ఆయన అర్జంటుగా వెళ్ళిపోవాల్సిందే… ?

ఈ రకమైన వింత డిమాండ్ ని ఎవరూ ఇప్పటిదాకా విని ఉండరు. అసలు అలాంటివి ఎవరూ చేసి కూడా ఉండరు. రాజకీయాలు ఎంత దిగజారిపోయినా, నైతిక విలువల [more]

Update: 2021-06-24 13:30 GMT

ఈ రకమైన వింత డిమాండ్ ని ఎవరూ ఇప్పటిదాకా విని ఉండరు. అసలు అలాంటివి ఎవరూ చేసి కూడా ఉండరు. రాజకీయాలు ఎంత దిగజారిపోయినా, నైతిక విలువల పతనం ఎంతలా పాతాళానికి చేరుకున్నా కూడా ఎవరూ ఈ తరహా కోరికలు కోరరు. కానీ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం విశాఖ విపక్షం గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఆయన విశాఖను వదిలిపోవాలట. పోనీ పొరుగున ఉన్న విజయనగరమో, శ్రీకాకుళంలోనో కూడా ఉండరాదేరాదుట. ఆయన ఏకంగా ఉత్తరాంధ్రా దరిదాపుల్లో లేకుండా మూటా ముల్లె సర్దుకుని వచ్చిన చోటుకే వెళ్ళిపోవాలట. ఇదేమైనా బాగుందా తమ్ముళ్ళూ అంటే అవును అలాగే జరగాలి, అదే మా డిమాండ్ అంటున్నారు పసుపు పార్టీ నేతలు.

ఎందుకలా ..?

ఒక్క విజయసాయిరెడ్డి, అవతల దశాబ్దాల తరబడి రాజకీయం చేస్తున్న వారున్నారు. వేళ్ళన్నీ పూర్తిగా భూమి లోతుల్లో పెనవేసుకుని పోయిన మహా రాజకీయ స్రష్టలు కూడా ఉన్నారు. మరి ఇంతమంది ఉద్ధండులు తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇటువైపు గట్టిగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి మాత్రమే ఉన్నారు. ఆయన వలస వచ్చిన నేత అట. పోనీ అలా అనుకున్నా అది విజయసాయిరెడ్డితోనే మొదలుకాలేదుకదా. ఎంతో మంది విశాఖ వచ్చి గెలిచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు కదా. మరి విజయసాయిరెడ్డితోనే వచ్చిన పేచీ ఏంటి అన్నదే ఇక్కడ అర్ధం కాని ప్రశ్న.

దోచేసుకుంటున్నారుట …..

విజయసాయిరెడ్డి విశాఖ మొత్తాన్ని దోచేసుకుంటున్నారుట. ఆయన వచ్చాక భూ కబ్జాలు ఎక్కువయ్యాయట. ఆయన్ని భరించలేమని చెప్పేస్తున్నారు. పోనీ ఆయన భూ కబ్జాలు చేశారు అనే అనుకున్నా రెండేళ్ల క్రితం దాకా ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే కదా. ఆయన 2016 నుంచి విశాఖలోనే ఉంటున్నారు కదా. నాడు లేని ఆరోపణలు ఇపుడే ఎందుకు వస్తున్నాయి. అంటే ఆయన ప్రత్యర్ధులకు కొరకరాని కొయ్య అయ్యారు. ప్రతిపక్షా నేతల భూ కబ్జాల మీద ఉక్కు పాదమే మోపుతున్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉండనీ, మంత్రులు ఉండనీ, అధికారం అంతా ఆయన కనుసన్ననలోనే సాగుతోంది. విజయసాయిరెడ్డి ఆదేశాలతోనే జేసీబీలు కదులుతాయి. టార్గెట్ చేసిన భూముల్లోకి దిగి మూలాలు కదిలించేస్తాయి. అదే కదా ప్రత్యర్ధులకు పట్టుకున్న భయం అని వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట.

ఇదేం చాలెంజ్ …

ఇక తెలుగుదేశం నాయకులు మాటకు వస్తే చాలు చాలెంజ్ చేస్తున్నారు. ఫలనా విషయంలో మా తప్పు లేదని రుజువు చేసుకుంటాం, మరి విజయసాయిరెడ్డి విశాఖ వదిలిపెట్టి వెళ్ళిపోతారా, ఆయన ఉత్తరాంధ్రా పొలిమేరలలో ఉండను అని మాట ఇస్తారా అంటూ సవాళ్ళు చేస్తున్నారు. అసలు విజయసాయిరెడ్డికి విశాఖతో ఏం పని ఒక టీడీపీ నాయకుడు ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డి వచ్చి విశాఖను భ్రష్టు పట్టించేశారు అని మాజీ మంత్రి ఒకరు అంటారు. మొత్తానికి కన్నెర్రగా విజయసాయిరెడ్డి తయారు అయ్యారు. సరే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. అధికారంలో ఉన్న వారి నుంచి విపక్షానికి ఎపుడూ ఇబ్బందులు వస్తూంటాయి.అలాగని ఊరు విడిచిపోవాలని, అసలు విశాఖ అన్న ఊసే తలవద్దనే అధికారం ఎవరిచ్చారో మరి అంటున్నారు మేధావులు కూడా.

జగనే దిగివస్తే…?

నిజానికి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చు. ఆ విధంగానే కదా విశాఖ నిండా తెలుగుదేశం పార్టీ వలసనాయకులు పాతుకుపోయారు. మరి ఒక్క విజయసాయిరెడ్డి మీదనే ఎందుకు అభ్యంతరం. అంటే ఆయన్ని అసలు తట్టుకోలేకపోతున్నారట. మరి వైసీపీది చూస్తే గట్టిగా రెండేళ్ల పాలన మాత్రమే పూర్తి అయింది. మరో మూడేళ్ళు చేతిలో ఉంది. ఇపుడు విజయసాయిరెడ్డితోనే తట్టుకోలేక పొమ్మంటే రేపటి రోజున‌ సీఎం ఆఫీస్ తో సహా జగనే విశాఖ వచ్చేస్తున్నారు. మరి అపుడు పరిస్థితి ఏమిటి.. సీఎం ని పొమ్మనగలరా. లేక తామే పలాయనం చిత్తగిస్తారా. ఈ ముచ్చట రానున్న రోజులలో చూడాల్సిందే.

Tags:    

Similar News