చైనా కన్ను లడాఖ్ మీద పడింది అందుకే?

లడాఖ్ . . . ఈ పేరు గురించి తెలియని భారతీయులు ఎవరుా ఉండరు. ఉమ్మడి జమ్ముక‌శ్మీర్ లో భాగమైన ఈ ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పబడి [more]

Update: 2020-08-13 16:30 GMT

లడాఖ్ . . . ఈ పేరు గురించి తెలియని భారతీయులు ఎవరుా ఉండరు. ఉమ్మడి జమ్ముక‌శ్మీర్ లో భాగమైన ఈ ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ పనిచేయడం సైనికులకు కత్తిమీద సాము వంటిది. చైనా, పాక్ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంపై ఆ రెండుదేశాలు ఎప్పుడుా ఓ కన్నేసి ఉంటాయి. అందువల్లే లడాఖ్, ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. సున్నితమైన, వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని కేంద్రం జమ్ముకశ్మీర్ నుంచి విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ మేరకు 2019 ఆగస్టు5న బిల్లును పార్లమెంట్ ఆమెాదించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినమైన గతఏడాది అక్టోబరు 31 నుంచి కేంద్రపాలిత ప్రాంతంగా లడాఖ్ ఆవిర్భవించింది. ఇక్కడి ఏకైక లోక్ సభస్ధానంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ కైవసం చేసుకుంది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

చైనాతో ఘర్షణ కారణంగా…..

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చైనాతో ఘర్షణల కారణంగా లడాఖ్ కేంద్రబిందువుగా నిల్చింది. ఈ ప్రాంతంలో ఉభయ దేశాల సైనికుల కదలికలు, ఘర్షణల కారణంగా వార్తల్లో నలుగుతోంది. ముఖ్యంగా తుార్పు లడాఖ్ ప్రాంతంపై చైనా మెుండిగా వ్యవహరిస్తోంది. దురాక్రమణలే లక్షంగా చైనా లడాఖ్ పై దృష్టి పెట్టిందని అందరుా భావిస్తున్నారు. ఇక్కడి సహజవనరులపై దృష్టిపెట్టిన బీజింగ్ వాటిని చేజిక్కంచుకునే లక్ష్యంతోనే ఘర్షణలకు దిగుతుందని తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి. లడాఖ్ ప్రాంతంలో చమురు, సహజ వాయువు నిక్షేపాలు హైడ్రోకార్బన్ నిల్వలు, యురేనియం వంటి విలువైన ఖనిజాలు ఉన్నట్లు వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది.

చమురు నిల్వల కోసమే….

దీంతో సహజంగానే చమురు కొరత ఎదుర్కొంటున్న చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది. చైనాలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత తీవ్రంగా ఉంది. చాలా వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. తన చమురు అవసరాల్లో 77 శాతం విదేశాల నుంచి చైనా పొందుతోంది. ఇందుకోసం పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తోంది. వేల సంవత్సరాల క్రితం లడాఖ్ ప్రాంతం ‘టెధీస్’ అనే సముద్రానికి దగ్గరగా ఉండేది. తరువాత రోజుల్లో భూకంపాల కదలికలవల్ల నిలువుగా పైకి లేచి పశ్చిమ, మధ్య హిమాలయాలుగా ఏర్నడింది. సముద్రగర్బ ప్రాంతాల్లో సహజంగానే హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ‘టెధీస్’ హిమాలయ ప్రాంతం లడాఖ్ లోని జన్సకర్ పర్వత ప్రాంతాల్లో 70 నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఈ ప్రాంతం కశ్మీర్, జన్సకర్, చాంబ, స్పిటె ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ షెల్ గ్యాస్, షెల్ ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుార్పు లడాఖ్ లోని వివిధ ప్రాంతాల్లో యురేనియం, వనాడియం, ధోరియం, వంటి భారీ లోహాలు, రేర్ ఎర్త్ ముాలకాలు ఉండవచ్చని అంచనా. తాజాగా భారత్ – చైనా సైన్యం మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతం ఈ ప్రదేశాలకు దగ్గరలోనే ఉంది. రేర్ ఎర్త్ మూలకాల ఉత్పత్తి లో చైనా ప్రపంచంలోే ముందంజలో ఉంది.

ఆధిపత్యాన్ని చాటుకునేందుకు….

దీంతో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, భౌగోళిక, రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ‘డ్రాగన్ ‘ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకుటు చెబుతున్నారు. 2018 లో చైనా 1.2 లక్షల టన్నుల రేర్ఎర్త్ మూలకాలను ఉత్పత్తి చేసింది. ఆస్ట్రేలియా, అమెరికా ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. ఇక్కడ లభ్యమయ్యే ఖనిజాలు ఇంధన, శాస్త్ర, సాంకేతిక, సైనిక పరిజ్ఞానాలకు కీలకం. ఇవి కంప్యూటర్లు, లాప్ టాప్ లు,మొబైల్ ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, ఫౌరఫలకాలు, విద్యుత్ కార్లు, ఉపగ్రహాలు, లేజర్లు, యుద్ద విమానాలు ఇంజన్లు వంటి అనేక అవసరాలకు ఉపయెాగపడాతాయి. ఈ ఉద్ధేశంతోనే బీజింగ్ లడాఖ్ ప్రాంతంపై దృష్టి పెట్టింది ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకుంటే అక్కడి సహజవనరులపై ఆధిపత్యం ఏర్పడుతుంది. తద్వారా దేశీయ చమురు అవసరాలను తీర్చుకోవచ్చు. విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతోంది. తద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ ముందస్తు వ్యూహంతోనే బీజింగ్ లడాఖ్ పై దృష్టి పెట్టింది. భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ విషయం హెచ్చరిస్తోంది. తస్మాత్ జాగ్రత్త.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News