వంగ‌ల‌పూడి వారి రాజ‌కీయం.. ఎటైనా మారొచ్చు

వంగ‌ల‌పూడి అనిత‌. టీడీపీ తెలుగు మ‌హిళ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె 2014లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వ‌చ్చిన మాజీ టీచ‌ర్‌. చంద్రబాబు ఆశీస్సుల‌తో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గమైన పాయ‌క‌రావుపేట నుంచి [more]

Update: 2020-08-24 05:00 GMT

వంగ‌ల‌పూడి అనిత‌. టీడీపీ తెలుగు మ‌హిళ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె 2014లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వ‌చ్చిన మాజీ టీచ‌ర్‌. చంద్రబాబు ఆశీస్సుల‌తో ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గమైన పాయ‌క‌రావుపేట నుంచి గెలిచి.. మంత్రి ప‌ద‌విని అందుకునేందుకు ప్రయ‌త్నాలు చేశారు. అయితే, స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆమెకు అవ‌కాశం ద‌క్కలేదు. ఇదిలావుంటే, ఆమె ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో విశాఖ‌లోనో.. హైద‌రాబాద్‌లోనో మ‌కాం వేసుకున్నారే త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోలేద‌నే అప‌వాదు ఉంది. ఈ క్రమంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్యతిరేకత‌ వ‌చ్చింది. దీంతో టికెట్ ఇవ్వద్దని గ‌త ఎన్నిక‌ల్లో త‌మ్ముళ్లు ర‌గ‌డ సృష్టించారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నియోజ‌క‌వ‌ర్గ త‌మ్ముళ్లు ఏకంగా అనిత‌కు సీటు ఇస్తే చిత్తుగా ఓడిస్తామ‌ని చెప్పడంతో చంద్రబాబు సైతం వారికి త‌లొగ్గక త‌ప్పని ప‌రిస్థితి.

ఎంతగా ప్రాధాన్యం ఇచ్చినా…..

ఈ క్రమంలోనే చంద్రబాబు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆమెకు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరులో టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం ఆమె వాయిస్ బ‌లంగా ఉండాల‌ని భావించిన బాబు వంగ‌ల‌పూడి అనిత‌ను గెలిపించాల‌నే కొవ్వూరులో పోటీ చేయించారు. అయితే, ఆమె ఓడిపోయారు. త‌ర్వాత పార్టీలో ప‌ట్టుబ‌ట్టి .. తిరిగి పాయ‌క‌రావుపేట పార్టీ ప‌గ్గాలు అందిపుచ్చుకున్నారు. ఇక‌, ఆ త‌ర్వాత కూడా చంద్రబాబు ఆమెకు ప్రాధాన్యం ఇస్తూ.. తెలుగు మ‌హిళ అధ్యక్ష ప‌గ్గాలు అందించారు. ఇంత‌వ‌ర‌కు బాగానేఉన్నా వంగ‌ల‌పూడి అనిత‌ను న‌మ్మలేమ‌ని.. వంగ‌ల‌పూడి వారి రాజ‌కీయం వంక‌ర‌ని.. ఎటైనా తిరుగుతుంద‌న్న గుస‌గుస‌లు ఇప్పుడు విశాఖ టీడీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

గంటా గ్రూపు కావడంతో….

దీనికి కార‌ణం.. ఆమె రాజ‌కీయంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు గ్రూపుగా ముద్రప‌డ‌డ‌మే. ఆయ‌న క‌నుస‌న్నల్లోనే వంగ‌ల‌పూడి అనిత‌ రాజ‌కీయం చేస్తార‌ని పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా పేరుంది. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఆమె గంటా చెప్పిన‌ట్టే పాయ‌క‌రావుపేట‌తో పాటు విశాఖ జిల్లాలోనూ రాజ‌కీయం చేశార‌నే టాక్ ఉంది. ఇక పార్టీ ఎన్నిక‌ల్లో ఓడిపోయాక గంటా ప‌క్క చూపులు చూస్తున్నా.. పార్టీని ప‌ట్టించుకోక‌పోయినా కూడా వంగ‌ల‌పూడి అనిత‌ ఇప్పటికీ గంటా గ్రూపులోనే ఉన్నార‌ని అంటున్నారు. ఇక‌, గంటా రేపో మాపో పార్టీ మారి అధికార పార్టీలోకి వ‌స్తే.. ఆయ‌న వెంట టీంను తెచ్చుకొంటే.. ఆ గ్రూపులో ఖ‌చ్చింత‌గా వంగ‌ల‌పూడి అనిత‌ కూడా ఉంటార‌ని టీడీపీ వాళ్లే చెపుతున్నారు.

అయ్యన్న సుధాకర్ ను ప్రోత్సహించడంతో…..

పైగా టీడీపీలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబుతో ఆమె ముందునుంచి అంటీముట్టన‌ట్టే వ్యవ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఈ క్రమంలోనే వంగ‌ల‌పూడి అనిత‌ను న‌మ్మని అయ్యన్న పాత్రుడు పాయ‌క‌రావుపేట‌లో కొంద‌రు విశ్రాంత ఉద్యోగుల‌ను ప్రోత్సహిస్తున్నార‌ని టాక్‌. కొద్ది రోజుల క్రితం ఏపీ వ్యాప్తంగా వివాదస్పదం అయిన ఓ డాక్టర్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాయ‌క‌రావుపేట నుంచి పోటీ చేసేలా అయ్యన్నే ప్రోత్సహించార‌న్న ప్రచారం కూడా ఉంది. ఇక‌, ఇప్పుడు వంగ‌ల‌పూడి అనిత‌కు పాయ‌క‌రావు పేట ప‌గ్గాలు ఇచ్చినా.. ఆమె విశాఖ‌లోనే ఉంటున్నారు. కేవ‌లం సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నార‌నే త‌ప్ప ప్రత్యక్షంగా పార్టీకి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పైగా పాయ‌రావుపేట‌లో ఉండ‌డం లేదు.. స‌రిక‌దా నియోజ‌క‌వ‌ర్గానికి చుట్టపు చూపుగా వ‌చ్చి పోతున్నారు.

అందుకే అనుమానాలు…

ఇక వంగ‌ల‌పూడి అనిత‌ గురువు గంటాను టీడీపీ న‌మ్మడం లేదు.. ఆయ‌న‌కు టీడీపీపై కూడా న‌మ్మకం లేదు. ఇక చంద్రబాబు వంగ‌ల‌పూడి అనిత‌కు తిరిగి పాయ‌క‌రావుపేట ప‌గ్గాలు ఇచ్చినా.. ఆమెను ఏకంగా ఏపీ టీడీపీ మ‌హిళా అధ్యక్షురాలిని చేసినా కూడా ఆమె గంటా చెప్పిన‌ట్టు వింటున్నార‌ని జిల్లా పార్టీలో కొంద‌రు గుర్రుగా ఉన్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. గ‌తంలో ఆమె ఇక్కడ ఎద‌రైన వ్యతిరేక‌త ఎక్క‌డా త‌గ్గక‌పోగా.. మ‌రింత పెరుగుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. పైగా గంటాతో పాటు.. పార్టీ మారే అవ‌కాశం కొట్టిపారేయ‌లేమ‌ని అంటున్నారు. మ‌రి అనిత‌మ్మ ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News