వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి.. . ?

రాజకీయమంటే ఇదేనేమో. ఆయన పక్కా తెలుగుదేశం మనిషి. పదిహేనేళ్ళుగా టీడీపీలో ఉంటూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా [more]

Update: 2021-08-04 06:30 GMT

రాజకీయమంటే ఇదేనేమో. ఆయన పక్కా తెలుగుదేశం మనిషి. పదిహేనేళ్ళుగా టీడీపీలో ఉంటూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా కూడా పలుమార్లు పనిచేశారు. అటువంటి వాసుపల్లి గణేష్ జగన్ కి జై కొట్టడమే షాకింగ్ న్యూస్. ఎందుకంటే జగన్ సేవ్ విశాఖ పేరుతో 2017లో ఆందోళన చేస్తే జగన్ నడచిన విశాఖ రోడ్లు కలుషితం అయ్యాయని చెప్పి పసుపు నీళ్ళతో వీధులకు వీధులు కడిగిన కరడు కట్టిన టీడీపీ నేత వాసుపల్లి గణేష్ . ఆయన వైసీపీలో గత ఏడాది చేరారు. ఆయన టీడీపీకి వెన్నుపోటు పొడిచారు అంటూ చంద్రబాబు కూడా బాధపడ్డారు. మరి ఇంతలోనే వాసుపల్లి గణేష్ మనసు మారిందా అన్నదే చర్చగా ఉంది.

అసంతృప్తి వెల్లువ ….

వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరడం వెనక ప్రేమ లేదని ఆ పార్టీ నాయకులు అంటారు. ఆయన తన పనులు నెరవేర్చుకునేందుకే అధికార పార్టీలోకి వచ్చారని కూడా దెప్పిపొడుస్తారు. ఇక జీవీఎంసీ ఎన్నికల్లో కూడా అసలైన వైసీపీ నేతలకు టికెట్లు ఇవ్వకుండా తనతో పాటు వచ్చిన టీడీపీ వారికే ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా వాసుపల్లి గణేష్ సైడ్ నుంచి చూస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పనులు కావడంలేదు అన్న అసంతృప్తి ఆయనలో ఉందని అంటారు. అదే టైమ్ లో ఆయనకు పోటీగా వైసీపీ నేతలు కూడా సౌత్ లో గట్టిగా ఉన్నారు, వారికి హై కమాండ్ అండ ఉందని కూడా అనుమానిస్తున్నారు.

ఒక్క పోటుతో అలా…?

ఇక వాసుపల్లి గణేష్ మద్దతుదారులుగా ఉన్న వారి ఆక్రమణల మీద జీవీఎంసీ గునపం దిగిపోయింది. దాంతో వాసుపల్లిలో ఒక్కసారిగా ఆగ్రహం ఉప్పొగింది. తన వారిని కాపాడుకోలేని ఈ అధికార పార్టీలో ఉండడం ఎందుకు అన్న బాధ కూడా కలిగిందిట. అందుకే ఆయన బాహాటంగానే ఒక్క మాట అనేశారు. రెండేళ్ళ వైసీపీ సర్కార్ ఏలుబడిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదని ఆయన ఘాటు విమర్శలే చేశారు. అయితే తమ పార్టీలో ఉంటూ ప్రభుత్వం మీద వాసుపల్లి గణేష్ విమర్శలు చేయడమేంటి అని వైసీపీ నేతలు కూడా గట్టిగానే తగులుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాలలో దురాక్రమణలను కూలిస్తే ఆయనకు అంత గుస్సా ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు.

సొంత గూటికేనా…?

ఇక వాసుపల్లి గణేష్ కి వైసీపీలో సీన్ అర్ధమైపోయిందిట. వాసుపల్లి విమర్శలతో వైసీపీ పెద్దలు కూడా అలెర్ట్ అయ్యారని టాక్. దాంతో వాసుపల్లి ఇక వైసీపీలో ఉండలేరు అన్న మాట కూడా ఉంది. ఆయన హానీమూన్ ముగిసింది అంటున్నారు. దీని మీద విజయసాయిరెడ్డి దృష్టి పెడతారు అంటున్నారు. వాసుపల్లి గణేష్ మళ్ళీ టీడీపీలోకి వెళ్తారని కూడా టాక్ నడుస్తోంది. ఎటూ విశాఖ సౌత్ లో సరైన లీడర్ లేక ఆ పార్టీ అల్లాడుతోంది. వాసుపల్లి గణేష్ వస్తే కనుక చేర్చుకునేందుకు రెడీ అంటున్నారు. మొత్తానికి వాసుపల్లి గోడ మీద పిల్లి అని వైసీపీ నేతలు అంటూంటే ఆయన భవిష్యత్తు అడుగుల మీద ఇపుడు విశాఖలో చర్చగా ఉంది.

Tags:    

Similar News