వీళ్లిద్దరిని చూస్తే ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తారు?

పార్టీలు మారడం ఈరోజుల్లో సర్వసాధారణం. రాజకీయాల్లో జంపింగ్ లు కామన్ అయిపోయాయి. అధికారం ఎటువైపు ఉంటే అటు వైపు దూకేయడం రాజకీయాల్లో మామూలయిపోయింది. కొంతమంది సీనియర్ నేతలయితే [more]

Update: 2020-04-28 02:00 GMT

పార్టీలు మారడం ఈరోజుల్లో సర్వసాధారణం. రాజకీయాల్లో జంపింగ్ లు కామన్ అయిపోయాయి. అధికారం ఎటువైపు ఉంటే అటు వైపు దూకేయడం రాజకీయాల్లో మామూలయిపోయింది. కొంతమంది సీనియర్ నేతలయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. కానీ తండ్రుల వారసత్వంతో వచ్చిన యువనాయకులు మాత్రం అధికారం కోసమే అర్రులు చాస్తారు. అదే వారి రాజకీయ జీవితాలకు శాపంగా మారింది. వారే విజయవాడ నేతలు వంగవీటి రాధా, దేవినేని అవినాష్ లు.

వంగవీటి రాధా గెలిచి…..

వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి రంగా వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి రెండు దశాబ్దాల క్రితం వంగవీటి రాధా రాజకీయాల్లోకి వచ్చారు. ఒక్కసారి మాత్రమే గెలిచారు. 2004 ఎన్నికల్లో వంగవీటి రాధా విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకూ అదే ఆయన మొదటి చివరి గెలుపు. వంగవీటి రాధా తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తన ప్రత్యర్థి దేవినేని కుటుంబం టీడీపీలో ఉండటంతో వంగవీటి కుటుంబం కాంగ్రెస్ ను ఎంచుకుంది.

నాలుగు పార్టీలు మారి…..

ఇక ఆ తర్వాత వంగవీటి కుటుంబం టీడీపీలోకి జంప్ అయింది. కాంగ్రెస్ నుంచి రాధా తల్లి వంగవీటి రత్నకుమారి టీడీపీలోకి చేరిపోయారు. ఆ తర్వాత వంగవీటి రాధా ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయారు. అక్కడా గెలవలేకపోయారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరి ఓటమి పాలవ్వడం, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలపడంతో వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. పదిహేనేళ్ల నుంచి వంగవీటి రాధా గెలుపనేది ఎరుగరు.

మూడు పార్టీలు మారిన దేవినేని….

దేవినేని కుటుంబం కూడా ఇందుకు మినహాయింపు కాదు. దేవినేని నెహ్రూ దశాబ్దాల పాటు టీడీపీలోనే ఉండి జిల్లా రాజకీయాలు శాసించారు. ఎన్టీఆర్ మరణం తర్వాత దేవినేని నెహ్రూ కాంగ్రెస్ లో చేరారు. 2019 ఎన్నికలకు ముందు తన కుమారుడు దేవినేని అవినాష్ భవితవ్యం కోసం ఆ కుటుంబం టీడీపీలో చేరింది. దేవినేని అవినాష్ ఇప్పటి వరకూ గెలుపునకు నోచుకోలేదు. 2014 ఎన్నికలలో ఎంపీగా, 2019 ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపు ముఖం చూడలేదు. దేవినేని అవినాష్ ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. ఇప్పటికి మూడు పార్టీలు దేవినేని కుటుంబం మారింది. వంగవీటి కుటుంబం నాలుగు పార్టీల గడపలను తొక్కింది. అయినా వీరు గెలుపు ముఖం చూడలేదు. వీరిని చూసైనా యువనేతలు రాజకీయాలు నేర్చుకోవాలంటున్నారు.

Tags:    

Similar News