వసుంధరను తప్పించేశారు.. ఇదిగో రుజువు

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ అధినాయకత్వం పూర్తిగా పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థినవ్వాలని భావిస్తున్న వసుంధర రాజేను పార్టీ [more]

Update: 2021-04-13 18:29 GMT

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేను బీజేపీ అధినాయకత్వం పూర్తిగా పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థినవ్వాలని భావిస్తున్న వసుంధర రాజేను పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదని మరోసారి రుజువయింది. ఉప ఎన్నికల సందర్భంగా వసుంధర రాజేను పెద్దగా బీజేపీ పట్టించుకోలేదు. దీంతో వసుంధర రాజే మరోసారి అలకపాన్పు ఎక్కారంటున్నారు.

తనను సీఎం అభ్యర్థిగా….

వచ్చే ఎన్నికలకు తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించాలని వసుంధర రాజే గత కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై వత్తిడి తెస్తున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కూడా కలిశారు. కానీ పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం చూసీ చూడనట్లుగానే ఉంది. రాజస్థాన్ బీజేపీ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి వసుంధర రాజే వర్గం కాగా, మరకొటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సతీష్ పునియా వర్గంగా ఉంది.

ప్రాధాన్యత ఇవ్వకుండా….

పార్టీ కేంద్ర నాయకత్వం సతీష్ పునియా వర్గానికే ప్రాధాన్యత ఇస్తుంది. అన్ని పార్టీ పదవుల్లోనూ ఇప్పటికే వసుంధర రాజే వర్గాన్ని పక్కన పెట్టడంతో ఆమె రగలిపోతున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమై వసుంధర రాజే భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. తాను పార్టీలో ఉండాలంటే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని వసుంధర రాజే బాగానే వత్తిడి తెస్తున్నారు. అయితే ఉప ఎన్నికల సమయంలో వసుంధర రాజేను అసలు పట్టించుకోలేదు.

అవమానమే కదా?

రాజస్థాన్ లో మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో వసుంధర రాజే పేరు ఐదో స్థానంలో ఉంది. తన ప్రాధాన్యత ఏమిటో పార్టీ కేంద్రనాయకత్వం వసుంధర రాజేకు చెప్పినట్లయింది. ప్రచార పోస్టర్లలోనూ ఆమె ఫొటోలేదు. దీంతో వసుంధర రాజే పార్టీ కేంద్ర నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనని స్పష్టంగా చెప్పవచ్చు. మరి వసుంధర రాజే దారి ఎటనేది భవిష్యత్ లో తెలియనుంది.

Tags:    

Similar News