విజయసాయిరెడ్డి గెలిచి ఓడారా…?

విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల పార్టీ బాధ్యతలను జగన్ తన కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి మీదనే పెట్టారు. ఆరేళ్ళుగా ఆయన విశాఖలోనే ఉంటున్నారు. ఒక విధంగా [more]

Update: 2021-03-16 06:30 GMT

విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల పార్టీ బాధ్యతలను జగన్ తన కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి మీదనే పెట్టారు. ఆరేళ్ళుగా ఆయన విశాఖలోనే ఉంటున్నారు. ఒక విధంగా ఆయన లోకల్ కిందే లెక్క. విశాఖలోనే ఫ్లాట్ కొనుక్కుని నివాసం ఉంటున్నారు. ఆయన ఢిల్లీ వెళ్ళినా అమరావతి వెళ్ళినా తిరిగి వచ్చేది విశాఖకే. అంటే ఆయన స్థిర నివాసం వైజాగే అన్న మాట. ఇక విజయసాయిరెడ్డి రాజకీయ చతురత వల్ల మొత్తం మూడు జిల్లాల రాజకీయాన్ని ఔపాసన పట్టేశారు. ఈ నేపధ్యంలో ఆయన విశాఖ లో వైసీపీలొ ఏకపక్ష విజయాన్ని తెచ్చిపెడతారని జగన్ సహా అంతా గట్టిగా నమ్మారు.

సగం విజయమే ….?

అయితే ఫలితాలు చూసుకునేసరికి అరవై శాతమే విజయం దక్కింది. మిగిలిన నలభై శాతం విపక్షాలకు వదిలేశారు. పట్టుమని పది సీట్లకే టీడీపీని కట్టడి చేయాలని హై కమాండ్ ఆదేశంగా ఉంటే ఏకంగా మూడు పదుల సీట్లకు పసుపు పార్టీ ఎగబాకింది. ఉనికిలో లేని జనసేన మూడు సీట్లలో గెలిచింది. అమరావతి రాజధానిని మూడవ వంతుకు తగ్గించినా గుంటూరు, విజయవాడలో అద్భుతమైన విజయాలు వైసీపీకి దక్కాయి. విశాఖను పాలనా రాజధానిగా చేసినా దాదాపుగా వంద సీట్లు ఉన్న జీవీఎంసీలో వైసీపీ తన టార్గెట్ కి పాతిక సీట్ల దూరంలోనే ఆగిపోయింది. దాంతో వైసీపీ అగ్రనాయకత్వం సైతం అసంతృప్తిని వ్యక్తం చేసిందని భోగట్టా.

అంతా తానే అయి….

ఇక జగన్ విజయసాయిరెడ్డికి పూర్తిగా స్వేచ్చ ఇచ్చారు. ఎవరిని పార్టీలోకి చేర్చుకున్నా కూడా నో అబ్జక్షన్. ఇక ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆయన ఇష్టం. 98 సీట్లకు గానూ 80కి తక్కువ రాకుండా చూడాలన్నది హై కమాండ్ ఆదేశం, కానీ బొత్తిగా 58 సీట్ల వద్దనే వైసీపీ పరుగు ఆగిపోయింది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. కానీ ప్రధానంగా విజయసాయిరెడ్డినే పార్టీ అగ్ర నాయకత్వం వేలెత్తి చూపిస్తోంది అంటున్నారు. దాంతో ఏకంగా మీడియా సమావేశంలోనే సాయిరెడ్డి తనకు ఈ ఫలితాలు అసంతృప్తిని కలిగించాయని ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది.

ఎన్నో తప్పులు….

అభ్యర్ధుల ఎంపికను విజయసాయిరెడ్డే చేశారు. అంతే కాదు అయితే వారిలో ఏకంగా నలభైమంది ఓడిపోయారు. ఆశపెట్టుకున్న గాజువాకలో 11 వార్డులు జారిపోయాయి. పెందుర్తిలో అయిదు, విశాఖ సౌత్ లో అయిదు, భీమిలీలో మరో అయిదు ఇలా పాతికకు పైగా సీట్లు వైసీపీ కోల్పోవడానికి విజయసాయిరెడ్డి వ్యూహాత్మకమైన తప్పిదాలే కారణం అంటున్నారు. గాజువాకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రగులుతూంటే దానికి ధీటైన జవాబు వైసీపీ నుంచి ఇవ్వలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. విశాఖ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని వైసీపీలోకి తీసుకువచ్చినా గ్రూపులు పెరిగాయి తప్ప ఫలితం ఏమీ లేకుండా పోయిందని కూడా అంటున్నారు. మరో వైపు వైసీపీ రెబెల్స్ ని బుజ్జగించలేకపోవడం టీడీపీ, ఇతర పార్టీల రాజకీయలను అంచనా వేయలేకపోవడం, సామాజిక సమీకరణలను కూడా బేరీజు వేసుకోవడంలో వైఫల్యం చెందడం వల్లనే గ్రాండ్ విక్టరీకి వైసీపీ దూరం అయింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి విజయసాయిరెడ్డి గెలిచి ఓడారని అంటున్నారు. మరి ఇప్పటిదాకా విశాఖలో చక్రం తిప్పిన ఆయనకు రేపటి రోజున పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అన్న చర్చ అయితే మొదలైంది.

Tags:    

Similar News