స్వపక్షంలో కూడా బ్యాడ్ అవుతున్నారా..?

ఏపీలో జగన్ కి కుడిభుజం విజయసాయిరెడ్డి అన్న పేరు ఉంది. ఆయన హవా ఢిల్లీలో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఏం విజయసాయిరెడ్డీ అంటూ ఏకంగా ప్రధాని [more]

Update: 2021-04-21 15:30 GMT

ఏపీలో జగన్ కి కుడిభుజం విజయసాయిరెడ్డి అన్న పేరు ఉంది. ఆయన హవా ఢిల్లీలో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఏం విజయసాయిరెడ్డీ అంటూ ఏకంగా ప్రధాని మోడీ పిలిచేటంతగా. ఇక జగన్ విపక్షంలో ఉన్నపుడు విజయసాయిరెడ్డి ఏకంగా ప్రధాని ఆఫీస్ లోనే దర్శనమిచ్చేవాడు అని అప్పట్లో టీడీపీ గగ్గోలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. విజయసాయిరెడ్డి ఢిల్లీ లాబీయింగ్ గురించి కధలు కధలుగా చెప్పుకున్న రోజులు ఉన్నాయి. ఇపుడు కూడా విజయసాయిరెడ్డి ఏం తక్కువ కాదు, వైసీపీకి ఢిల్లీలో పెద్ద దిక్కు. ఆ పార్టీ పార్లమెంటరీ విభాగం కన్వీనర్. జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా.

కెలికితే తప్ప….

మరి విజయసాయిరెడ్డికి ఒక సరదా ఉంది. దాన్ని విపక్షాలు దురద అని అంటాయి. ఆయన తెల్లారిలేస్తే పుంఖానుపుంఖాలుగా ట్వీట్లు పెడుతూ ఉంటారు. ఆ ట్వీట్లతో ఆయన ఏకంగా చంద్రబాబుని, లోకేష్ ని వీర లెవెల్ లో కెలుకుతారు. చంద్రబాబుని ఎంతలా తిట్టాలో అంతలా తిట్టే నేత దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క విజయసాయిరెడ్డి అనే అంటారు. ఇదిలా ఉంటే ఆయనకు ఆ మధ్య దాకా కౌంటర్ ఇచ్చేవారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఆయన కూడా ఇపుడు అలసిపోయారు. దాంతో విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఒక్క లెక్కన మోత మోగిపోతోంది.

అడ్డంగా దొరికారా ..?

ఇక చంద్రబాబు బర్త్ డే వేళ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారంతా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. జగన్ సైతం చంద్రబాబు హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. కానీ విజయసాయిరెడ్డి గ్రీటింగే చాలా వంకరగా ఉంది. ఆయన ఏకంగా చంద్రబాబుని బ్లాక్ టికెట్లు అమ్ముకున్న రోజుల నుంచి జీవితం మొదలెట్టారు అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు బాబుకు నలుపు అంటే ఎంతటి ప్రేమో అంటూ సెటైర్లు వేశారు. జీవితకాలమంతా కష్టపడి నల్లధనం కూడబెట్టారు అంటూ బాగానే ట్వీట్లు పండించారు. ఇక బాబుని 420 అంటూ కూడా దారుణమైన పదమే వాడారు. కానీ ఇదే ఇపుడు విజయసాయిరెడ్డిని స్వపక్షంలో కూడా బ్యాడ్ చేస్తోంది. పుట్టిన రోజు పూట అయినా కాస్తా సహనం పాటించకపోతే ఎలా అన్న మాట సొంత పార్టీ నుంచే వస్తోంది.

చెలరేగిన రాజు …..

సరిగ్గా ఈ పాయింటే పట్టుకుని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు చెలరేగిపోయారు. పెద్ద మనిషిగా ఉన్న సాయిరెడ్డికి సంస్కారం అసలు లేదని ఆడిపోసుకున్నారు. జగన్ సైతం హుందాగా విషెస్ చెబితే విజయసాయిరెడ్డికి ఏమొచ్చింది అంటూ నిప్పులు చెరిగారు. ఈయన్నా వైసీపీ జాతీయ కార్యదర్శిగా ఉంచాల్సింది వెంటనే తప్పించేయాల్సిందే అంటూ రాజు డిమాండ్ కూడా చేశారు. అంతే కాదు విజయసాయిరెడ్డి ఎంపీలకు పెద్దగా కూడా ఉండడానికి అనర్హుడు అంటూ గట్టిగానే తగులుకున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళకు రాజుకు చాన్స్ దొరికింది అంటున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్ల పోకడల మీద సొంత పార్టీలోనే అపుడపుడు నిరసనలు వ్యక్తమవుతాయి. ఆయన ఎపుడూ హద్దులు దాటేస్తారు అని కూడా నేతలు అంటూంటారు. ఇపుడు ఆయన దరిద్రపు ట్వీట్లు ట్వీటుతున్నాడు అంటూ రెబెల్ ఎంపీ అనడం ద్వారా సొంత పార్టీలో ఆయన మీద బాగానే నిప్పు రాజేశాడనుకోవాలి.

Tags:    

Similar News