మ‌నోడు సైలెంట్ అయ్యాడే.. ఎందుకలాగ?

“మ‌నోడు సైలెంట్ అయ్యాడే.. ఎక్కడా నోరెత్తడం లేదుగా!“ ఇదీ .. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య సాగుతున్న చిన్న గుస‌గుస‌. ఇంత‌కీ ఎవ‌రు..? ఎందుకు మౌనంగా ఉన్నాడు? [more]

Update: 2021-05-14 08:00 GMT

“మ‌నోడు సైలెంట్ అయ్యాడే.. ఎక్కడా నోరెత్తడం లేదుగా!“ ఇదీ .. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య సాగుతున్న చిన్న గుస‌గుస‌. ఇంత‌కీ ఎవ‌రు..? ఎందుకు మౌనంగా ఉన్నాడు? అనేది నిజంగానే చ‌ర్చనీయాంశంగా ఉన్నాయి. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌కీయాల్లో సామాజిక వ‌ర్గాల‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో సామాజిక వ‌ర్గాల ప్రభావం వ‌ల్లే ఓటు బ్యాంకు చాలా మ‌టుకు చీలిపోయింద‌నే విశ్లేష‌ణ‌లు ఉన్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ఓటు బ్యాంకును.. త‌మ సామాజిక వ‌ర్గాల‌ను కాపాడుకునేందుకు నాయ‌కులు ప్రయ‌త్నిస్తున్నారు.

దేవినేని ఉమ విషయంలో….?

ఇక‌, ఈ క్రమంలోనే సామాజిక వ‌ర్గాలు ఆగ్రహం చెందుతాయ‌ని గ‌మ‌నించిన విష‌యాల జోలికి ఎమ్మెల్యేలు ఎవ‌రూ కూడా దృష్టి పెట్టడం లేదు. ఇలాంటి ఘ‌ట‌నే కృష్ణాజిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వర‌రావుపై సీఐడీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఏకంగా ఆయ‌న జ‌గ‌న్ విష‌యంలో త‌ప్పు చేశార‌ని, మార్ఫింగ్ వీడియోల‌ను ప్రద‌ర్శించి జ‌గ‌న్ ఇమేజ్‌కు డ్యామేజీ క‌లిగించే ప్రయ‌త్నం చేశార‌ని అభియోగం మోపారు. దీంతో కోర్టును ఆశ్రయించిన ఉమా .. కొంత‌మేర‌కు అరెస్టు చేయ‌కుండా రిలీఫ్ సాధించారు.

జగన్ ను తిట్టిపోసినా.?

అయితే.. ఏకంగా సీఎం జ‌గ‌న్‌ను బ‌ద్నాం చేసేందుకు ప్రయ‌త్నించినప్పటికీ మాజీ మంత్రి దేవినేనిపై ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ నాయ‌కుడు వ‌సంత కృష్ణ ప్రసాద్ ప‌న్నెత్తు మాట అన‌లేదు. క‌నీసం ఒక్క విమ‌ర్శ కూడా చేయ‌లేదు. అయితే.. ఇదే విష‌యంపై అధిష్టానం కూడా సీరియ‌స్ అయిన‌ప్పటికీ.. ఆయ‌న మాత్రం మౌనం పాటించారు. దీనికి కార‌ణంఏంటి? అనే విష‌యంపై వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య చ‌ర్చ న‌డిచింది. గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గం వసంత‌వైపు న‌డిచింది. ఇది దేవినేనిని తీవ్ర విఘాతం క‌లిగించింది. దీంతో ఇప్పుడు క‌మ్మ వ‌ర్గాన్ని తిరిగి త‌న‌వైపు తిప్పుకొనే ప్రయ‌త్నం చేస్తున్నారు.

ఆ వర్గం దూరం కాకూడదనే?

ఈ స‌మ‌యంలో తాను మ‌ళ్లీ క‌మ్మ వ‌ర్గానికి చెందిన దేవినేనిపై విమ‌ర్శలు చేసి..ఆయ‌న‌పై కామెంట్లు చేస్తే.. ఈ వ‌ర్గానికి కోపం వ‌స్తుంద‌ని భావించిన వ‌సంత కృష్ణప్రసాద్‌.. త‌న‌కు ఈ విష‌యం తెలియ‌న‌ట్టే ఉన్నారు. కానీ.. పార్టీలో ఒక క‌ట్టుబాటు ఉంది. నాయ‌కుల‌ను విమ‌ర్శిస్తే.. ప‌ట్టించుకున్నా, ప‌ట్టించుకోక‌పోయి…. ముఖ్యమంత్రి జ‌గ‌న్ ను ఎవ‌రు విమ‌ర్శించినా.. వైసీపీ నాయ‌కులు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఊరుకోరు. మ‌రి అలాంటిది వ‌సంత కృష్ణ ప్రసాద్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అనేది వైసీపీ నేత‌ల మ‌ధ్య సాగుతున్న చ‌ర్చ. ఆయ‌న త‌న వ‌ర్గాన్ని దూరం చేసుకోవ‌డం ఇష్టంలేక‌.. దేవినేని వ‌ర్గంలో ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆగ్రహానికి గురికాకుండా చూసుకునేందుకు మాత్రమే ఇలా చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి అధిష్టానం వ‌సంత కృష్ణ ప్రసాద్ ను ఎలా అర్ధం చేసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News