ఆ ప్రపోజల్ కు వంగవీటి ఎందుకు నో చెప్పారు?

అవకాశం ఉన్నప్పుడు అందిపుచ్చుకోవాలి. అవకాశాలు వచ్చేంత వరకూ వెయిట్ చేయాలి. ఇది రాజకీయాల్లో ప్రాధమిక సూత్రం. కానీ ఈ రెండు విషయాలను విజయవాడ నేత వంగవీటి రాధా [more]

Update: 2020-08-21 02:00 GMT

అవకాశం ఉన్నప్పుడు అందిపుచ్చుకోవాలి. అవకాశాలు వచ్చేంత వరకూ వెయిట్ చేయాలి. ఇది రాజకీయాల్లో ప్రాధమిక సూత్రం. కానీ ఈ రెండు విషయాలను విజయవాడ నేత వంగవీటి రాధా పట్టించుకోలేదు. ఆచరణలో కూడా పెట్టలేదు. ఫలితంగా రాజకీయంగా వంగవీటి రాధా ఎందుకూ పనికి రాకుండా పోయారు. దాదాపు పదేళ్ల పాటు పదవికి దూరంగా ఉన్న వంగవీటి రాధా ఇలాగే ఉంటే మరో పదేళ్లయినా ఎమ్మెల్యే పదవి దక్కదన్నది వారి అనుచరులే బాహాటంగా చర్చించుకుంటున్న అంశం.

ఆ అవకాశం వచ్చినా….

వంగవీటి రాధాకు ఇప్పుడు అనుకోని అవకాశం వచ్చింది. దానిని అందిపుచ్చుకునేందుకు వంగవీటి రాధా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తాను ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు. అయితే కాపు నేతల్లో చరిష్మా కలిగిన నేతలు పెద్దగా లేరు. వంగవీటి రంగా ఒకప్పుడు కాపు నేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

అనుచరులు నూరిపోస్తున్నా…..

ఇప్పుడు ఆయన తనయుడు వంగవీటి రాధా ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తే మైలేజీ వస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారట. ఉద్యమం పేరిట ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందవచ్చని కూడా వంగవీటి రాధాకు నూరిపోస్తున్నారట. అయితే ఆయన మాత్రం ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. తాను బెజవాడ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతానని ఆయన నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.

పూర్తిగా కనుమరుగై…..

వంగవీటి రాధా ఎన్నికలు ముగిసిన తర్వాత ఎక్కడా కన్పించలేదు. తండ్రి రంగా జయంతి, వర్థంతి కార్యక్రమాల్లో తప్ప వంగవీటి రాధా ఎక్కడా కన్పించరు. ఇప్పటికే నాలుగు పార్టీలు మారి వంగవీటి రాధా తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నారని రంగా అనుచరులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఆర్థికంగా కూడా అండగా ఉంటామని కొందరు చెబుతున్నా చెవికెక్కించుకోవడం లేదంటున్నారు. మొత్తం మీద వంగవీటి రాధా వచ్చిన అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ విఫలమవుతున్నారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News