వాసుపల్లిని గిల్లుతున్న కొత్త లీడర్ ?

విశాఖ సౌత్ వైసీపీలో ఉన్నన్ని గ్రూపులు మరో చోట లేవనే చెప్పాలి. అవి చాలదు అన్నట్లుగా టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి [more]

Update: 2021-09-12 08:00 GMT

విశాఖ సౌత్ వైసీపీలో ఉన్నన్ని గ్రూపులు మరో చోట లేవనే చెప్పాలి. అవి చాలదు అన్నట్లుగా టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి వచ్చి మరింత రాజకీయ రచ్చ చేస్తున్నారు అన్న మాట ఉంది. ఇక వాసుపల్లి వైసీపీలో చేరినా తన వర్గాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఆయనతో వచ్చిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో అసలు వైసీపీ, కొసరు వైసీపీ, టీడీపీ నుంచి వచ్చిన నేతలతో కూడిన వైసీపీ ఇలా అనేక ముక్కలుగా సౌత్ లో పార్టీ కనిపిస్తుంది.

పట్టు తగ్గిందా …?

వాసుపల్లి గణేష్ కుమార్ మీద ఈ మధ్య వైసీపీ అధినాయకత్వం ఫోకస్ బాగా పెట్టింది. ఆయన పార్టీ మీద పూర్తిగా విశ్వాసం చూపించడంలేదన్న అనుమానాలు కూడా పెద్దలకు ఉన్నాయట. ఇదిలా ఉంటే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా ఉంటూ కొన్ని భూ ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారు అన్నది వైసీపీ నేతల ఆరోపణ. వాటిని జీవీఎంసీ ఆ మధ్య కూలగొట్టేసింది. దాంతో ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలమే అయిపోయారు. కానీ వైసీపీలోని మరో వర్గం మాత్రం జీవీఎంసీ యాక్షన్ కి మద్దతు ప్రకటించింది. ఇక టీడీపీ చేతిలో ఉన్న షాదీఖానాను కూడా ఈ మధ్య వైసీపీ నేతలు తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. దాంతో సౌత్ లో వాసుపల్లి గణేష్ కుమార్ పట్టు బాగా తగ్గింది అన్న మాట ఆయన అనుచరుల నుంచే వినిపిస్తోంది.

ఈయన పోటీగా …?

ఈ మధ్య జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో విశాఖ సౌత్ లోని 39వ వార్డు నుంచి గెలిచిన వైసీపీ కార్పోరేటర్ మహమ్మద్ సాధిక్ పొలిటికల్ గా దూకుడు బాగా పెంచేశారు. ఆయనే వాసుపల్లి గణేష్ కుమార్ అనుచరుల అక్రమ దుకాణాలను కూల్చేలా చూశారు. మరో వైపు షాదీఖానా మీద పెత్తనం చేస్తున్నారు. ఆయన వాసుపల్లికి పూర్తి యాంటీగా మారి ఆయన చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి అడ్డుతగులుతున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఎప్పటికైనా టీడీపీలోకే అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. ఆయన తన సొంత ప్రయోజనాల కోసమే ప్రస్తుతం వైసీపీలో ఉన్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఆయన్ని పార్టీ నమ్మవద్దు అంటూ హెచ్చరిస్తున్నారు.

ఎమ్మెల్యేగా…

సౌత్ లో వైసీపీ రెండు సార్లూ మత్యకారులకు టికెట్ ఇచ్చింది. అక్కడ మైనారిటీలు కూడా ఉన్నారు. వారిలో మెజారిటీ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. వారి అండతో తాను బరిలోకి నిలబడాలని సాధిక్ ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతు ఉందని కూడా తెలుస్తోంది. వాసుపల్లి గణేష్ కుమార్ ని వైసీపీలోకి తెచ్చినా కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ మాత్రం అసలైన వైసీపీ నేతకే ఇస్తారని అంటున్నారు. అది తనకు దక్కేలా సాధిక్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలతో వాసుపల్లి అనుచరులు కలవరపడుతున్నారు. మరి వాసుపల్లి తన బలం నిరూపించుకుంటారా, వైసీపీ ఆయన సేవలను గుర్తిస్తుందా అన్నదే చూడాలి మరి. ఏది ఏమైనా సాధిక్ వంటి కొత్త వారికే వైసీపీలో రేపటి రోజున చాన్స్ అంటున్నారు.

Tags:    

Similar News