వంగవీటి తో మళ్లీ మొదలుపెట్టారు

వంగవీటి మోహన రంగా 1985లో ఒక్కసారే ఎమ్మెల్యేగా చేశారు. అది కూడా ఎన్టీఆర్ ప్రజాదరణ మంచి ఉచ్చ స్థాయిలో ఉన్నపుడు ఆయనకు ఎదురు నిలిచి పోరాడారు. ఆయన [more]

Update: 2021-08-03 08:00 GMT

వంగవీటి మోహన రంగా 1985లో ఒక్కసారే ఎమ్మెల్యేగా చేశారు. అది కూడా ఎన్టీఆర్ ప్రజాదరణ మంచి ఉచ్చ స్థాయిలో ఉన్నపుడు ఆయనకు ఎదురు నిలిచి పోరాడారు. ఆయన అంతకు ముందు కార్పోరేటర్ గా చేశారు. ఇక వంగవీటి రంగాకు విశేషంగా అభిమానులు ఉన్నారు. ఆయన కాపు కులస్థుడు కావడంతో ఆ సామాజికవర్గం నుంచి అప్పట్లో వంగవీటి రంగాకు పెద్ద ఎత్తున మద్దతు దక్కింది. కాపునాడు పేరిట రాజకీయ రాజధాని విజయవాడలో తొలిసారిగా సభలను నిర్వహించింది వంగవీటి రంగాయే. ఒక విధంగా ఏపీలో మెల్లగా కుల జాఢ్యం ప్రవేశిస్తున్న రోజులవి. దాంతో మెజారిటీ గలిగిన తమకు న్యాయం దక్కడంలేదని కాపులు మనోవేదన పడుతున్న సమయాన వంగవీటి రంగా వారికి ఆశాజ్యోతిగానే కనిపించారు.

రాజకీయమే లాగింది…

విజయవాడలో రెండు వర్గాలు, దానితో పాటే రెండు సామాజిక నేపధ్యంతో కూడిన కక్షలు. రాజకీయాలు ఇవన్నీ కలసి కొన్నేళ్ళ పాటు సాగిన పోరులో వంగవీటి రంగా ఒక వైపు నిలబడ్డారు. ఆయన కులాంతర వివాహం చేసుకున్నారు. కులాలకు అతీతంగా అందరినీ ఆదరించారు. ముఖ్యంగా పేదలు బడుగుల పక్షాన పోరాడారు. ఆయనలో వామపక్ష భావాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఇదిలా ఉంటే వంగవీటి రంగాను మాత్రం ఒక కులానికి కట్టేసింది రాజకీయం. నాడు కమ్మలకు ఎన్టీయార్ రూపంలో రాజ్యం దక్కింది. దాంతో కాపులు వంగవీటి రంగాను ముందు పెట్టి రాజకీయ పావులు కదిపారని కూడా చెప్పాలి.

హత్యతో చిరంజీవి ….

ఇదిలా ఉంటే వంగవీటి రంగా మూడేళ్ళ పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన రాజ‌కీయం అంతా విజయవాడ సిటీలోనే సాగింది. ఏపీలో ఇతర ప్రాంతాలకు కూడా అయన ఎక్కడా పెద్దగా తిరిగింది లేదు. కానీ ఆయన నిరాహార దీక్ష చేస్తూండగా దారుణంగా హత్య చేయడంతో వంగవీటి రంగా చిరంజీవి అయిపోయాడు. ప్రత్యేకించి కాపులకు ఆయన దేవుడే అయ్యాడు. రంగా పవర్ ఫుల్ లీడర్ గా ఆ సామాజిక వర్గానికి నాడూ నేడూ కూడా అయ్యారు. ఆయన్ని మించిన వారు ఈ రోజుకీ లేరు అనే వారు అంటారు. వంగవీటి రంగా అంటే చాలు కాపులలో ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. అలా రంగాకు కాపుల ట్యాగ్ పడిపోయింది.

నిజమే కదా…?

ఇదిలా ఉంటే మంత్రి పేర్ని నాని తాజాగా మాట్లాడుతూ వంగవీటి రంగాకి ఒక కులాన్ని ఆపాదించవద్దు అని కోరారు. ఆయన అందరివాడు అంటూ పేర్కొన్నారు. ఆయన స్పూర్తి ప్రతి రాజకీయ నాయకునికీ ఉందని కూడా చెప్పుకొచ్చారు. వంగవీటి రంగా హత్యకు గురి అయ్యేనాటికి 41 ఏళ్ళ వారు. ఆయన యువకుడుగా అప్పట్లో చేసిన పోరాటాలు కానీ ప్రజల సమస్యల పట్ల అంకితభావం కానీ నిజంగా రాజకీయ నాయకులకు స్పూర్తి దాయకమే. అయితే వంగవీటి రంగాను కాపులను ఎవరూ విడదీయలేరు. ఆయన వారికి ఐకాన్ గా ముద్ర పడ్డారు. ఆ కులం గోడలను దాటి ఆయనను చూస్తే ఇంకా ఎక్కువ మందికే ఆయన చేరువ అవుతారు. కానీ అది జరిగే పనేనా?

Tags:    

Similar News