ప్రమాణం సాక్షిగా… సాయన్న ఎక్కడ… ?

విశాఖ జిల్లాలో విజయసాయిరెడ్డి లేని వైసీపీ కార్యక్రమం అనేది జరగదు. ఈ సంగతి ఆరేళ్లుగా అందరికీ తెలిసిందే. ఆయన కనుసన్నలలోనే పార్టీ మొత్తం కలుగుతుంది. ఆయన కూడా [more]

Update: 2021-08-24 09:30 GMT

విశాఖ జిల్లాలో విజయసాయిరెడ్డి లేని వైసీపీ కార్యక్రమం అనేది జరగదు. ఈ సంగతి ఆరేళ్లుగా అందరికీ తెలిసిందే. ఆయన కనుసన్నలలోనే పార్టీ మొత్తం కలుగుతుంది. ఆయన కూడా అధినాయకత్వం మనిషిగా విశాఖలో పాలిటిక్స్ ని బాగా తిప్పుతున్నారు. ఇక ఎవరికి ఏ పదవి వచ్చినా రాకపోయినా కూడా విజయసాయిరెడ్డి వైపే అన్ని వేళ్ళూ చూపిస్తాయి. ఆయనకు అంత పట్టు ఉంది అని అంతా నమ్ముతారు. తాజాగా నామినేటెడ్ పదవులు విశాఖ జిల్లాలో చాలా మంది నేతలకు వచ్చాయి. వాటి వెనక విజయసాయిరెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయని అంటారు.

గాయబ్ వెనక …?

మొత్తానికి తన వారందరికీ పదవులు ఇప్పించుకున్న విజయసాయిరెడ్డి ఒక్కరంటే ఒక్క నేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. నార్త్ వైసీపీ ఇంచార్జి కే కే రాజు అంటే విజయసాయిరెడ్డి ఎక్కువగా అభిమానిస్తారు అని చెబుతారు. ఆయన కూడా విజయసాయిరెడ్డి వీలును చూసుకునే తమ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఫ్లెక్సీలలో కూడా సాయన్న ఫోటోలు భారీ సైజులో వేయించారు. తీరా చూస్తే విజయసాయిరెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన తీరుబాటుగా ఉన్నా కూడా ప్రియ శిష్యుడి ప్రమాణానికి రాలేదు అంటే ఏమనుకోవాలో ఎవరికీ అర్ధం కావడంలేదుట.

ఎవరి మీద అలక….

విజయసాయిరెడ్డి ఇపుడు హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఆయన ఢిల్లీ నుంచి ఎపుడూ విశాఖకు నేరుగా వస్తారు. విశాఖలోనే ఉంటూ ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేస్తారు. అలాంటి విజయసాయిరెడ్డి చాన్నాళ్ళుగా హైదరాబాద్ ఇంటిని విడిచి రావడంలేదు. ఆయన విశాఖ వైపుగా కూడా తొంగి చూడడంలేదు. మరి ఆయన అలక ఎవరి మీద అన్నదే చర్చగా ఉంది. అధినాయకత్వం మీద అలిగితే కధ వేరుగానే ఉంటుంది అంటున్నారు. ఆయన చెప్పిన బాధ్యతలు అన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ ఎందుకో గ్యాప్ ఏర్పడింది అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి కొన్ని విషయాల మీద హర్ట్ కూడా అయ్యారని చెబుతున్నారు. మరి ఆయన పెదవి విప్పరు కాబట్టి ఆయన విశాఖకు దూరం కావడం బట్టి ఏదో జరిగి ఉంది అనుకోవాలేమో.

ఓవర్ టూ ఢిల్లీ ….

ఇక విజయసాయిరెడ్డి పూర్తిగా ఢిల్లీకే పరిమితం అవుతారా అన్న మాట కూడా వైసీపీలో వస్తోంది. ఆయన గల్లీ రాజకీయాలకు అతి పెద్ద ఫుల్ స్టాప్ పడిపోతోంది అని కూడా అంటున్నారు. విజయసాయిరెడ్డి వల్ల లోకల్ గా పార్టీ బాగానే లాభం పొందింది కానీ మైనస్సులు కూడా ఉంటాయి. దాంతో హై కమాండ్ వాటిని పట్టుకుని విజయసాయిరెడ్డికి విశాఖకు దూరం కావాలని ఆదేశించిందా అన్నది కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి తన ప్రమాణ స్వీకారానికి రాని గురువు వద్దకు హైదరాబాద్ దాకా వెళ్ళి మరీ శిష్యుడు కే కే రాజు ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారో కానీ విశాఖ వైసీపీ మాత్రం ప్రస్తుతం కొంత నిరాశలోనే ఉంది. చూడాలి మళ్లీ సాయన్న జై విశాఖ అనుకుంటూ రంగంలోకి దూకుతారేమో.

Tags:    

Similar News