విజయసాయికి వ్యతిరేకంగా కొత్త స్నేహాలు…?

విశాఖ కార్పొరేషన్ వైసీపీ గెలుచుకుంది అంటే గెలుచుకుంది అని చెప్పాలి. నిజానికి వైసీపీ ఏకపక్ష విజయం ఏమీ అక్కడ సాధించలేదు. అలాగే అతి పెద్ద మెజారిటీని కూడా [more]

Update: 2021-04-08 15:30 GMT

విశాఖ కార్పొరేషన్ వైసీపీ గెలుచుకుంది అంటే గెలుచుకుంది అని చెప్పాలి. నిజానికి వైసీపీ ఏకపక్ష విజయం ఏమీ అక్కడ సాధించలేదు. అలాగే అతి పెద్ద మెజారిటీని కూడా సాధించలేదు. సింపుల్ మెజారిటీతోనే కార్పొరేషన్ ని దక్కించుకుంది. ఇక పక్కల్లో బల్లెం మాదిరిగా 30 మంది కార్పొరేటర్లతో టీడీపీ స్ట్రాంగ్ అపోజిషన్ గా ఉంది. మరి యోధానుయోధులను పార్టీలోకి చేర్చుకుని ఎన్నో రకాలైన వ్యూహాలు అమలు చేసిన తరువాత కూడా వైసీపీకి ఈ పరిస్థితి ఏంటి అన్న డౌటే అందరిలోనూ వస్తోంది.

ఎంపీ వర్సెస్ ఎంపీ…..

ఈ మాట అంటే బయటకు ఎవరూ ఒప్పుకోరు. పైగా అంతా ఒక్కటి అని కూడా చెబుతారు. కానీ విశాఖ లోక్ సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి పడదు అన్న ప్రచారం అయితే ఉంది. మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రాలో అతి పెద్ద నాయకుడిగా బీసీ నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ విజయసాయిరెడ్డి ఆధిపత్యాన్ని సహించరు అన్న మాట కూడా ఉంది. ఆయన ఈ మధ్య ఏకంగా ఎంవీ ఎంవీవీ ఇంట్లోనే మీడియా సమావేశం పెట్టారు. అంటే ఈ ఇద్దరి మధ్య సరికొత్త స్నేహం నూతన సాన్నిహిత్యం వెల్లి విరుస్తోందని అర్ధమవుతోంది కదా.

బయటపెట్టారా…?

ఇక తనకు మేయర్ సీటు దక్కకపోవడానికి వైసీపీలో వర్గ పోరే కారణమని సీనియర్ నేత వంశీ క్రిష్ణ శ్రీనివాస్ బాహాటంగానే మీడియా ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. దీని పరమార్ధం ఏంటి అంటే పైకి కనిపిస్తున్నంత అందంగా వైసీపీలో నేతల కాపురం ఏమీ లెదని అంటున్నారు. ఇక పార్టీలో తొలి నుంచి ఉన్న వారు, తరువాత చేరిన వారు, ఎన్నికల ముందు ఆ తరువాత వచ్చి చేరిన వారి మధ్యన తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. మాజీ టీడీపీ తమ్ముళ్ళకు వైసీపీ రియల్ లీడర్లకు మధ్యన పోరు ఒక రేంజిలో సాగుతోంది. వీటితో పాటు విజయసాయిరెడ్డి హై హ్యాండ్ మీద సీనియర్ నేతలు గుర్రుగా ఉంటూ వర్గాలను ప్రోత్సహిస్తున్నారు అన్న ప్రచారమూ ఉంది.

పవర్ తగ్గిందా …?

విజయసాయిరెడ్డి విశాఖ బాధ్యతలను భుజాన వేసుకున్నా కూడా మేయర్ ఎన్నికల్లో పార్టీ ఆశించిన విజయాలు సాధించలేదన్న అసంతృప్తి హై కమాండ్ కి ఉంది అంటున్నారు. దాంతో గతంతో పోలిస్తే విజయసాయిరెడ్డి పలుకుబడి హై కమాండ్ వద్ద పలుచన అయిందని కూడా చర్చ సాగుతోంది. దాంతో ఇదే అదనుగా వైసీపీలో వైరి వర్గాలు తమ జోరుని పెంచాయని అంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్ల మధ్య కూడా ఈ వర్గ పోరు ప్రభావం కనిపిస్తోంది. మొత్తానికి వైసీపీలో కొత్త కనబడని స్నేహాలు చాలానే ఉన్నాయి. బయట నుంచి టీడీపీ వారితో దోస్తీ చేసే వారూ ఉన్నారు. ఇలా ఫ్యాన్ పార్టీలో గ్రూపులు పెరిగి ఐక్యత తరిగి ఎటు వైపు సాగుతోందో అన్న బెంగ మాత్రం అసలైన కార్యకర్తలకు ఉందిట.

Tags:    

Similar News