ఊరించమాకోయి… ఓ విజయసాయి

ఉత్తరాంధ్ర అభివృద్ధి కి వైసీపీ సర్కార్ కట్టుబడి ఉందని ఆ పార్టీ నేతలు ఆర్భాటంగా ప్రకటిస్తూండగానే సగం కాలం గడచిపోయింది. విశాఖ రాజధానికి ఎన్ని అడుగులు పడ్డాయి [more]

Update: 2021-09-17 14:30 GMT

ఉత్తరాంధ్ర అభివృద్ధి కి వైసీపీ సర్కార్ కట్టుబడి ఉందని ఆ పార్టీ నేతలు ఆర్భాటంగా ప్రకటిస్తూండగానే సగం కాలం గడచిపోయింది. విశాఖ రాజధానికి ఎన్ని అడుగులు పడ్డాయి అని ఎవరిని అడిగినా ఏం సమాదానం చెబుతారో తెలిసిందే. అది అలా ఉండగానే ఇపుడు వైసీపీ ఎంపీ ఉత్తరాంద్ర జిల్లాల పార్టీ ఇంచార్జి విజయసాయిరెడ్డి సరికొత్త పాట పాడుతున్నారు. ఒక్క విశాఖ ఏంటి విజయనగరం కూడా సూపర్ గా డెవలప్ చేసి పారేస్తామని అంటున్నారు. విశాఖ రాజధానితో పాటు మూడు జిల్లాలు ముందుకే సాగుతాయని కూడా సంబరంగా చెబుతున్నారు. ఇక ప్రగతి దారిలో పరుగులు తీయడమే తరువాయి అన్నట్లుగా విజయసాయిరెడ్డి హడావుడి ఉంది మరి.

జంటగా జాతర…

ఒంటి కనుకే దిక్కు లేదు అంటే జంట సంబరాలు అన్నట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విశాఖ అభివృద్ధి అన్నదే ఒక పక్కన సందేహాంగా ఉంటే విజయనగరం కూడా సూపర్ అంటూ విజయసాయిరెడ్డి చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. విశాఖ విజయనగరం రెండూ కూడా జంట నగరాలు అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలుగెత్తి చాటాడాన్ని ఎగతాళి చేస్తున్నారు,ఎద్దేవా చేస్తున్నారు. ముందు జరగాల్సిన పనులు చూడండని సెటైర్లు వేస్తున్నారు.

మాటలు చాలా…?

విశాఖ రాజధాని అన్నది 2020లలో బహు బాగుగా జనాల చెవులకు వినిపించింది. ఇపుడు రెండేళ్లు దాటాయి. ఇంకా సినిమా త్వరలో విడుదల అంటూ భారీ స్టేట్మెంట్లు ఇస్తేనే జనాలకు ఎక్కడో కాలుతోంది. అలాంటిది మొదటి దానికి మొగుడు లేడు కడడానికి కళ్యాణమన్నట్లుగా ఎవరు అడిగారు జంట నగరాలు అంటున్నారు జనాలు. ముందు విశాఖ సంగతి తెలిస్తే జనాలకు ఒక నమ్మకం కుదురుతుంది అని కూడా అంటున్నారు.

వారికే లాభం …

విశాఖ రాజదాని అనగానే రియల్ ఎస్టేట్ వారికి పండుగ అయింది. ఒక్కసారిగా ధరలు అన్నీ పెరిగిపోయాయి. భూములకు రెక్కలు వచ్చేసాయి. కబ్జాలు మీరు చేశారంటే మీరు చేసారంటూ వైసీపీ టీడీపీ నేతలు ఒకరి మీద ఇంకొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విశాఖలో సామాన్యుడు బతకడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఇపుడు విజయసాయిరెడ్డి ప్రకటన పుణ్యమాని విజయనగరంలో భూముల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయని అక్కడి జనాలు బెదురుతున్నారు. రియల్ దందాకు తప్ప ఈ ప్రకటనలు మరి దేనికి పనికిరావు అనే అంటున్నారు అంతా. మొత్తానికి ఊహల ఉయ్యాలలో ఉత్తరాంధ్రాను ఉపేస్తున్నారు అన్నదే నిష్టుర సత్యం, అదే అసలైన నిజం.

Tags:    

Similar News