వ‌సంత‌కు త‌గ్గిన ప్రాధాన్యం.. రీజ‌న్ ఇదేనా…?

కృష్ణా జిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి సంచ‌ల‌న విజ‌యం సాధించిన వ‌సంత కృష్ణప్రసాద్ ఉర‌ఫ్ కేపీకి ఆదిలో ఉన్న రేటింగ్ ఇప్పుడు అటు నియోజ‌క‌వ‌ర్గంలోను, ఇటు పార్టీలోనూ [more]

Update: 2020-12-16 11:00 GMT

కృష్ణా జిల్లా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి సంచ‌ల‌న విజ‌యం సాధించిన వ‌సంత కృష్ణప్రసాద్ ఉర‌ఫ్ కేపీకి ఆదిలో ఉన్న రేటింగ్ ఇప్పుడు అటు నియోజ‌క‌వ‌ర్గంలోను, ఇటు పార్టీలోనూ త‌గ్గుముఖం ప‌ట్టిందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు ముందు మంచి దూకుడు ప్రద‌ర్శించారు వ‌సంత‌. త‌న చిర‌కాల రాజ‌కీయ శ‌త్రువు అయిన మాజీ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వర‌రావుపై పైచేయి సాధించేందుకు ఆయ‌న చేయ‌ని ప్రయ‌త్నం లేదు. జ‌గ‌న్ విజ‌య‌వాడ ఎంపీ సీటు ఆఫ‌ర్ చేసినా కాద‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఉమాను ఓడిస్తాన‌ని మైల‌వ‌రంలో పోటీ చేసి స‌క్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మెజార్టీ క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకోన్నారు.

ఎన్నికలకు ముందున్న…..

ఈ ప‌రిణామం ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌సంత‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. క‌మ్మ వ‌ర్గం మొత్తంగా లోపాయికారీగా టీడీపీలోనే ఉంటూ వ‌సంత‌కు అనుకూలంగా ప‌ని చేసి గెలిపించింది. ఎన్నిక‌ల‌కు ముందు అవినీతిపారుద‌ల శాఖా మంత్రి అంటూ దేవినేనిపై విమ‌ర్శల ప‌ర్వం కొన‌సాగించారు. ఇటు పార్టీలోనూ వ‌సంత కృష్ణప్రసాద్ దూకుడు బాగానే క‌నిపించింది. ఇవ‌న్నీ వ‌సంత నాయ‌క‌త్వ ల‌క్షణాల‌ను బ‌ల‌ప‌రిచాయి. క‌ట్ చేస్తే.. ఏడాదిన్నర అయింది. మ‌రి ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా వ‌సంత గ్రాఫ్ ఇలానే ఉందా ? పార్టీలోను, నియోజ‌క‌వ‌ర్గంలోనూ వ‌సంత అదే రేంజ్‌ రేటింగ్‌లో ఉన్నారా ? అంటే స‌మాధానం ప్రశ్నార్థకంగా మారిపోయింది.

సరైన వ్యూహం లేక….

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను బ‌ల‌ప‌రిచిన క‌మ్మ వ‌ర్గమే ఇప్పుడు ఆయ‌న‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నిక‌ల నాటి హామీలు ఎక్కడివ‌క్కడే ఉండిపోయాయి. కొండ‌ప‌ల్లి గనుల త‌వ్వకాల ఆరోప‌ణ‌లు వ‌సంత కృష్ణప్రసాద్ మెడ‌కు చుట్టుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావ‌డంలో అల‌స‌త్వం వంటివి ప్రధాన మైన‌స్‌లుగా మారిపోయాయి. ఉమా లాంటి బ‌ల‌మైన ప్రత్యర్థి ఎప్పుడూ ప్రజ‌ల నోళ్లలో నానుతుంటారు. వ‌సంత కృష్ణప్రసాద్ యేడాదిన్నర‌కే రిలాక్స్ అయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. స‌రైన వ్యూహాలు లేక నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్పట‌కీ స‌రైన గ్రిప్ లేదు.

దేవినేని ఓడినా…..

ఇక‌, దేవినేని ఓడిపోయినా రాజ‌కీయంగా దూకుడు పెంచారు. తాను త‌ప్ప క‌మ్మసామాజిక వ‌ర్గానికి ఉపయోగ‌ప‌డిన వారు లేర‌నే ఆయ‌న వాద‌న‌ను ఇప్పుడు బ‌లంగా తీసుకువెళ్తున్నారు. ఇక ఉమా అంటేనే ప్రత్యేకంగా చెప్పేదేం ఉంటుంది. అంతా ప‌బ్లిసిటీ స్టంట్‌… ఎక్కడ ఏం జ‌రిగినా ? స‌మ‌స్య ఎక్కడున్నా వాలిపోతున్నారు. ఇవ‌న్నీ ప్రజ‌ల్లో హైలెట్ అవుతున్నాయి. వీటికి వ‌సంత కృష్ణప్రసాద్ నుంచి స‌రైన కౌంట‌ర్లు ఉండ‌డం లేదు. ఇక జిల్లా పార్టీ నేత‌ల‌తోనూ అంటీ ముట్టన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక జిల్లాలో ఇదే సామాజిక వర్గం నుంచి మంత్రి కొడాలి నాని అటు చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఉమా లాంటి వాళ్లను ఉతికి ఉతికి ఆరేస్తున్నారు. వైసీపీ అధిష్టానానికి కూడా ఇదే కావాలి.

ఇలాగే కొనసాగిస్తే…..

వ‌సంత కృష్ణప్రసాద్ కు ప్రత్యర్థికిగా ఉన్న ఉమాకు కొడాలి దిమ్మతిరిగే వ్యాఖ్యల‌తో కౌంట‌ర్లు, వార్నింగ్‌లు ఇస్తున్నారు. వ‌సంత నోరు మాత్రం పెగ‌ల‌డం లేదు. స‌హ‌జంగానే వైసీపీ అధిష్టానం కూడా వ‌సంత కృష్ణప్రసాద్ నుంచి ఉమాకు దిమ్మతిరిగే పంచ్‌లు ప‌డాల‌ని కోరుకుంటోంది. ఈ విష‌యంలో కూడా ఆయ‌న స‌క్సెస్ అవ్వలేద‌న్న అప‌వాదు వైసీపీలో ఉంది. ఈ ప‌రిణామాల‌తో వ‌సంత ప‌రిస్థితి ఇర‌కాటంలో ప‌డింది. ఏదేమైనా వ‌సంత‌లో దూకుడు పెర‌గ‌క‌పోతే ఈ రాజ‌కీయంతో ఉమాను ఢీ కొట్టడం క‌ష్టమే.

Tags:    

Similar News