సాయిరెడ్డి అడ్డంగా బుక్ అయ్యారా…?

విశాఖ వైసీపీకి పెద్ద దిక్కు. జగన్ కుడి భుజం అయిన ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ చాణక్యంలో రాటుతేలారు. లేకపోతే ఎక్కడ నెల్లూరు, మరెక్కడ విశాఖ. ఇక్కడకు వచ్చి [more]

Update: 2020-11-28 03:30 GMT

విశాఖ వైసీపీకి పెద్ద దిక్కు. జగన్ కుడి భుజం అయిన ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ చాణక్యంలో రాటుతేలారు. లేకపోతే ఎక్కడ నెల్లూరు, మరెక్కడ విశాఖ. ఇక్కడకు వచ్చి పాలిటిక్స్ ని సర్దడం అంటే మాటలా. కానీ విజయసాయిరెడ్డి ఫుల్ గా సక్సెస్ అయిపోయారు. మొత్తం ఉత్తరాంధ్ర రాజకీయాన్ని తన గుప్పిట పట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే విజయసాయిరెడ్డి తాజాగా కేంద్ర పౌర విమాన యాన శాఖకు రాసిన ఒక లేఖ బయటకు రావడంతో ఇరకాటంలో పడ్డారు.

జనాగ్రహమేనా…?

విశాఖకు కొన్ని దశాబ్దాలుగా శివారు ప్రాంతంలో ఒక ఎయిర్ పోర్టు ఉంది. అది డొమెస్టిక్ ఎయిర్ పోర్టుగా విశేష సేవలు అందిస్తోంది. అయితే ఈస్టర్న్ నేవల్ కమాండ్ స్థలంలో ఉండడంతో వారి ఆంక్షలు చాలానే ఉంటున్నాయి. ఇక విస్తరణకు కూడా అడ్డుగా ఉంది. దాంతో టీడీపీ హయాంలో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని భోగాపురం వద్ద నిర్మించేందుకు ప్రతిపాదించారు. జీఎమ్మార్ కి టెండర్లు ఖరారు చేశారు. భూసేకరణ కూడా పూర్తి అయింది. ఇంతలో టీడీపీ దిగిపోయింది. వైసీపీ వచ్చకా అదే జీఎమ్మార్ కి కాంట్రాక్టుని ఖరారు చేసింది. ఇక రేపో మాపో జగన్ భోగాపురం ఎయిర్ పోర్టుకు శంఖుస్థాపన చేస్తారు. ఇదిలా ఉంటే విశాఖ ఎయిర్ పోర్టు ఏమవుతుంది అన్న బెంగ నగరవాసుల్లో చాలా కాలంగా ఉంది. దానికి విజయసాయిరెడ్డి కేంద్రానికి రాసిన లేఖతో నగరవాసులు ఆగ్రహం చెందుతున్నారు.

ఉంచాలన్నదే డిమాండ్….

విశాఖ ఎదుగుతున్న సిటీ. ఇపుడు విమానయానం బాగా పెరిగింది. మరో నాలుగైదేళ్ళలో 60 లక్షల మంది ప్రయాణీకులు విశాఖ నుంచి విమానయానం చేస్తారని నివేదికలు ఉన్నాయి. భోగాపురం వద్ద ఎయిర్ పోర్టు వద్దని, విశాఖ పోర్టుని విస్తరించాలని కూడా విశాఖ ఎయిర్ ట్రావెలెర్స్ అసోసియేషన్ కూడా చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. విశాఖకు 50 కిలోమీటర్ల దూరం ఉన్న భోగాపురంలో ఎయిర్ పోర్ట్ కడితే జనాలకు ఇబ్బంది అని కూడా విమర్శలు ఉన్నాయి. అయితే భోగాపురం ఎయిర్ పోర్ట్ వచ్చాక విశాఖ ఎయిర్ పోర్టుని ముప్పయేళ్ళ పాటు మూసేయాలని విజయసాయిరెడ్డి తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. దాంతో జనాల్లో ఆగ్రహం పెరిగింది. దానికి తోడు అగ్గి రాజేయడానికి టీడీపీ, జనసేన వంటి పార్టీలు రెడీ అయ్యాయి.

రెండూ కావాలి….

ఇక విశాఖలో దశాబ్దాలుగా ఉన్న ఎయిర్ పోర్టుని డొమెస్టిక్ అవసరాల కోసం కొనసాగించాలని, భోగాపురం ఎయిర్ పోర్టుని కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా ఉంచాలని ఇపుడు గట్టిగా డిమాండ్ ఊపందుకుంది. ఇక ఆలూ లేదూ చూలూ లేదు అన్నట్లుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ తయారు కాక ముందే ముప్పయ్యేళ్ళ పాటు విశాఖ ఎయిర్ పోర్టు మూసేయమని విజయసాయిరెడ్డి లేఖలు రాయడమేంటి అంటూ టీడీపీ జనసేన నాయకులు గట్టిగా తగులుకుంటున్నారు. నెల్లూరు నుంచి విశాఖ వచ్చి విద్వంస రాజకీయాలు సాయిరెడ్డి చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎటూ భోగాపురం ఎయిర్ పోర్టు తయారు అయితే విశాఖ ఎయిర్ పోర్టును అప్పటి అవసరాన్ని బట్టి మూసేస్తారో మానుకుంటారో కేంద్రం ఇష్టం. ఇప్పటి నుంచే విజయసాయిరెడ్డి లేఖలు రాయడం ఎందుకన్న మాట వైసీపీలో కూడా ఉంది. మొత్తానికి తెర వెనక ఒప్పందాల వల్ల, కొందరికి ప్రయోజనం చేకూర్చడానికి సాయిరెడ్డి ఇలా చేస్తున్నారని టీడీపీ అంటోంది. ఏది నిజమో ఏంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉందని అంటున్నారు. భోగాపురానికి ఇంకా కొబ్బరి కాయ కొట్టలేదు కానీ వివాదాలు రేగడం మంచిది కాదు అన్నది వైసీపీలో వినిపిస్తున్న తాజా మాట.

Tags:    

Similar News