సాయిరెడ్డి విషయంలో తేడా వచ్చిందా?

విశాఖకు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆయన పరిపాలనా రాజధాని అని ప్రకటించింది కూడా అందులో భాగమే. ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా విశాఖకు ఉన్న [more]

Update: 2021-01-09 13:30 GMT

విశాఖకు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆయన పరిపాలనా రాజధాని అని ప్రకటించింది కూడా అందులో భాగమే. ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా విశాఖకు ఉన్న ఉదుటున రాజధానిని షిఫ్ట్ చేయాలని జగన్ ఆలోచిస్తారన్న సంగతి తెలిసిందే. ఏపీలోని అన్ని ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా విశాఖ విషయంలో మాత్రం జగన్ ప్రత్యేక శ్రధ్ధ చూపిస్తారు. తన వారికే ఇక్కడ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. విజయసాయిరెడ్డిని ఎంపీగా చేసిన వెంటనే విశాఖకు పంపించడం వెనక జగన్ స్ట్రాటజీ ఏంటో నాడే అర్ధమైపోయింది.

అసంతృప్తి ఉందా…?

జగన్ కి తాను అనుకున్న పని చేసి పెట్టే నాయకులే కావాలి. తేడా వస్తే మాత్రం ఎవరికీ ఉపేక్షించరు. ఎంత పెద్ద వారైనా, తనకు ఎంత సన్నిహితులు అయినా సరే వారిని నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు. ఇపుడు తాను నమ్మిన బంటు, తన కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి విషయంలో జగన్ ఆలోచనలు ఒక్కసారిగా మారుతున్నాయా అన్న చర్చ అయితే పార్టీలో జోరుగా సాగుతోంది. జగన్ కి విజయసాయిరెడ్డి మీద ఎందుకు అంత అసంతృప్తి ఉంది అన్న సంగతిని కనుక చూస్తే చాలానే విషయాలు కనిపిస్తాయని అంటున్నారు.

ఆపరేషన్ ఆకర్ష్ ఫెయిల్….

విశాఖలో ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కసారిగా ఆగిపోయింది. పెద్ద తలకాయలు కొన్ని వైసీపీలోకి చేరలేదు. జగన్ అనుకున్న వారు చేరకుండా విజయసాయిరెడ్డి గండి కొట్టారన్న విమర్శలు అయితే ఉన్నాయి. నిజానికి గంటా శ్రీనివాసరావుని జగన్ పార్టీలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు కలసి ఆయన మీద వ్యతిరేక రాజకీయం నడిపి పార్టీలోకి రాకుండా చేశారన్నది ఒక ప్రధాన ఆరోపణ, అంతే కాదు, విజయసాయిరెడ్డి ఒకవైపే చూస్తున్నారని, ఆయన కూడా వైసీపీలో ఒక వర్గానికి కట్టుబడిపోయారని విమర్శలు ఉన్నాయట. దీంతో ఆయన స్థానంలో తన సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి విశాఖ పార్టీ బాధ్యతలు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారని వార్తలు అయితే వస్తున్నాయి.

ఫ్యామిలీ అయితే మేలు….

ఎటూ రాజకీయంగా రాటుదేలిన తన సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అయితే సౌమ్యంగా ఉంటారని, దాంతో పాటు అందరితో ఆయనకు మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. కొత్త ఏడాది చేసే సరికొత్త మార్పులలో భాగంగా వైవీ సుబ్బారెడ్డిని విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జిని చేసి కాబోయే రాజధాని రాజకీయాన్ని మరింత దగ్గరగా ఓడిసిపడతారని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి విషయంలో కనుక జగన్ ఆలోచనలు వేరుగా ఉంటే కచ్చితంగా వైసీపీలో కీలకమైన మార్పులు తొందరలోనే చూడవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News