విజయసాయి వార్నింగ్ వైసీపీలో వారికేనా?

జగన్ మనుషులు కాకపోతే పార్టీలో ఉండరు, పదవులు కూడా అసలు పొందలేరు. ఇక జగన్ కి నచ్చని వారు వైసీపీ కాంపౌండ్ లో కనీసంగా కూడా అడుగు [more]

Update: 2021-03-13 08:00 GMT

జగన్ మనుషులు కాకపోతే పార్టీలో ఉండరు, పదవులు కూడా అసలు పొందలేరు. ఇక జగన్ కి నచ్చని వారు వైసీపీ కాంపౌండ్ లో కనీసంగా కూడా అడుగు పెట్టలేరు. ఆ మాటకువస్తే అంతా జగన్ మనుషులే. అలా వైసీపీలో జగనే అంతటా ఉన్నారు అనుకోవాలి. కానీ అధినేతకు ఇష్టులైన వారు, మనసుకు దగ్గరైన వారు కూడా ఉంటారు. మరి అలాంటి వారిలో ప్రప్రధముడిగా విజయసాయిరెడ్డిని చెప్పుకోవాలి. ఇంతవరకూ విజయసాయికి జగన్ మధ్య ఎంత దగ్గర అన్నది మీడియా మాత్రమే కనుగొని తోచిన రీతిన రాసేది. కానీ ఫస్ట్ టైమ్ విజయసాయిరెడ్డి కుండబద్దలు కొట్టారు.

జగన్ ప్రతినిధిని ….

తాను జగన్ మనిషిని. ఆయన పంపితేనే విశాఖకు వచ్చానని మొదటిసారిగా నోరు విప్పి విజయసాయిరెడ్డి చెప్పుకున్నారు. విశాఖ అభివృద్ధి కోసం తనను జగన్ పంపించారని కూడా ఆయన అంటున్నారు. జగన్ మనిషిని కాబట్టి తాను ఏదైనా చెబితే అది జరిగితీరుతుందని కూడా ఆయన గట్టిగానే చెబుతున్నారు. జగన్ ఏరి కోరి తనను పంపించారని, ఆయన మాట ప్రకారమే తాను ఏ కార్యక్రమం అయినా చేస్తూ వస్తున్నానని కూడా అసలు విషయాలను కూడా ఆయన చెప్పేశారు.

ప్లస్సేనా….?

జగన్ కి కుడిభుజం విజయసాయిరెడ్డి అని ఓ వైపు ఉన్నదీ లేనిదీ రాస్తూ మీడియా కోడై కూస్తూ వచ్చింది. ఇక విపక్షాలు అయితే ఈ ఇద్దరినీ వేరుగా అసలు చూడవు, పైగా కలిపి మరీ హాట్ కామెంట్స్ చేస్తాయి. అటువంటిది తాను జగన్ మనిషిని అంటూ విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా చెప్పుకోవడం వల్ల వచ్చిన లాభమేంటి అన్న చర్చ వైసీపీలో వస్తోంది. ఉత్తరాంధ్రా పార్టీ కార్యక్రమాల విషయంలో జగన్ విజయసాయిరెడ్డికి పూర్తి స్వేచ్చ ఏనాడో ఇచ్చేశారు. దీన్ని సహించిన వారంతా మిన్నకుండిపోతున్నారు. సహించలేని వారు అసంతృప్తి ఉన్నా కూడా లోలోపలే అలా దాచుకుంటున్నారు. అయినా సరే విజయసాయిరెడ్డి గట్టిగా ఇపుడు తానూ జగన్ వేరు కాదు అని చెప్పాల్సిన సందర్భం ఏముంది అన్నదే హాట్ టాపిక్ గా ఉంది. ఇలా చేయడం వల్ల విజయసాయిరెడ్డికి మైనస్ తప్ప మరేమీ లేదని కూడా అంటున్నారు.

గీత దాటుతున్నారా ?

విశాఖ సహా ఉత్తరాంధ్రా రాజకీయాల్లో వైసీపీ నేతలు పలువురు నేతలు గీత దాటుతున్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కూడా కొందరు పావులు కదుపుతున్నారని ప్రచారంలో ఉంది. దాంతో విశాఖలో పార్టీని పటిష్టం చేసే కీలక బాధ్యతలను మోస్తున్న విజయసాయిరెడ్డి తాను ఎవరో చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఆ విధంగా హెచ్చరిక కూడా ఇండైరెక్ట్ గా చేశారని కూడా వినిపిస్తోంది. మొత్తానికి జగన్ విజయసాయిరెడ్డిని తప్ప ఎవరినీ నమ్మరు అన్న నగ్న సత్యాన్ని ఆయన బయటపెట్టారు. మరి దీన్ని తట్టుకుని ఆయన్ని అనుసరించడానికి అసంతృప్తి నాయకులు రెడీగా ఉన్నారా. చూడాల్సిందే.

Tags:    

Similar News