సాయిరెడ్డికి సెగ తగులుతోందిగా…?

విజయసాయిరెడ్డి. నెల్లూరు పెద్దాయన. విశాఖకు అయిదేళ్ళ క్రితం వచ్చి ఏకంగా దత్తపుత్రుడే అయిపోయారు. ఆయన పార్లమెంట్ లో అడిగే ప్రశ్నలన్నీ విశాఖ సమస్యలు, అభివృధ్ధి గురించే. ఆయన [more]

Update: 2020-10-12 02:00 GMT

విజయసాయిరెడ్డి. నెల్లూరు పెద్దాయన. విశాఖకు అయిదేళ్ళ క్రితం వచ్చి ఏకంగా దత్తపుత్రుడే అయిపోయారు. ఆయన పార్లమెంట్ లో అడిగే ప్రశ్నలన్నీ విశాఖ సమస్యలు, అభివృధ్ధి గురించే. ఆయన విశాఖలో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతారు. ఢిల్లీ నుంచి మళ్ళీ విశాఖకే వస్తారు. ఆయన నెల్లూరుని ఎపుడో మరచిపోయారు. విశాఖలోనే ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు తీసుకుని పూర్తి మకాం పెట్టారు. వైసీపీ కూడా ఆయనకే ఉత్తరాంధ్ర పార్టీ కీలక‌ బాధ్యతలు అప్పగించింది. ఒక విధంగా విశాఖనే నమ్ముకున్న విజయసాయిరెడ్డి పక్కా లోకల్ అనే చెప్పాలి.

గుర్రు మీదున్న లోకల్స్……

కానీ రాజకీయం ఊరుకుంటుందా. లేనివన్నీ తెచ్చిపెట్టి మరీ తిట్టిపోసే పాలిటిక్స్ సాగుతున్న రోజులివి. అలాంటిది నెల్లూరులోనే పుట్టి పెరిగిన విజయసాయిరెడ్డి విశాఖ నాది అంటే ఊరుకుంటారా. ఈ విషయంలో మాత్రం లోకల్స్ అంతా ఒకే పార్టీ. ఇంకా ముందుకెళ్తే టీడీపీ అయితే విజయసాయిరెడ్డిని నాన్ లోకల్ అంటూ నానా యాగీ చేస్తోంది. ఎక్కడ నుంచో వచ్చి విశాఖలో పెత్తనం చేస్తే ఊరుకోమని గర్జిస్తోంది. పొరుగు జిల్లాల వారు వచ్చి దౌర్జన్యం చేస్తే ప్రశాంత విశాఖవాసులు అసలు తట్టుకోరు అంటూ టీడీపీ పెద్దలు సుద్దులు చెబుతున్నారు. అదే ఆయుధంగా చేసుకుని సాయిరెడ్డి మీద దండెత్తుతున్నారు.

వైసీపీలోనూ మంట….

నిజానికి ఈ రకంగా విభజించి పాలించు విధానాన్ని టీడీపీ నేతలు అనుసరిస్తున్నారు. విశాఖలో నాయకులు లేరా. ఎక్కడ నుంచో వచ్చి పెత్తనం చేస్తే సహించాలా అంటూ ఏకంగా వైసీపీలోని లోకల్ లీడర్స్ ని కూడా రెచ్చగొడుతున్నారు. తరచూ విజయసాయిరెడ్డి నాన్ లోకల్ పాలిటిక్స్ ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. విశాఖలోని జనాలను వైసీపీ నేతలు భయపెడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. కబ్జాలకు పాల్పడుతూ విశాఖవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని నిందలు వేస్తున్నారు. ఇలా వైసీపీ మీద, విజయసాయిరెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేలా అయ్యన్న తదితరులు ఒక పధకం విమర్శల జోరు పెంచుతున్నారు.

డ్యాన్సులు చేస్తే ఊరుకోం …..

ఇది టీడీపీ మాజీ ఎంపీ సబ్బం హరి హెచ్చరిక. ఎక్కడ నుంచో విశాఖ వచ్చి డ్యాన్సులు చేస్తే ఊరుకుంటామా అంటూ ఆయన కన్నెర్ర చేస్తున్నారు . విజయసాయిరెడ్డికి తామేంటో చూస్పిస్తామని కూడా చెబుతున్నారు. తాను పక్కా లోకల్ అని కూడా అంటున్నారు. ఇదంతా ఆయన తన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినందుకు ఆగ్రహం అన్నమాట. దాన్ని దాచి పెట్టి నాన్ లోకల్స్ అంటూ సాయిరెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు.

వారి సంగతేంటో…?

సరే విజయసాయిరెడ్డి నాన్ లోకలే అనుకున్నా టీడీపీ నిండా ఉన్న నాయకులంతా నాన్ లోకలే. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ నుంచి ఎంతో మంది ఇతర జిల్లాల నుంచి వచ్చి విశాఖలో రాజకీయం చేస్తున్నారు. రెండు సార్లు విశాఖ ఎంపీగా గెలిచిన ఎంవీవీఎస్ మూర్తి కూడా పొరుగు జిల్లావారే. నాడు కనీసం ఈ మాటను కూడా అనడానికి భయపడే టీడీపీ పెద్దలు ఇపుడు విజయసాయి రెడ్డి మీద విరుచుకుపడుతున్నారంటే అందులో ఫక్త్ రాజకీయం తప్ప మరేమీ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే జగన్ నీడగా ఉంటూ విశాఖ రాజకీయాలు గుప్పిట పట్టిన సాయిరెడ్డి మీద వైసీపీలోనూ వ్యతిరేకత కొంత వరకూ ఉందని అంటున్నారు. దాంతో నెల్లూరు పెద్దాయన ఎన్ని మంచిపనులు చేసినా కూడా ఈ నాన్ లోకల్ ట్యాగ్ తో ఆయనకు సెగలూ పొగలూ పెడుతున్నారని అంటున్నారు. చూడాలి మరి సాయిరెడ్డి దీన్ని ఎలా ఎదుర్కొంటారో.

Tags:    

Similar News