“అనిత”రసాధ్యురాలేనా ?

తెలుగుదేశం పార్టీ ఇపుడు చాలా ఇబ్బందుల్లో ఉంది. ఓ విధంగా చావో రేవో అన్నట్లుగా పార్టీ పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో పార్టీలో సీనియర్లు కాడి వదిలేశారు. [more]

Update: 2020-03-29 13:30 GMT

తెలుగుదేశం పార్టీ ఇపుడు చాలా ఇబ్బందుల్లో ఉంది. ఓ విధంగా చావో రేవో అన్నట్లుగా పార్టీ పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో పార్టీలో సీనియర్లు కాడి వదిలేశారు. వారికి వయసు అయిపోవడం ఒక సమస్య అయితే పార్టీ పోకడల పట్ల ఉన్న అసంతృప్తి మరో కారణం. ఈ నేపధ్యంలో కొత్త వారిని ముందుకు తీసుకురావాలని, వారితోనే బండి లాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దాంతో విశాఖ జిల్లా పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే వంగల‌పూడి అనితకు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఆమె పట్ల చంద్రబాబు ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు.

సమర్ధత చూసే…?

వంగలపూడి అనిత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నిజానికి కంచుకోట లాంటి పాయకరావుపేట 2009 నాటికి కాంగ్రెస్ పరం అయింది. ఆ సీట్లో గొల్ల బాబూరావు గెలిచారు. ఆయన రెండవసారి అంటే 2012న జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి సత్తా చాటారు. ఆ విధంగా సైకిల్ పంక్చర్ అయిన వేళ టీడీపీ నుంచి సరైన నేత కానరాలేదు. దాంతో టీచర్ గా ఉన్న వంగలపూడి అనితను తెచ్చి 2014 ఎన్నికల్లో పోటీ చేయించారు. ఆమె మంచి మెజారిటీతో గెలవడమే కాకుండా అయిదేళ్ళ టీడీపీ ఏలుబడిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాకు సరిసాటి అనిపించుకున్నారు.

దళిత కార్డుతో….

వంగలపూడి అనితకు మంచి వాగ్దాటి ఉండడమే కాదు, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన విద్యావంతురాలు కావడంతో వైసీపీ మీద బాబు ఆమెనే ప్రయోగిస్తూ వస్తున్నారు. అది సక్సెస్ కావడంతో ప్రతిపక్షంలో పార్టీ ఉన్న వేళ వంగలపూడి అనిత లాంటి పెద్ద గొంతులు అవసరమని బాబు ఆమెను తెలుగు మహిళను చేశారు. ఆమె ఇపుడు గట్టిగానే తన వాణిని వినిపిస్తూ వైసీపీ తప్పులను ఎక్కడికక్కడ ఏకి పారేస్తోంది. ఓ విధంగా బాబు నిర్ణయం మంచిదేనని పార్టీలో అంతా అంటున్నారు. దళితులు ఎక్కువగా వైసీపీకి అండగా ఉన్న వేళ బాబు వేసిన తెలివైన ఎత్తుగడేనని విశ్లేషిస్తున్నారు.

గుడ్ లుక్స్ లో….

ఇక తాజాగా వంగలపూడి అనిత పుట్టిన రోజు వేళ చంద్రబాబు ప్రత్యేకంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం విశేష పరిణామం. టీచర్ గా ఉన్న మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇపుడు సమాజాన్ని కూడా మంచి మార్గంలో పెట్టేందుకు మీ ఉపాధ్యాయ‌ వ్తుత్తి, అనుభవం ఉపయోగించుకోవాలంటూ బాబు వంగలపూడి అనితకు సూచిస్తూ గ్రీట్ చేయడం విశేషం. అనిత ఇపుడు పాయకరావుపేటలో నుంచే తన రాజకీయ కార్యకలాపాలు మొదలుపెడుతున్నారు. ఆమె పార్టీలో వర్గాలను కూడా సరిచేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో రాష్త్రవ్యాప్తంగా మహిళా సమస్యలపైన పోరాటానికి కూడా సిధ్ధపడుతున్నారు. మొత్తానికి అనితరసాధ్యురాలిని అని బాబు చేత అనిపించుకోవాలనుకుంటున్నారట.

Tags:    

Similar News