. నిర్మాణరంగం, మౌలికవసతుల రంగాలు పుంజుకుంటే కోట్టాదిమందికి ఉపాధి దొరుకుతుంది. లాభాల యావలో కార్పొరేట్ సంస్థలు దీనికి గండి కొడుతున్నాయి. తామెక్కిన కొమ్మనే నరుక్కోవడానికి సిద్దం అవుతున్నాయి. బంగారుబాతును ఒక్కసారిగా కోసుకుని తినేయాలన్న ఆబ కంపెనీల్లో కనిపిస్తోంది. వీటిని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఒక్కో వ్యవస్థపైనా ద్రుష్టి పెట్టి సరిదిద్దకపోతే కరోనా కష్టాలు ఇంకా వెన్నాడుతూనే ఉంటాయి.
-ఎడిటోరియల్ డెస్క్