ఈ మంత్రికి టీడీపీయే ప్లస్ అవుతోందా..?
రాజకీయాల్లో నేతలకు రెండు విధానాలు ఉంటాయి. ఒకటి తమ స్వశక్తితో ఎదగడం.. ప్రజల్లో అభిమానం చూరగొనడం.. వారి మద్దతుతో విజయం దక్కించుకోవడం. రెండోది ప్రత్యర్థుల అస్థిరత.. ప్రత్యర్థి [more]
రాజకీయాల్లో నేతలకు రెండు విధానాలు ఉంటాయి. ఒకటి తమ స్వశక్తితో ఎదగడం.. ప్రజల్లో అభిమానం చూరగొనడం.. వారి మద్దతుతో విజయం దక్కించుకోవడం. రెండోది ప్రత్యర్థుల అస్థిరత.. ప్రత్యర్థి [more]
రాజకీయాల్లో నేతలకు రెండు విధానాలు ఉంటాయి. ఒకటి తమ స్వశక్తితో ఎదగడం.. ప్రజల్లో అభిమానం చూరగొనడం.. వారి మద్దతుతో విజయం దక్కించుకోవడం. రెండోది ప్రత్యర్థుల అస్థిరత.. ప్రత్యర్థి పార్టీలో నాయకత్వ లేమిని తమకు అనుకూలంగా మార్చుకుని.. తమ వ్యతిరేకతల నుంచి బయట పడడం. చాలా మంది మొదటి ప్రాధాన్యం దిశగానే అడుగులు వేస్తుంటారు. అయితే.. కొందరు మాత్రం తాము స్వతంత్రంగా పుంజుకోలేమని.. వ్యతిరేకత పెరిగిందని భావించినప్పుడు మాత్రం రెండో మార్గంలో దూసుకుపోతూ ఉంటారు. అయితే కొందరు నేతలకు సొంత పార్టీలో, నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత ఉన్నా.. ప్రత్యర్థి పార్టీలో దీనిని క్యాష్ చేసుకునే సత్తా ఉన్న లీడర్లు లేకపోతే ఈయనే గతవుతారు… అలా కొందరికి కాలం కలిసొచ్చేస్తుంటుంది.
వ్యతిరేకత బాగానే ఉన్నా…
ఇలాంటి పరిస్థితే.. దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు కలిసివస్తోందన్నది నిజం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెలంపల్లిపై గడిచిన రెండేళ్లుగా ప్రజల్లో సానుభూతి కొరవడింది. ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, దుర్గగుడికి సంబంధించి వెండి సింహాలు మాయం కావడం.. ఈవో వ్యవహారం వంటి కీలక విషయాల్లో .. ఆయన వ్యవహరించిన తీరుతో.. ఇక్కడిప్రజలు వెలంపల్లి శ్రీనివాస్ కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. కీలకమైన వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గంలో వ్యాపార వర్గాలు కూడా వెలంపల్లిని వ్యతిరేకిస్తున్నాయి. స్థానికంగా జరిగిన సంఘటలను కూడా మంత్రిని నియోజకవర్గంలో చాలా వర్గాలకు దూరం చేశాయి.
సైలెంట్ గా…..
మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేరిట కొన్నాళ్ల కిందట జరిగిన దందాలు.. ఇప్పటికీ జరుగుతున్న కొన్ని వసూళ్లు మంత్రిపై తీవ్ర స్థాయిలో వ్యాపారుల్లో ఆగ్రహం నెలకొంది. ఇవన్నీ మంత్రి ఆధ్వర్యంలోనే జరిగాయా ? లేదా ? అన్నది పక్కన పెడితే అంతిమంగా మంత్రిపై ఎఫెక్ట్ చూపించాయి. దీంతో సహజంగానే ఎన్నికల నాటికి ఈ వ్యతిరేకత ముదురుతుందని.. సో.. ఇప్పటి నుంచే అలెర్టయి.. చక్కదిద్దుకోవాలని.. వెలంపల్లి శ్రీనివాస్ భావిస్తున్నట్టు అనుకుంటే తప్పులో కాలేసినట్టే! ఎందుకంటే.. ఎవరు ఏమనుకున్నా..ఎవరు ఎంతగా తనపై ఆగ్రహం ప్రదర్శించినా.. ఆయన మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. ఎందుకంటే.. ఆయనకు విజయంపై అంత ధీమా ఉందట.
అందుకే ఆ ధీమా…
అంతే కాకుండా వెలంపల్లి శ్రీనివాస్ మళ్లీవిజయం నాదే..! అని ధైర్యంగా కూడా చెప్పేస్తున్నారు. మరి ఇంత వ్యతిరేకతలోనూ ఆయనకు ధైర్యానికి కారణం.. ఏంటంటే.. పైన చెప్పుకొన్న రెండో ఫార్ములానే అంటున్నారు పరిశీలకులు. ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా లేకపోవడంతోపాటు.. ఉన్న నాయకులు కూడా కీచులాడుకోవడం.. మాజీ ఎమ్మెల్యే జలీల్ అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ఇక్కడ టీడీపీ పగ్గాల కోసం నాగుల్ మీరా, బుద్ధా వెంకన్న మాత్రమే కాదు.. ఎంపీ కేశినేని నాని కూడా పావులు కదుపుతున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గం నుంచే కేశినేని నాని కుమార్తె శ్వేత కార్పొరేటర్‌గా ఎంపికయ్యారు. శ్వేత కూడా అక్కడ పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇన్ని గ్రూపుల గోలతో ఉన్న టీడీపీలో ఏ నేతా కూడా బయటకు వచ్చి మంత్రిపై విమర్శలు చేసే సాహసం చేయడం లేదు. ఇక్కడ నియోజకవర్గ పార్టీని లీడ్ చేసే నాయకులు లేకపోవడంతో మరోసారి తననే ఇక్కడి ప్రజలు గెలిపించడం ఖాయమన్న ధీమా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ లో రోజురోజుకు ఎక్కువ అవుతోందట..!